Share News

అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Jan 24 , 2025 | 12:00 AM

స్థానిక మహావీర్‌ నగర్‌లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ ముద్దాయికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ కర్నూలు సెషన్‌ పోక్సో కోర్టు న్యాయాధికారి భూపాల్‌ రెడ్డి గురువారం తీర్పు చెప్పారు.

అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
షేక్షావలిని జైలుకు తీసుకెళ్తున్న పోలీసులు

సంచలన తీర్పునిచ్చిన కర్నూలు పోక్సో కోర్టు

బాలికకు రూ.2లక్షల నష్టపరిహారం

కర్నూలు లీగల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక మహావీర్‌ నగర్‌లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఓ ముద్దాయికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ కర్నూలు సెషన్‌ పోక్సో కోర్టు న్యాయాధికారి భూపాల్‌ రెడ్డి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు బాధిత బాలిక(14) తన తల్లి, చెల్లితో పాటు స్థానిక మహావీర్‌నగర్‌లో ఉంటోంది. 2021 ఆగస్టు నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే వీధికి చెందిన నిందితుడు షేక్షావలి ఆమె ఇంట్లో అక్రమంగా ప్రవేశించి కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు ఆ బాలికను బెదిరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఇలాగే ఆ షేక్షావలి బాలికను భయబ్రాంతులకు గురి చేసి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. భయంతో ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఆ బాలిక కొద్దిరోజులుగా ముభావంగా ఉండటంతో గమనించిన బాలిక తల్లి కారణం అడగడంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి తెలియజేసింది. దీంతో బాలిక తల్లి కర్నూలు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముద్దాయి షేక్షావలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత అప్పటి మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ బి.వెంకట్రామయ్య కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో 20 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. బాధితురాలికి జరిమానా మొత్తంతో పాటు పోక్సో చట్టంలో పేర్కొన్న మేరకు రూ.2 లక్షలను నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించాలని న్యాయాధికారి తీర్పులో పేర్కొన్నారు.

పోలీసులను అభినందించిన ఎస్పీ

ముద్దాయికి శిక్ష పడేందుకు కృషి చేసిన అప్పటి మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ బి. వెంకట్రామయ్యను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వెంకటేశ్వరరెడ్డి, ప్రకాష్‌ రెడ్డిలను ఎస్పీ బిందుమాధవ్‌ అభినందించారు. మహిళలు, చిన్న పిల్లలపై లైంగికంగా వేధించే వారికి కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 12:00 AM