ముగిసిన వీరమ్మ తిరునాళ్లు
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:23 AM
పదిహేను రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన వీరమ్మ తిరునాళ్లు శనివారం రాత్రితో ముగిశాయి.

ఉయ్యూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): పదిహేను రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన వీరమ్మ తిరునాళ్లు శనివారం రాత్రితో ముగిశాయి. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరునాళ్ల చివరిరోజున ఉదయం నుంచి రాత్రివరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రావిచెట్టు సెంటర్ సమీపాన మెట్టినింటి నుంచి ఈనెల 8న మేళతాళాలతో వైభంగా బయలుదేరిన అమ్మవారు భక్తుల ఎదురు గండ దీపాలు అందుకుంటూ, తిరుగు గండ దీపాలు భక్తులు వెంటరాగా మరుసటి రోజున ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయానికి చేరుకుని భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి తిరునాళ్లలో అమ్మవారిని దర్శించి మొక్కు తీర్చుకున్నారు. చివరి రోజున పెద్ద ముఠా, కూరగాయల మార్కెట్ వర్కర్స్ వేర్వేరుగా ప్రభ బళ్లతో వేడుకగా వెళ్లి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. ఉయ్యూరు చైర్మన్ వి.సత్యనారాయణ, మాజీ చైర్మన్ పూర్ణచంద్రరావు ప్రభ బండ్లకు పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించారు. భక్తుల దర్శన అనంతరం రాత్రి పొద్దుపోయాక మెట్టినింటికి చేరుకునేందుకు అమ్మవారు ఆలయం నుంచి బయలుదేరి వెళ్లారు.