పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు: డీపీవో
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:58 PM
పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీపీవో భాస్కర్ హెచ్చరించారు.
కోసిగి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీపీవో భాస్కర్ హెచ్చరించారు. రెండు రోజుల క్రితం కోసిగిలోని 3వ వార్డు వాల్మీకినగర్‌లో ప్రబలిన విషజ్వరాలు అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురిత మైన కథనానికి స్పందించి శనివారం డీపీవోతో పాటు డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్య స్వామి, ప్రభుత్వ వైద్యాధికారుల ఆధ్వర్యంలో వాల్మీకి నగర్‌ను పరిశీలించారు. డీపీవో మాట్లాడుతూ పారిశుధ్యంపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు వచ్చినప్పటి నుంచి పంచాయతీ సిబ్బంది బాగా వస్తున్నారనీ, అంతకుముందు సరిగ్గా రావడం లేదన్నారు. అనంతరం కాలనీవాసులు తమ కాలనీకి వచ్చే పైపులైన్ డ్రైనేజీలో కలిసిపోయి ఉండటంతో తాగునీరు కలుషితమై వస్తున్నాయనీ విన్నవించారు. కాలనీవాసులు, యువకులతో కలిసి అక్కడకు వెళ్లి తాగునీటి పైపులైన్ పరిశీలించి మురుగునీటిలో ఉన్న పైపులైన్ వాల్‌ను రెండు రోజుల్లోగా మార్చాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ తిమ్మరాజుకు పోన్ ద్వారా తెలియజేశారు. ఇంకా వారం రోజుల పాటు వాల్మీకి నగర్‌లో పారిశుధ్య పనులు, ఫాగింగ్ చేయాలని పంచాయతీ సిబ్బందికి, డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్యస్వామికి తెలియజేశారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వైద్యులతో కలిసి పరిశీలించారు. డా.ఇబ్రహిం, సామాజిక ఆరోగ్య అధికారిణి ఈశ్వరమ్మ, ఎంఎల్‌హెచ్‌పీ ఉదయ్, ఎంపీహెచ్‌ఈవో శ్రీనివాసులు, ఆరోగ్యకార్యకర్త మల్లికార్జున, ఏఎన్‌ఎం సుజాత, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.