Share News

భక్తిశ్రద్ధలతో 16 రోజుల పండుగ

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:59 PM

మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహోత్సవాల అనంతరం 16 రోజుల పర్వదినం వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో 16 రోజుల పండుగ
మహానందిలో కామేశ్వరీదేవికి చీర, సారెను అందజేస్తున్న ఆర్యవైశ్య మహిళలు

మహానంది, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహోత్సవాల అనంతరం 16 రోజుల పర్వదినం వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని యాగశాల మంటపంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల తొలి రోజు చేసిన అంకురార్పణలో వచ్చిన మొలకలను క్షేత్రంలోని రుద్రగుండం కోనేరులో వేదపండితులు అధికారుల చేత కలిపారు. అనంతరం చండీశ్వరుడు, అస్త్ర దేవతలతో రఽథం వద్దకు వెళ్లి రథ దేవతలను ఉద్వాసన చేసి విశేష నైవేద్యాలు సమర్పించారు. మహానందికి చెందిన ఆర్యవైశ్య సంఘం మహిళలు ఆలయంలోని కామేశ్వరీదేవి అమ్మవారికి చీర, సారె అందజేశారు. దీంతో మహా శివరాత్రి రోజున జరిగిన కామేశ్వరీదేవి, మహానందీశ్వరుని కల్యాణ, బ్రహ్మోత్సవ దీక్ష నేటితో పూర్తవుతుందని ఆలయ వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మలు తెలిపారు. అనంతరం భక్తి శ్రద్ధలతో భక్తుల శివనామస్మరణ మధ్య రథాన్ని రథశాల లోకి లాగారు. ఆలయ పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, దేవిక, టెంపుల్‌ ఇన్‌స్పె క్టర్లు నీలకంఠరాజు, శ్రీనివాసులు, ఇంజనీరింగ్‌ అధికారి శ్రీనివాసులు యాదవ్‌, మహానంది ఆర్యవైశ్య సంఘం మహిళలు పాల్గొన్నారు.

బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాల అనంతరం పదహారు రోజుల పండుగను ఆలయ ఈవో నాగప్రసాద్‌ ఆద్వర్యంలో నిర్వహించారు. అర్చకులు మల్లికార్జున ముందుగా గంగా ఉమా సమేత సిద్ధేశ్వర స్వామి వార్లకు అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం రథానికి పున:స్థల పూజలు చేసి, రథ మండపంలోకి రథాన్ని చేర్చారు. చెన్నారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, నారాయణ, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

గడివేముల: మండలంలోని గడిగరేవుల గ్రామ సమీపంలో వెలసిన దుర్గాభోగేశ్వర ఆలయంలో గురువారం 16 రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రామానుజన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:59 PM