ఇష్టానుసారంగా మ్యుటేషన్లు చేస్తే చర్యలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:17 AM
ఆర్‌వోఆర్ యాక్టు ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా భూముల మ్యుటేషన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్ బాషా తహసీల్దార్లను హెచ్చరించారు.

క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టండి
సమీక్షలో కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆర్‌వోఆర్ యాక్టు ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా భూముల మ్యుటేషన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్ బాషా తహసీల్దార్లను హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో మ్యుటేషన్‌లకు సంబంధించి నిర్వహించాల్సిన చర్యలు, ఫీల్డ్ విజిట్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మ్యుటేషన్, సర్వే ప్రక్రియ జరగాలన్నారు. ఆర్‌వోఆర్ యాక్టు ప్రకారం మ్యుటేషన్ చేసేటప్పుడు సంబంధించిన సర్వే నెంబరులోని పట్టాదారులకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడంతో పాటు పబ్లిక్ నోటీసు కూడా ఇవ్వాలన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత పొజిషన్‌లో ఉన్నారా..? ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనే వివరాలను వీఆర్వో క్షేత్రస్థాయిలో విచారణ చేయాలన్నారు. వెబ్‌ల్యాండ్‌లో అన్ని రికార్డులను సరి చూసుకుని సక్రమంగా ఉన్నాయా అని నిర్దారించుకున్న తర్వాత మాత్రమే మ్యుటేషన్ చేయాలన్నారు. ఆర్డీవోలు వారి స్థాయిలో చెక్ చేసిన తర్వాత ప్రతి నెలా అన్ని మండలాల నుంచి మ్యుటేషన్ ఫైల్స్‌ను కలెక్టరేట్‌కు తెప్పించుకుని వెరిఫై చేయాలని డీఆర్వోను ఆదేశించా రు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా జరుగుతున్న రీసర్వే ప్రక్రియను సవాలుగా తీసుకుని నిబంధనల ప్రకారం నిక్కచ్చిగా చేయాలన్నారు. కొందరు వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లు పాస్‌బుక్‌లు ఇచ్చేటప్పుడు సర్వేకి డబ్బు అడిగారనీ తమకు ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశిం చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వే శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.