ఆదిదేవ.. నమస్తుభ్యం..!
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:58 PM
ముల్లోకాల్లో ఉన్న దేవుళ్లలో మన కంటితో చూడగలిగేది సూర్యుడిని మాత్రమే. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవమని పిలుస్తారు.

సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు
నేడు సూర్యభగవానుడి జయంతి
ముల్లోకాల్లో ఉన్న దేవుళ్లలో మన కంటితో చూడగలిగేది సూర్యుడిని మాత్రమే. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవమని పిలుస్తారు. రథసప్తమి రోజు ప్రత్యేకంగా సూర్యుడికి పూజ చేస్తారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమిగా నిర్వహించుకుంటాం. ఇదే రోజున సూర్య భగవానుడు జన్మించాడని అంటారు. సూర్య భగవానుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు. భూమిపై ఉన్న జీవరాశులను కాపాడే దేవుడు. సూర్యుడే ఎండను ఇవ్వకపోతే పంటలు పండక ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడి జీవరాశి అంతరించిపోయేది. అందుకే సూర్యుడిని దైవంగా పూజిస్తాం. సూర్య భగవానుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటారు. అందులో మొదటిది మకర సంక్రాంతికాగా, రెండోది రథసప్తమి. మంగళవారం రథ సప్తమి వేడుకకు సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో గుత్తిరోడ్డు సమీపంలో సూర్యనారాయణ స్వామి ఆలయ నిర్మాణం ఆకట్టుకుంటోంది. రాయలసీమలోనే మొదటిదిగా, రాష్ట్రంలో ఆరసవెల్లి తర్వాత రెండోదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం నిత్య పూజాది కార్యక్రమాలతో విరాజిల్లుతూ ఉంటుంది. మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ క్షేత్రం రోజురోజుకూ పెరుగుతున్న భక్తులతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతోంది. 2005లో నగర శివారులోని గుత్తిరోడ్డులో గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులు దత్తపీఠం ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆయన ఆశీస్సులతో 2014 ఫిబ్రవరి మాసంలో రథ సప్తమి రోజునే స్వామీజీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. 2019 ఫిబ్రవరి వసంత పంచమి రోజున గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆలయాన్ని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో నిత్య పూజలు, హోమాలు జరుగుతూనే ఉన్నాయి.
సూర్యనారాయణుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు
ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడిన ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఉత్తరాయన పుణ్యకాలంలో మొదటి శుక్షపక్ష సప్తమి రోజున రథసప్తమి వస్తుంది. ఇహానికి, పరానికి కావలసినవి అందిస్తున్న ఆ దినకరునిడి పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయి. ఉత్తరాయన పుణ్యకాలంలో మనకు వచ్చే మొదటి శుక్షపక్ష సప్తమి రోజున రథసప్తమి వస్తుంది.ఆరోజున సూర్యుడిని పూజించే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
- సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు
ఏర్పాట్లు పూర్తి చేశాం
సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రస్తుతం ఆరో వార్షికోత్సవ వేడుకలు సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహిస్తున్నాం. రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఉంటాయి. 7 గంటలకు సూర్యనారాయణ స్వామి స్పటికములకు భక్తాదులు స్వయంగా అభిషేకము చేసే అవకాశం కల్పించాం. ఉదయం 10 గంటలకు అరుణ హోమము, సూర్య పంచాతన హోమము, మహా పూర్ణాహుతి అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు హైదరాబాదుకు చెందిన డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యంచే భక్త గాన లహరి కార్యక్రమం ఏర్పాటు చేశాము.
- టీఎస్ రామకృష్ణ, దేవస్థానం అధ్యక్షుడు