Share News

చంద్రప్రభ వాహనంపై అహోబిలేశుడు

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:01 PM

చంద్రప్రభ వాహనంపై అహోబిలేశుడు

చంద్రప్రభ వాహనంపై అహోబిలేశుడు
ఎగువ అహోబిలంలో చంద్రప్రభ వాహనంపై జ్వాలా నరసింహస్వామి

ఎగువ, దిగువ అహోబిలంలో కొనసాగుతున్న ఉత్సవాలు

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 8(ఆంధ్రజ్యోతి): అహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జ్వాలా, ప్రహ్లాదవరదస్వామి దివ్యమంగళమూర్తులు భక్త నీరాజనాలు అందుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శ్రీదేవీ, భూదేవి సమేత జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారు ఉదయం శేష వాహనంపై కొలువై మాడవీధుల్లో విహరించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, అర్చన నిర్వహించారు. తేజోమయుడైన జ్వాలా నారసింహుడు రాత్రి చంద్రప్రభ వాహనంలో విహరించారు. మైదుకూరు తహసీల్దార్‌ రాజసింహ నరేంద్ర దంపతులు ఉభయదారులుగా వ్యవహరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

దిగువలో యోగ నృసింహ సేవ : దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామికి యోగ నృసింహ గరుడ విమాన సేవ నిర్వహించారు. ప్రహ్లాదవరదుడిని ఉభయ దేవేరులతో యోగ నృసింహ అలంకరణలో కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్లను గరుడ విమానంపై కొలువుంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. అనంతరం రాత్రి ప్రహ్లాద వరదస్వామి హనుమంత వాహనంపై ఆశీనుడై మాడవీధుల్లో శోభాయమానంగా విహరించారు. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్‌, మణియార్‌ సౌమ్యనారాయణన్‌ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

నేటి పూజా కార్యక్రమాలు

అహోబిల వార్షిక బ్రహోత్మవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామికి ఆదివారం ఉదయం ఉత్సవం, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామివారు రాత్రి శరభ వాహనంపై భక్తాదులకు దర్శనమివ్వనున్నారు. అలాగే దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామికి రెండు వాహన సేవలు నిర్వహించనున్నారు. ఉదయం శేష వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు విహరించనున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:01 PM