ఓ పోలీస్ స్టేషన్ కావాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:57 PM
ఓ పోలీస్ స్టేషన్ కావాలి

1.76 లక్షల జనాభాకు ఒక్కటే..
ఆ 16 వార్డుల్లో పెరిగిపోతున్న నేర సంస్కృతి
విస్తరించిన కాలనీలు.. కనిపించని రక్షణ చర్యలు
ఎప్పటి నుంచో అదనపు పోలీస్ స్టేషన్ కోసం డిమాండ్
పట్టించుకోని పోలీసు బాస్‌లు
నగరాన్ని ఆనుకున్న ఆ 16 వార్డుల్లోని పలు కాలనీల్లోని ప్రజలు చాలా కాలంగా ఓ పోలీస్ స్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ కాలనీలన్నీ పదిహేనేళ్ల కిందటే కర్నూలు మున్సిపాలిటీలో కలిశాయి. అప్పటి నుంచి ఆ కాలనీ శివారు ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. కాలనీలు విస్తరించాయి. జనాభా కూడా మూడు లక్షల పైమాటే. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు అర్బన్‌కు చెందిన 16 వార్డుల్లో 1.76 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇంత మంది జనాభా ఉన్న ఈ కాలనీలకు ఒక్క పోలీస్‌స్టేషన్ మాత్రమే ఉంది. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఇక్కడ మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రతిపాదన ఉంది. పలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకుని వదిలేస్తుండటం, కాలనీల్లో సరైన పోలీసింగ్ లేకపోవడంతో నేర ప్రవృత్తి పెరుగుతోంది.
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు అర్బన్ ప్రాంతానికి చెందిన 16 వార్డులు ఉన్నాయి. వీటిలో మూడు వార్డులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఉండగా మిగతావన్నీ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తున్నాయి. ఈ 16 వార్డుల్లో 60కి పైగా కాలనీలు ఉన్నాయి. ప్రధానంగా శరీన్‌నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, కల్లూరు తదితర ప్రాంతాల్లో నేర సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. పలు హత్య కేసుల్లో నిందితులు ఈ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. పాఠశాలలు, పార్కులు, పబ్లిక్ స్థలాలు హంద్రీనది వెంట విచ్చలవిడిగా పేకాట, బెట్టింగులు సాగుతుంటాయి. రాత్రయితే చాలు బీరు సీసాలు గళగళలాడుతుంటాయి. ఉదయాన్నే వచ్చే ఉపాధ్యాయులకు ఈ సమస్య తలనొప్పిగా మారింది. ఈ సమస్య ఎక్కువగా షరీన్ నగర్‌లోని పాఠశాలలో కనిపిస్తోంది. హంద్రీనది ఒడ్డు వెంట నిత్యం తాగుబోతులే కనిపిస్తుంటారు. మద్యం సేవించడానికి వెళ్లి ఒకరొకరు కొట్టుకుని ఎంతో మంది హత్యకు కూడా గురయ్యారు. మరోవైపు నగర శివారు కాలనీలు పెరుగుతు న్నాయి. అందమైన కాలనీలు రూపొందుతున్నా కొంత మంది ఆకతాయిలు, రౌడీషీటర్ల వల్ల ఈ ప్రాంతానికి మాస్ ఏరియాగా పేరు పడుతోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు కర్నూలు ఆర్టీసీ బస్టాండు పెద్ద సమస్య. నిత్యం వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ తరచుగా జరుగుతున్న దొంగతనాలతో పోలీసులే బెంబేలెత్తిపోతున్నారు. మరో వైపు బస్టాండు వెనుక ప్రాంతం పాత కల్లూరు ప్రాంతాల్లో ఉండే లాడ్జిల్లో నిత్యం బ్రోతలింగ్, పేకా ట వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిత్యం తాగుబోతులతో రద్దీగా ఉంటుంది.
ప్రధాన జంక్షన్
అటు బెంగళూరు.. ఇటు హైదరాబాదు, మరోవైపు బళ్లారి, ఆదోని ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ ఈ 16 వార్డుల్లో భాగంగానే ఉన్నాయి. దీంతో ఈ కాలనీలన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. ఓ వైపు ఆటోనగర్, కల్లూరు ఇండస్ర్టియల్ ఏరియా, పెద్ద పెద్ద హోటళ్లు, పాఠశాలలు, హాస్పిటల్స్, లోకాయుక్త కార్యాలయం ఇలా ఒకటేమిటి పెద్ద వాణిజ్య సముదాయాలే ఈ ప్రాంతంలో ఉన్నాయి.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా:
అర్బన్ వార్డుల్లోని కొన్ని కాలనీలతోపాటు ఆర్టీసీ బస్టాండు, బళ్లారి చౌరస్తా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఈ ప్రాంతాల్లోని కాలనీల్లో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి. ఓ గజదొంగ రెండేళ్లుగా 40 ఇళ్లలో వరుసగా చోరీలు చేసినా పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. దీన్నీ బట్టి విజిబుల్ పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు రిచ్‌మండ్ విల్లాస్‌లో, కోడుమూరు రహదారిలోని కొన్ని కాలనీల్లో నెలలో రెండు, మూడు దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ఉండటంతో నిత్యం జరిగే లావాదేవీలపై దొంగల కన్ను ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో ఒక్క పోలీసు కూడా కనిపించడు.
