పేదరికపు పరుగులో కుప్పకూలీ..
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:08 AM
ఓవైపు పేదరికం.. మరోవైపు ఉద్యోగ లక్ష్యం.. ఇంకోవైపు అనారోగ్యం.. ఈ మూడూ కలిసి ఆ యువకుడి ప్రాణం తీశాయి. ఎలాగైనా ఉద్యోగం పొంది తల్లిని, చెల్లిని ఆదుకోవాలన్న అతని కసి చివరికి కుప్పకూలిపోయింది. కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షల్లో భాగంగా మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్టుకు సంబంధించి 1,600 మీటర్ల రన్నింగ్ పోటీలు గురువారం జరగ్గా, నాల్గో రౌండ్ పూర్తికావడానికి కొద్ది సమయంలో కుప్పకూలిపోయి మృతిచెందిన ఎ.కొండూరు మండలం జీళ్లకుంటకు చెందిన ధరావత చంద్రశేఖర్‌రావు వెనుక కన్నీటి కథ ఉంది.
కానిస్టేబుల్ నియామక పరీక్షలో యవకుడు మృతి
మచిలీపట్నంలో పరుగు పందెం జరుగుతుండగా..
కార్డియాక్ అరెస్టుగా తేల్చిన వైద్యులు
మృతుడిది ఎ.కొండూరు మండలం జీళ్లకుంట
పేదరికంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగం కోసం సాధన
ఎ.కొండూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : ఎ.కొండూరు మండలం జీళ్లకుంటకు చెందిన ధరావత చంద్రశేఖర్‌రావు (25)ది నిరుపేద కుటుంబం. ఏడేళ్ల కిందట తండ్రి దేవా మృతిచెందాడు. కుటుంబ భారమంతా తల్లి మణిపైనే పడింది. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. కూలి పని చేసుకుంటూ కొడుకు చంద్రశేఖర్‌రావును డిగ్రీ వరకూ చదివించింది. కష్టపడి కూతురుకు పెళ్లి చేసింది. తల్లి కష్టాన్ని చూసి చలించిపోయిన చంద్రశేఖర్ ఎలాగైనా ఆమెకు చేదోడుగా ఉండాలనుకున్నాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఆమెను బాగా చూసుకోవాలనుకున్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో దరఖాస్తు చేశాడు. గురువారం మచిలీపట్నంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. 1,600 మీటర్ల పరుగు పందెంలో కొంతదూరం పరుగు తీసిన చంద్రశేఖర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న వైద్యసిబ్బంది యువకుడిని హుటాహుటిన అంబులెన్స్‌లో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చంద్రశేఖర్ డబ్ల్యూపీసీ కౌంట్ 30 వేలకు చేరిందని, దీంతో పాటు ఐదు రోజులుగా తీవ్రజ్వరంతో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు. ఉద్యోగం సాధించి ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు మృత్యురూపంతో రావడంతో ఆ కుటుంబం కన్నీటిలో మునిగిపోయిది. చేతికి అంది వచ్చిన కొడుకు కుటుంబ మృతి చెందడంతో తల్లి మణి రోదన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.