గజవాహనంపై ఆదిదేవుడి వైభవం
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:14 AM
ఇల కైలాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

నేడు మహాశివరాత్రి
వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు
అద్భుత ఘట్టం పాగాలంకరణ, కల్యాణోత్సవం
భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరి
శ్రీశైలం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఇల కైలాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో ముస్తాబైన గజవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజాదికాలు, హారతులు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం నుంచి వెలుపలకి తీసుకొచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలను నిర్వహించి క్షేత్రవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. గ్రామోత్సవం ఎదుట కోలాటం, చెక్కభజన, తప్పెట్లు, డ్రమ్స్, భజంత్రీలు, శంఖునాదాలు మార్మోగాయి. గ్రామోత్సవం గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఉత్సవం కొనసాగింది. గజవాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. కాగా ఉత్సవ ఏర్పాట్లను డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ విష్ణుచరణ్, ఈఓ, శ్రీనివాసరావు, డీఎస్పీ రామాంజినాయక్ పరిశీలించారు.
ప్రధానఘట్టం పాగాలంకరణ
బుధవారం లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం అర్ధరాత్రి వేళ పాగాలంకరణ నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉంది. శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైల జ్యోతిర్లింగమూర్తికి మూడు తరాలుగా ఈ అద్భుత వేడుక జరుగుతోంది. శ్రీశైలంలో లింగోద్భవకాలాన జరిగే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం మూడు తరాలుగా శ్రీశైల మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. కల్యాణోత్సవానికి ముందు వరుడు మల్లన్నకు తలపాగా చుట్టే ఈ ఆచార శైలి అద్భుతంగా ఉంటుంది. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని పృథ్వీ కుటుంబం నేస్తుంది. మహాశివరాత్రి రోజున చిమ్మ చీకట్లో దిగంబరులుగా మారి స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, నవనందులను కలుపుతూ పాగాను అలంకరిస్తారు. ఈ సమయంలో ప్రధాన ఆలయంపైన విద్యుత్ వెలుగులు పడకుండా అలాగే సెల్‌ఫోన్లతో ఫొటోలు తీయనివ్వకుండా దేవస్థాన సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి ప్రధాన ఆలయం ద్వారాలు మూసివేస్తారు. ఈ సమయంలో ప్రధాన ఆలయం పరిసరాలు, వెలుపల భక్తుల శివనామస్మరణ చేస్తూ గడుపుతారు.