మళ్లీ మొదటికి..!
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:28 PM
పత్తికొండ రహదారి విస్తరణ మళ్లీ మొదటికి వచ్చింది

వైసీపీ అడ్డగోలు సర్వేలతో వ్యతిరేకత
నిధులు రాకపోయినా హడావుడి చేసిన అప్పటి ఎమ్మెల్యే
కోర్టుకు వెళ్లి పనులను అడ్డుకున్న బాధితులు
ప్రభుత్వం జీవో జారీ చేయడంతో నిలిచిన పనులు
పత్తికొండ రహదారి విస్తరణ మళ్లీ మొదటికి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావుడి చేసినా అది ఎన్నికల కోసమే అని తెలిసిపోయింది. ఎన్నికలు సమీపించే సమయంలో సర్వే చేసి డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపారు. పట్టణ విస్తరణను ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికే అప్పటి ప్రభుత్వం రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. భూములు కోల్పోయేవారికి పరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావడంతో కొందరు బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో రహదారి విస్తరణ పనులు పెండింగ్‌లో పడిపోయాయి. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ గత ప్రభుత్వ హయాలో 25 శాతానికి తక్కువ పనులు జరిగిన టెండర్లను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. ఐదు శాతం పనులు పూర్తయినా పత్తికొండ రహదారి విస్తరణ పనులు తిరిగి రద్దు జాబితాలోకి వెళ్లడంతో విస్తరణ అంశం మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.
పత్తికొండ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
1994 నుంచే ప్రతిపాదనలు..
బ్రిటీష్ హయాంలో గుత్తి నుంచి ఆదోని వరకు ఏర్పాటు చేసిన హైవే రహదారి పత్తికొండ పట్టణం నడిబొడ్డున వెళ్లింది. అప్పట్లో 20 అడుగుల వెడల్పుతో ఈ రహదారిని ఏర్పాటు చేశారు. కాలక్రమంలో పట్టణం విస్తరించడంతోపాటు భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో రహదారి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో 1994లో అప్పటి ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి రహదారి విస్తరణకు సిద్దంకాగా పలుకారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో 1998లో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసి భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. 2010 నాటికి పట్టణం మరింత విస్తరించడం కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలు పెరగడంతో తిరిగి రహదారి ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో 2014లో డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి హయాంలో మున్సిపాలిటీగా మార్పు చేసి రహదారి విస్తరణ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే మున్సిపాలిటీ పనులు పెండింగ్‌లో పడడంతో రహదారి విస్తరణ పనులు ముందుకు సాగలేదు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన కంగాటి శ్రీదేవి తన పుట్టినరోజు వేడుకల్లో ఏడాదిలోగా రహదారి విస్తరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఆమె విస్తరణ అంశాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. నియోజవకర్గంలో ఎక్కువ శాతం ఓటు బ్యాంకు (30 వేల ఓట్లు) ఉన్న పత్తికొండ పట్టణాన్ని గెలుపు అస్త్రంగా ఎంచుకొని నాలుగేళ్లపాటు పట్టించుకొని రహదారి విస్తరణ అంశాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చారు.
రద్దు జీవోల జాబితాలో విస్తరణ పనులు
వైసీపీ హయాంలో చేపట్టిన విస్తరణ పనులు ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఐదు శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఊరి వాకిలి వరకు గ్రామ పంచాయతీ కాలువలపై నిర్మించిన భవనాలను తొలగించి కాలువలను నిర్మించారు. గ్రామ పంచాయతీ స్థలంలో ఉన్న కట్టడాలు తొలగించినట్లే పరిహారం చెల్లించకుండానే బాధితుల భవనాలను కూల్చి పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ వారు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిపివేశారు. తాజాగా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం విస్తరణ పనులు 25 శాతం లోపు ఉండడంతో రద్దయ్యాయి.
పారదర్శకత పాటించకపోవడంపై విమర్శలు
పట్టణంలో ఓటు బ్యాంకును పెంచుకునేందుకు రహదారి విస్తరణకు పూనుకున్న అప్పటి ఎమ్మెల్యే సర్వేల విషయంలో పారదర్శకత పాటించలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అంబేడ్కర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు 50 అడుగుల వెడల్పు, గుత్తి సర్కిల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు 40 అడుగుల విస్తీర్ణంతో మొత్తం 3.5 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన విస్తరణ పనుల్లో అప్పటి అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తుల భవనాల వద్ద అవసరం లేకపోయినా ఎక్కువ భూమి మార్కింగ్ వేయడం, వైసీపీ అనుకూల వర్గాలకు చెందిన ఇళ్ల వద్ద అవసరం ఉన్నా మార్కింగ్ చేయకుండా వదిలేయడం వంటి కారణాలతో సర్వేపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించడం, అధికారులు నిర్వహిం చాల్సిన సమావేశాల్లో అధికార పార్టీ నాయకులు పాల్గొనడం వంటి కారణాలతో ప్రజలు విసుగెత్తి పోయారు. మొత్తం బాధితులు 250 మంది ఉండగా తమ అనుకూల వర్గానికి చెందిన వారితో విస్తరణకు మద్దతుగా సంతకాలను సేకరించి మిగిలిన వారిపై ఒత్తిడి తేవడంతో వారు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. గుత్తి సర్కిల్‌లో వంద అడుగుల మేర రోడ్డును విస్తరించేందుకు సర్వేలు చేయడాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజా అవసరాల కోసం రహదారిని విస్తరించాలే తప్ప విగ్రహాల ఏర్పాటుకు భవనాలు కూల్చి తమను రోడ్డున పడేయడం ఎంతవరకు న్యాయం అంటూ గుత్తి సర్కిల్‌లో భవనాలు కో ల్పోయే బాధి తులు అధికారుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనికితోడు పూర్తిగా భవనాలు కోల్పోయే బాధితులకు పునరావసం కల్పించే అంశాన్ని కూడా అధికారులు పట్టిం చుకోలేదు. దీంతో వారందరూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో విస్తరణ పనులు పెండింగ్‌లో పడిపోయాయి.
ప్రజాభిప్రాయం ప్రకారం రహదారిని విస్తరిస్తాం
పత్తికొండ పట్టణంలో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలు చేపడుతున్నాం. 50 సంవత్సరాలుగా రహదారికి నోచుకోని తేరుబజార్‌లో సీసీ రహదారులు ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో రహదారి విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాం. అందరికీ ఆమోదయోగ్యంగా రహదారి విస్తరణ పనులు చేపడతాం. రహదారి విస్తరణకు సంబంధించి ఆర్‌అండ్‌బీ అఽధికారులు ఇప్పటికే నివేదికలు ప్రభుత్వానికి పంపారు. ఆయా శాఖల మంత్రులను కలిసి విస్తరణ ఆవశ్యకతను తెలియజేస్తుంది
- ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
విస్తరణ కోసం మరోసారి నివేదికలు పంపాం
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రహదారి విస్తరణ పనులు ఐదు శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం 25 శాతం తక్కువ పనుల జాబితాలో పత్తికొండ రహదారి విస్తరణ పనులు రద్దయ్యాయి. అయితే పత్తికొండ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, రహదారి విస్తరణ అవసరాన్ని తెలియజేస్తూ మరోసారి ప్రభుత్వానికి నివేదికను పంపించాం.
- వెంకటేష్, ఆర్‌అండ్‌బీ ఈఈ