Share News

ప్రతి ఊళ్లో ఆదర్శ పాఠశాల

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:15 AM

ప్రతి గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాలల విద్యా కమిషనర్‌ విజయరామరాజు తెలిపారు.

ప్రతి ఊళ్లో ఆదర్శ పాఠశాల
పాఠశాలల కమిషనర్‌ విజయరామరాజు

పాఠశాలల కమిషనర్‌ విజయరామరాజు

కర్నూలు ఎడ్యుకేషన్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాలల విద్యా కమిషనర్‌ విజయరామరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక జి. పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో జీవో నెం.117 ఉపసంహరణ, అనంతరం పరిణామాలు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల కేంద్రంగా అమలవుతున్న విద్యావిధానాలు క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని తెలిపారు. అలాగే పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు పాఠశాలల ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నదని కమిషనర్‌ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు ప్రభుత్వం రూ.24వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించిందన్నారు. 45వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1.88 లక్షల ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, 35 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపై అదికారులు, ఉపాధ్యాయులు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌ బాషా, నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి, కర్నూలు జేసీ డా.బి. నవ్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, కర్నూలు విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌, నంద్యాల విద్యాశాఖ అధికారి జనార్దన్‌ రెడ్డి, మండల స్పెషల్‌ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:15 AM