హైడ్రామా
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:19 AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టుతో ఎన్టీఆర్, కృష్ణాజిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వంశీ అరెస్టుకు వ్యతిరేకంగా వైసీపీ అరాచక శక్తులు రహదారులపైకి వచ్చే అవకాశం ఉందని గ్రహించి అన్ని ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

హైదరాబాద్ నుంచి బెజవాడకు వంశీ
భవానీపురం పీఎస్ వద్ద మొదటి స్టాప్
అక్కడి నుంచి కృష్ణలంక పీఎ్‌సకు తరలింపు
పోలీసుల కాన్వాయ్ వెనుకే వచ్చిన వంశీ సతీమణి
అడ్డుకుని విచారించి పంపేసిన పోలీసులు
కృష్ణాజిల్లాలో 144 సెక్షన్, బెజవాడలో 30 సెక్షన్ అమలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్టుతో ఎన్టీఆర్, కృష్ణాజిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వంశీ అరెస్టుకు వ్యతిరేకంగా వైసీపీ అరాచక శక్తులు రహదారులపైకి వచ్చే అవకాశం ఉందని గ్రహించి అన్ని ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు రోడ్డు మార్గాన విజయవాడ తీసుకొచ్చారు. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వరకు ఎలాంటి అల్లర్లు జరక్కుండా ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా వంశీని తీసుకొచ్చే మార్గాన్ని పరిశీలించారు. వంశీ ఉన్న వాహనాలు ఏ సమయానికి ఏ ప్రాంతాన్ని దాటాయో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకున్నాయి. వంశీని ఏ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తారన్న దానిపై రకరకాల ప్రచారాలు సాగాయి. పటమట పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి నేరుగా అక్కడికే తీసుకొస్తారని భావించారు. దీంతో పటమట పోలీస్‌స్టేషన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వైసీపీ నేతలు తలశిల రఘురాం, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడి పరిస్థితిని పరిశీలించుకుని వెళ్లిపోయారు. నగరంలోకి వంశీని తీసుకొచ్చాక వాహనాలను భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయన్ను అక్కడే ఉంచుతారని అంతా భావించారు. తర్వాత కొద్దిసేపటికి వాహనం మార్చి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ వైసీపీ నేతలు, వంశీ న్యాయవాదులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్ నుంచే వంశీ భార్య పంకజశ్రీ కారులో కాన్వాయ్ వెంట వచ్చారు. నందిగామ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. తర్వాత నేరుగా ఆమె కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వంశీతో మాట్లాడాక ఆమెను బయటకు పంపేశారు.