ఇదీ పోలీస్ స్టేషన్ల పరిస్థితి..
కల్లూరు అర్బన్‌లోని 16 వార్డుల్లో 3 వార్డులకు చెందిన గణేష్ నగర్, అరోరా నగర్, నంద్యాల చెక్‌పోస్టు, మారుతి మెగాసిటీ, చంద్రశేఖర్ నగర్, టెలికాంనగర్ ఇలా కొన్ని కాలనీలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. అలాగే కర్నూలు నియోజకవర్గం చెందిన ప్రధాన వార్డుల్లో కొన్ని ఈ స్టేషన్ పరిధిలోకే వస్తాయి. మరో వైపు కలెక్టరేట్, కలెక్టరేట్‌లో జరిగే ధర్నాలు, కలెక్టర్ భద్రత అవసరాల కోసం ఎక్కువ భాగం పోలీసింగ్ ఇక్కడే ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది. దీంతో శివారు కాలనీలపై పోలీసులు దృష్టి సారించలేకపోతున్నారు. మరో వైపు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన సిబ్బంది కంటే తక్కువ ఉండటం.. సుమారు 50 కాలనీలు ఈ స్టేషన్ పరిధిలోకి రావడం ఆటోనగర్, బస్టాండు ప్రాంతాల్లోనే నిఘా పెట్టడంతో శివారు కాలనీల్లో పోలీసులు శ్రద్ధ చూపలేకపోతున్నారు. దీంతో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే బావుంటుందని కొద్ది కాలంగా ఇక్కడ కాలనీవాసుల ప్రధాన డిమాండ్ ఉంది. ఇటీవల ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షరమే అండగా.. సమస్య పరిష్కారమే అజెండా కార్యక్రమానికి వచ్చిన వినతుల్లో తాగుబోతులు, ఆకతాయిల సమస్యలపైనే ఆ కాలనీవాసుల నుంచి వినతులు వచ్చాయి.
గతం నుంచే డిమాండ్:
ఈ అర్బన్ వార్డులో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్ ఉంది. గతంలో పని చేసిన పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈ కాలనీల ప్రజలు, ప్రజాప్రతినిధులు పలుసార్లు వినతులు ఇచ్చారు. 2019 సంవత్సరంలో అప్పుడు పని చేసిన ఎస్పీ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తించి ఓ పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉండేలా ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఈ అవుట్‌పోస్టు నామమాత్రంగానే మిగిలిపోయింది. అంతకుముందు పని చేసిన ఎస్పీలు కొన్ని పోలిస్ కమాండ్ కంట్రోల్ బాక్సులు ఏర్పాటు చేసి అక్కడకు కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసేవారు. చైన్ స్నాచింగ్ జరిగిన వెంటనే అక్కడి కానిస్టేబుల్ అప్రమత్తం అయ్యేవాడు. ప్రస్తుతం ఆ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు బూత్‌బంగ్లాగా మారాయి. కొన్ని కాలనీలు పోలీస్ స్టేషన్‌కు చాలా దూరంగా ఉండటంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు జరిగినప్పుడు పోలీసులు వెంటనే అప్రమత్తం కాలేకపోతున్నారు. నేరస్థులు ఎటు నుంచి తప్పించుకునే ప్రధాన రహదారులన్నీ కలిసి ఉండటంతో ఈ సమస్య మరింత వేధిస్తోంది.
లక్ష మంది జనాభాకు 144 మంది పోలీసులు ఉండాలి
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది జనాబాకు 144 మంది పోలీసులు ఉండాలి. ఈ లెక్కనే త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు మూడు లక్షలు పైగానే జనాభా ఉంది. ఫోర్త్ టౌన్ పరిధిలో సుమారు 45 మంది మాత్రమే. త్రీటౌన్ పరిధిలో 40 మంది పోలీసులు మాత్రమే శాంతిభద్రతల నిర్వహణకు ఉన్నారు. మూడు లక్షల మంది జనాభాకు 420 మంది పోలీసులు ఉండాలి. ఈ రెండు పోలీస్ స్టేషన్లకు కలిసి అటూ ఇటూగా వంద లోపే శాంతిభద్రతల కోసం వంద మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇంకా 300 మంది పోలీసుల కొరత ఉంది.
ఏం చేయాలంటే..
త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్డులను, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్డులకు ప్రత్యేకంగా మరో పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి ఈ నాలుగుతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే పోలీస్‌స్టేషన్‌ను పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉండేలా చేస్తే ఒక విజిబుల్ పోలీసింగ్ ఉంటే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకపోయినా గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఎస్‌ఐ, ఎస్‌హెచ్‌వోగా ఉండే ఓ పోలీస్ స్టేషన్, నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఎస్‌ఐ, ఎస్‌హెచ్‌వోగా ఉండే చిన్న పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి పోలీసింగ్ పెంచితే నేర సంస్కృతి తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఓ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి
మా నియోజకవర్గంలో కల్లూరు అర్బన్ వార్డులకు చాలా ప్రాధాన్యత ఉంది. అత్యధిక జనాభా ఇక్కడే ఉంది. ప్రత్యేకంగా ఓ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. ఇటీవల డీజీపీగా పని చేసిన ద్వారక తిరుమల్‌రావుకు కూడా ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై వినతి పత్రం అందించాం. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.
- గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే, పాణ్యం