ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:10 AM
జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు చేయూత ఇచ్చి ప్రోత్సాహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమల స్థాపనకు చేయూత ఇచ్చి ప్రోత్సాహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్పరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ర్టిక్ట్ ఇండస్ర్టియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ టమోటా, ఉల్లి, మిర్చి, మిల్లెట్స్‌కు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను గుర్తించి పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసకోవాలని పరిశ్రమల శాఖ, ప్రాసెసింగ్ శాఖ, ఉద్యానశాఖల అధికారులను ఆదేశించారు. ఓర్వకల్లు మెగా ఇండస్ర్టియల్ హబ్‌లో ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ రోడ్ల నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఆదేశించారు. ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు. కల్లూరు ఇండస్ర్టియల్ ఎస్టేట్ అభివృద్ధి అయ్యేందుకు వీలుగా ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రూ.1.69 కోట్ల ప్రోత్సాహకాలకు ఆమోదం
పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 17 క్లయిమ్‌లకు రూ.1.69 కోట్లకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ కింద 8 క్లెయిమ్స్‌కు సంబంధించి రూ.77,16,239, విద్యుత్ ఖర్చు రీయింబర్స్‌మెంటు కింద 6 క్లెయిమ్స్‌కు రూ.2,61,078, వడ్డీ రాయితీ రియింబర్స్‌మెంటు కింద 2 క్లెయిమ్స్‌కు రూ.2,11,846, సేల్స్ ట్యాక్స్ రీయింబర్స్‌మెంటు కింద ఒక క్లెయిమ్‌కి రూ.86,63,428 పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపారు. కేటగిరీల వారీగా జనరల్ కింద 5, ఎస్సీ కింద 8, ఓబీసీ కింద 4, మొత్తం 17 మందికి ప్రోత్సాహకాలు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి జీఎం అరుణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఐలా చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.