102 ఫిర్యాదుల స్వీకరణ
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:22 PM
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను చట్టపరిధికి లోబడి పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.

కర్నూలు క్రైం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను చట్టపరిధికి లోబడి పరిష్కరిస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. సోమవారం కర్నూలు నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 102 మంది బాధితులు తమ ఫిర్యాదులను అర్జీల రూపంలో అందజేశారు. రూ.3.50 లక్షలు తీసుకుని అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి వెంకటాపురం చెందిన శేఖర్, సుధాకర్‌లు మోసం చేశారని దేవరకొండ మండలం బేతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రూ.2.80 లక్షలు తీసుకుని నకిలీ ఇళ్ల పట్టాలు ఇప్పించి రమేష్ అనే వ్యక్తి మోసం చేశాడని పెద్డకడుబూరుకు చెందిన బోయ నరసింహులు ఫిర్యాదు చేశారు. తన కొడుకు రాజేష్ ప్రతి రోజు మద్యం సేవించి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని జోహరాపురానికి చెందిన నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఎన్టీఆర్ బిల్డింగులకు చెందిన మునాఫ్ అనే వ్యక్తి తనతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని రూ.4లక్షలు, 5 తులాల బంగారం తీసుకుని అన్యాయం చేశాడనీ కర్నూలుకు చెందిన నందిని ఫిర్యాదు చేశారు. కర్నూలు చెందిన వీరస్వామి రూ.8 లక్షలు, 5 తులాల బంగారు తీసుకుని హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడనీ ఆర్‌కే స్ర్టీట్‌కు చెందిన నాగరాజు ఫిర్యాదు చేశాడని ఎస్పీ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ అడ్మిన్ హుశేన్‌పీరా, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు శ్రీనివాస నాయక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.