Share News

అయ్యో అంజలి..

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:06 AM

ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఎస్బీఐ బ్యాంకులో పని వుండి భర్తతో వచ్చింది. బ్యాంకు మొదటి అంతస్థులో ఉండటంతో మెట్లు ఎక్కడంతో ఆమెకు రక్త స్రావం అయి ప్రమాదకర పరిస్థితికి గురైంది. ఆస్పత్రికి తరలించాక ప్రసవమైంది. బిడ్డ మృతి చెందింది.

అయ్యో అంజలి..
108 అంబులెన్సులో ఆదోని ఆసుపత్రికి తరలిస్తున్న బంధువులుబాధితురాలు , జాలమంచి అంజలి

మొదటి అంతస్థులోని బ్యాంకు మెట్లు ఎక్కడంతో గర్భిణికి రక్తస్రావం

ఆస్పత్రిలో మృత శిశువును ప్రసవించిన అంజలి

తల్లి పరిస్థితి కూడా విషమం

కోసిగి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఎస్బీఐ బ్యాంకులో పని వుండి భర్తతో వచ్చింది. బ్యాంకు మొదటి అంతస్థులో ఉండటంతో మెట్లు ఎక్కడంతో ఆమెకు రక్త స్రావం అయి ప్రమాదకర పరిస్థితికి గురైంది. ఆస్పత్రికి తరలించాక ప్రసవమైంది. బిడ్డ మృతి చెందింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురువారం కోసిగిలో జరిగింది. గ్రామంలోని 6వ వార్డుకు చెందిన జాలమంచలి అంజలి, సురేష్‌ దంపతులు ఎస్‌బీఐ బ్యాంకులో అకౌంటు పని నిమిత్తం వచ్చారు.

బ్యాంకు మొదటి అంతస్తులో ఉంది. మెట్ల మార్గం తప్ప.. లిప్టు సౌకర్యం లేదు. దీంతో అంజలి అతి కష్టం మీద మెట్లు ఎక్కి బ్యాంకులోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు రక్త స్రావం కావడం మహిళా ఖాతాదారులు గమనించి చెప్పారు. అప్పటికే తీవ్ర రక్తస్రావమై అంజలి కళ్లు తిరిగి అక్కడే కూర్చుండిపోయింది. ఏం చేయాలో భర్త సురేష్‌కు పాలుపోలేదు. బ్యాంకులోనే ఓ మూలన కూర్చున్నారు. వెంటనే బ్యాంకు సిబ్బంది చొరవతో ఆటోలో గర్భిణిని కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడికల్‌ ఆఫీసర్‌ డా. మనోజ్‌కుమార్‌, డా. రజిత స్టెచ్చర్‌ సిద్ధంగా ఉంచారు. గర్భిణిని డెలివరీ రూములోకి తీసుకెళ్లి పరీక్షలు చేశారు. కొద్ది సేపటికి అంజలి మగ మృత శిశువును ప్రసవించింది. అంజలి పరిస్థితి విషమంగా ఉంది. డా. రజిత మాట్లాడుతూ అంజలికి వచ్చే నెల 12వ తేదీ డెలివరీ తేదీ ఉందని, అయితే.. మెట్లు ఎక్కడం వల్లనే రక్తస్రావం జరిగి గర్భంలోనే మగ శిశువు మరణించిందని తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వ మదర్‌ అండ్‌ చైల్డ్‌ ఆసుపత్రికి 108 అంబులెన్సులో ఈఎంటీ నాగరాజు, పైలట్‌ భీమేష్‌ తరలించారు.

బ్యాంకు మెట్లు ఎక్కడంతోనే..

నేను, నా భార్య బ్యాంకు పని నిమిత్తం వచ్చాం.. బ్యాంకు మొదటి అంతస్తులో ఉండటంతో మెట్లు ఎక్కాం. నా భార్యకు రక్తస్రావమై ఆస్పత్రిలో ప్రసవించింది. మగబిడ్డ గర్భంలోనే మరణించాడు. బ్యాంకు మెట్లు ఎక్కడంతోనే ఇదంతా జరిగింది.- జాలమంచి సురేష్‌, గర్భిణి భర్త

Updated Date - Mar 07 , 2025 | 12:06 AM