Share News

Kurnool Kaveri Bus Tragedy: బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్‌

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:45 AM

కర్నూలు జిల్లాలో జరిగిన వి.కావేరి ట్రావెల్‌ బస్సు ప్రమాద ఘటనలో మరో కీలకాంశం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను వి.కావేరి ట్రావెల్‌ బస్సు తోసుకుంటూ వెళ్లడానికి ముందే..

Kurnool Kaveri Bus Tragedy: బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్‌

  • మంటగలిసిన మానవత్వం!

  • ‘బైకు ప్రమాదాన్ని’ చూసీచూడనట్లు వెళ్లిపోయారు

  • ఇబ్బందులు తలెత్తుతాయన్న భయమే కారణం

  • ఒక్కరైనా స్పందించి ఉంటే 19 ప్రాణాలు మిగిలేవి

  • ‘వి.కావేరి’ కంటే ముందే ‘ఆ బైకు’ను ఢీకొన్న వేరే బస్సు

  • దీంతో రోడ్డు మధ్యలోకి వచ్చిన ద్విచక్రవాహనం

  • పోలీసు విచారణలో కీలక మలుపు

  • 35 మందికి పైగా డ్రైవర్ల విచారణ

  • వి.కావేరి బస్సు డ్రైవర్‌ లక్ష్మయ్య అరెస్టు

కర్నూలు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో జరిగిన వి.కావేరి ట్రావెల్‌ బస్సు ప్రమాద ఘటనలో మరో కీలకాంశం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను వి.కావేరి ట్రావెల్‌ బస్సు తోసుకుంటూ వెళ్లడానికి ముందే.. డివైడర్‌ పక్కన పడి ఉన్న ఆ బైక్‌ను మరో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొని వెళ్లడం వల్లే బైక్‌ రోడ్డు మధ్యలో పడిపోయిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ బస్సు ఎవరిది? అన్న ఆచూకీ కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వివరాలివీ.. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద రహదారిపై ఈ నెల 24 అర్ధరాత్రి దాటాక వి.కావేరి ట్రావెల్‌ బస్సు ప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్‌ మిరియాల లక్ష్మయ్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అంతా భావించారు.

కానీ, బైకర్‌ శివశంకర్‌ డివైడర్‌ను ఢీకొట్టిన తరువాత ఆ బైక్‌ డివైడర్‌ పక్కనే పడిపోయిందని తెలుస్తోంది. శివశంకర్‌ మృతి చెందగా, ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. డివైడర్‌ పక్కన పడిపోయిన బైక్‌ను ఓ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో బైకు నడిరోడ్డుపైకి వచ్చిందని, ఆ తరువాత వి.కావేరి ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బైక్‌పై పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి ముందు బైక్‌ను ఢీకొట్టిన ఆ బస్సు ఏ ట్రావెల్‌ సంస్థకు చెందినది? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలానికి వెల్దుర్తి సమీపంలోని కృష్ణగిరి మండలం అముకతాడు టోల్‌ప్లాజా మధ్య దూరం 18-19 కిలోమీటర్లు ఉంటుంది. 15-20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన రోజు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 3.30 గంటల మధ్యలో టోల్‌ప్లాజా దాటి ఎన్ని వాహనాలు వెళ్లాయి? అనే వివరాలు సేకరిస్తున్నారు. డివైడర్‌ పక్కన పడిపోయిన బైకును మొదట ఓ ప్రముఖ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిందనే అనుమానంతో సంబంధిత డ్రైవర్‌ను విచారించారు. అయితే, ఆ బస్సుకు బైకును ఢీకొన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు, గీతలు లేకపోవడం, తమ బస్సు ఢీకొట్టలేదని డ్రైవర్‌ పోలీస్‌ విచారణలో వెల్లడించడంతో, అతడిని విడిచిపెట్టారు.


35 మందికిపైగా విచారణ

సీసీ ఫుటేజీల ఆధారంగా 35 వాహనాల డ్రైవర్లను పోలీసులు విచారించారు. బైక్‌ రోడ్డుపై పడిపోయిందని, రోడ్డుపై నిర్జీవంగా పడిపోయిన ఓ వ్యక్తిని మరో వ్యక్తి పక్కకు లాగుతున్నట్లు చూశామని కొందరు డ్రైవర్లు పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో వాహనం ఆపితే ఏదైనా సమస్య వస్తుందని, దీంతో పాటు యజమానులు తిడతారన్న భయంతో ముందుకు వెళ్లిపోయామని వివరించినట్లు తెలిసింది. ఒక్కరైనా స్పందించి ఆ బైక్‌ను పక్కకు నెట్టేసి వెళ్లి ఉంటే ఘోర ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు.. 19 మంది ప్రయాణికుల ప్రాణాలు పోయేవి కాదు. బస్సు డ్రైవర్‌ లక్ష్మయ్య అరెస్టును పోలీసులు మంగళవారం చూపించారు. వైద్య చికిత్సల అనంతరం, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి..

ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం

Updated Date - Oct 29 , 2025 | 10:24 AM