Mand Krishna Madiga: ఎస్సీ కమిషన్ చైర్మన్... మా జాతికి దక్కిన గౌరవం
ABN , Publish Date - May 20 , 2025 | 06:32 AM
మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం మా జాతికి గొప్ప గౌరవం అని మాదిగ కుటుంబ నేత మంద కృష్ణ మాదిగ చెప్పారు. జవహర్ పౌరాణిక వర్గాల అభివృద్ధికి పనిచేస్తారని, ఈ నియామకం రాజకీయమేం కాదని తెలిపారు.
జవహర్ ఎంపికపై మంద కృష్ణ మాదిగ
రాజకీయం లేదు... అభినందనలు చెప్పడానికే ఆహ్వానించా: జవహర్
కొవ్వూరు, మే 19(ఆంధ్రజ్యోతి): ‘మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి రావడం... మొదటిసారి మా జాతికి దక్కిన గౌరవం భావిస్తున్నాం’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్‌ను సోమవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకుని మాట్లాడారు. ‘దళితుల్లో 59 కులాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా రెండు కులాల్లో... ఒకరు అవకాశం పొందిన కులంగా, మరొకరు అవకాశం దక్కని కులంగా చరిత్రలో నమోదైపోయింది. ఈ మేరకు మా జాతి బిడ్డల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మా ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో కమిషన్ చైర్మన్ కేటాయిస్తానని చెప్పారు. 2024 ఎన్నికల విజయంలో మాదిగలు ప్రధాన పాత్ర పోషించారని పలు ఉపన్యాసాల్లోనూ చెప్పారు. ఎంతమంది పట్టుబట్టినా ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీకి, జాతికి విధేయుడిగా నిలిచిన సోదరుడు, మాజీ మంత్రి జవహర్‌ను కమిషన్ చైర్మన్‌గా నియమించారు’ అని కృష్ణ మాదిగ అన్నారు. జవహర్ మాట్లాడుతూ... ‘అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వర్గీకరణ పోరాటంలో కృష్ణ మాదిగ కృషి మరువలేనిది. పద్మశ్రీ రావడంతో అభినందనలు తెలియజేయడానికి ఆహ్వానించా. ఎటువంటి రాజకీయం లేదు’ అని అన్నారు. అనంతరం కృష్ణ మాదిగను జవహర్ కుటుంబీకులు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.