Share News

పీజీ.. గజిబిజీ

ABN , Publish Date - Feb 09 , 2025 | 12:42 AM

‘ఏసీ గదుల్లో డాక్టర్లు.. ఓపీ గదుల్లో పీజీలు’ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నిత్యం కనిపించే పరిస్థితి ఇది. కీలకమైన విభాగాల్లోని హెచ్‌వోడీలు సైతం విధులు పక్కనపెట్టి కాలక్షేపం చేస్తుండగా, వైద్యవిద్యలో ఓనమాలు దిద్దుతున్న పీజీ విద్యార్థులు రోగులకు సేవలందించాల్సిన దుస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయి వైద్యం అందక, రోగాలు నయంకాక రోగులు పదేపదే ఆసుపత్రికి క్యూ కడుతుండగా, పనిభారం పెరిగి, చదువుకునే తీరిక కూడా లేక పీజీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. జీజీహెచ్‌లోని ఈ పరిస్థితులను ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రత్యక్షంగా పరిశీలించగా అనేక అంశాలు బయటపడ్డాయి.

పీజీ.. గజిబిజీ
పురుషుల విభాగంలో రోగులను పరిశీలిస్తున్న పీజీ విద్యార్థులు

ప్రభుత్వాసుపత్రిలో పీజీ విద్యార్థులపై పనిభారం

ఏసీ గదులకే పరిమితమవుతున్న డాక్టర్లు

ఓపీలకు కూడా రాని హెచ్‌వోడీలు

జనరల్‌ మెడిసిన్‌, చర్మవ్యాధులు, జనరల్‌ సర్జరీ, ఆర్థో, ఆప్తమాలజీ, గుండె విభాగాలన్నింటికీ పీజీలే దిక్కు

రోగులకు అందని సరైన వైద్యం

పదేపదే ఆసుపత్రులకు క్యూ

అల్లాడిపోతున్న వైద్య విద్యార్థులు

‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో వాస్తవాలు

ప్రభుత్వాసుపత్రి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో హెచ్‌వోడీలు ఏసీ గదులకు పరిమితమై రోగుల ఒత్తిడంతా పీజీ వైద్య విద్యార్థులపై పెడుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోజూ ప్రభుత్వాసుపత్రికి 1,800 నుంచి 2 వేల మంది రోగులు పలు వైద్యసేవల నిమిత్తం వస్తుంటారు. ఓపీకి వచ్చిన రోగులను విభాగాధిపతులు పరీక్షించి, రోగి వ్యాధిని నిర్ధారించి, ఆ లక్షణాలను తమ వద్దే కూర్చున్న పీజీ విద్యార్థులకు వివరించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలు జరుగుతున్నాయి. జనరల్‌ మెడిసిన్‌, చర్మవ్యాధుల విభాగం, జనరల్‌ సర్జరీ, ఎముకలు, కళ్లు, గుండె విభాగాలతో పాటు పలు విభాగాల హెచ్‌వోడీలు ఓపీలకు రాకుండా ఏసీ గదులకే అంకితమవుతున్నారు. వారి దగ్గరే ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను కూర్చొబెట్టుకొని కాలయాపన చేస్తున్నారు. దీంతో పనిభారం మొత్తం పీజీ విద్యార్థులపైనే పడుతోంది.

చాలా విభాగాల్లో పీజీలే..

జీజీహెచ్‌లో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన జరిపింది. జనరల్‌ మెడిసిన్‌, చర్మవ్యాధులు, జనరల్‌ సర్జరీ, ఆర్థో, ఆప్తమాలజీ, గుండె విభాగానికి సంబంధించిన ఓపీల్లో డాక్టర్లు, విభాగాధిపతులు లేరు. కేవలం పీజీలే ఉన్నారు. కీలకమైన విభాగాల్లో డాక్టర్లు విధులు నిర్వహించకపోవటంతో పీజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మిగిలిన విభాగాల్లో డాక్టర్లు ఉన్నారు. సాధారణంగా చాలామంది వైద్యులు ఉదయం 9 గంటలకు విధులకు హాజరవుతారు. వెంటనే వార్డులకు వెళ్లి రోగులను పరిశీలిస్తారు. వ్యాధి ఏ మేరకు తగ్గిందో తెలుసుకుని వైద్య సేవలందిస్తుంటారు. అయితే శనివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఓపీలో కూర్చోవాల్సిన వైద్యులు ఓపీకి రాకుండా ఏసీ గదులకే పరిమితమవుతున్నారు. దీంతో పనిభారం సైతం పీజీ విద్యార్థులపై పడుతోంది. ఫలితంగా పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదు. ఫలితంగా రోగం నిర్ధారణ కాక.. పీజీల వైద్యంపై ఆధారపడుతున్న పేద రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. రోగాలు సరిగ్గా తగ్గక రోజుల తరబడి రోగులు హాస్పిటల్‌కు రావాల్సి వస్తోంది.

పనిభారంతో సతమతం

పీజీ విద్యార్థులు 32 గంటల పాటు నిర్విరామంగా పనిచేయాల్సి వస్తోంది. కనీసం భోజనం, టీ తాగే సమయం కూడా వారికి ఉండట్లేదు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న క్యాంటీన్‌ రాత్రి 9 గంటలకే మూసేస్తున్నారు. అత్యవసర విభాగాల్లో వైద్య సేవలు పొందుతున్న రోగిని వదిలి బయటకు వెళ్తే, ఆ తర్వాత ఏమైనా జరిగితే.. రోగి బంధువులు తమపై దౌర్జన్యానికి దిగే అవకాశం ఉందని భోజనాలు సైతం మానేసి వారు విధులు నిర్వహిస్తున్నారు. పుస్తకాలు తీసే సమయం కానీ, పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం కానీ ఉండట్లేదని పీజీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ధైర్యంచేసి బాధను బయటకు చెప్పుకొంటే ఎదురయ్యే సమస్యలను గుర్తు చేసుకుని మౌనంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, పీజీ విద్యార్థులపై పనిభారం తగ్గించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 09 , 2025 | 12:42 AM