Share News

నిందితుల అరెస్టు

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:43 PM

డోన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్రికె హరికిషన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో గురువారం డోన్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

డోన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హత్యాయత్నం కేసులో...

కారు, ద్విచక్రవాహనం సీజ్‌

వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసులు

డోన్‌ రూరల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): డోన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్రికె హరికిషన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో గురువారం డోన్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పి. శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. డోన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్రికె హరికిషన్‌ ఈ నెల 6వ తేదీ గుత్తి రోడ్డులో రాత్రి 9 గంటల సమయంలో స్కూటీపై వెళ్తుండగా.. వెనుక నుంచి కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకుని, వారి వివరాలను శుక్రవారం డీఎస్పీ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. డోన్‌ పట్టణం రాహుల్‌గాంధీ నగర్‌కు చెందిన సోమేష్‌ యాదవ్‌, నెహ్రూనగర్‌కు చెందిన ఆయన సోదరుడు సోమశేఖర్‌, మహ్మద్‌ రఫీ, సుందర్‌సింగ్‌ కాలనీకి చెందిన దూద్‌పీరా నిందితులుగా గుర్తించామని తెలిపారు. డోన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్రికె హరికిషన్‌ రాజకీయంగా ఎదుగు తున్నాడన్న అక్కసుతో హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. అలాగే నిందితుడు సోమేష్‌ యాదవ్‌ తమ్ముడు శేఖర్‌ యాదవ్‌ ఇంటి నిర్మాణాన్ని పడగొట్టడం వెనుక మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోట్రికె హరికిషన్‌ ఉన్నాడనే ఉద్దేశంతో ఈ ఘటన జరిగిందని అన్నారు. సోమేష్‌ యాదవ్‌, ఆయన తమ్ముడు శేఖర్‌ యాదవ్‌ కలిసి మహ్మద్‌ రఫీ, అతని అనుచరుడు దూద్‌పీరాలతో కలిసి కారుతో యాక్సిడెంట్‌ చేసి హరికిషన్‌ను హత్య చేయాలనుకున్నారని డీఎస్పీ తెలిపారు. గత నెల 27న హరికిషన్‌ గుత్తి రోడ్డులోని లారీ ట్రాన్స్‌పోర్టు ఆఫీసుకు వెళ్తుండగా.. మొదటిసారి కారుతో ఢీకొట్టించి హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారని, ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన లారీ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు నుంచి వస్తున్న హరికిషన్‌ను కారులో వేగంగా వెళ్లి ఢీకొట్టించారని తెలిపారు. ఈ ఘటనలో కోట్రికె హరికిషన్‌ చనిపోయాడని భావించి నిందితులు కారు దిగకుండా వేగంగా వెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు. హరికిషన్‌పై దాడికి వాడిన రాడ్లు, కారంపొడి ప్యాకెట్లు, కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి డోన్‌ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ హత్యాయత్నం కేసును చేధించడంలో పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా, రూరల్‌ సీఐ రాకేష్‌, ఎస్‌ఐలు శరత్‌ కుమార్‌ రెడ్డి, నరేంద్రకుమార్‌, క్రైం పార్టీ పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిందితుల్లో ఒకరైన సోమేష్‌ యాదవ్‌ ఇటీవల వైసీపీ మండల అధ్యక్షుడిగా నియమితుడు అయ్యాడు.

Updated Date - Jan 17 , 2025 | 11:43 PM