అడ్డంగా దొరికారు
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:17 AM
కలుగులో ఉన్న ఎలుక ఎన్ని రోజులు తప్పించుకోగలదు? ఏదో ఒకరోజు బయటకు రాకమానదు. వచ్చాక చేతికి చిక్కకా మానదు. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఏం లేదు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక సూత్రధారి వంశీనే అయినా తన చేతికి మట్టి అంటకుండా తెరవెనుక కథ నడిపించిన ఆయన మొత్తం 93 మంది నిందితుల్లో ఏ71గా నిలిచారు. ఎన్నికల ముందు నమోదైన కేసు.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావడం, సీఐడీ చేతికి చేరడంతో ఏ71గా ఉన్న వంశీ ఎలా చిక్కుతారని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈలోపు కోర్టు నుంచి ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకున్న వంశీని ఏం చేయలేరని భావించారు. కానీ, తన కేసును తానే తవ్వుకున్నట్టు.. ఈ కేసులో ఫిర్యాది సత్యవర్థన్‌ను ప్రలోభాలకు గురిచేయడం, కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడటంతో వల్లభనేని వంశీమోహన్ అరెస్టు కథకు అడుగులు పడేలా చేసింది. కలుగులో ఉన్న ఎలుక కావాలనే బయటకు వచ్చి సీఐడీకి చిక్కింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో చిక్కిన వల్లభనేని వంశీ
దాడి సూత్రధారి వంశీనే.. కానీ, తెరవెనుక మంత్రాంగం
93 మంది నిందితుల్లో ఏ71 నిందితుడిగా నమోదు
ఎలాగైనా తప్పించుకోవాలని కుటిల ప్రయత్నాలు
ఫిర్యాది సత్యవర్థన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపణలు
రూ.అరకోటి వరకు ఆశ చూపడంతో సీఐడీకి చిక్కిన ఆయుధం
తప్పించుకోబోయి ఇరుక్కుపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి.. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో కీలక సూత్రధారి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. పథక రచన చేసింది ఆయనేనని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతాయి. తన కార్యాలయం నుంచే మొత్తం దాడి ఎపిసోడ్‌ను నడిపించారన్నది అభియోగం. దీంతో ఆయన ఏ71 నిందితుడిగా ఉన్నాడు. దాడికి ప్రధాన సూత్రధారే అయినా.. చేతికి మట్టి అంటకుండా చేయటం వల్ల వంశీ ఏ71గా చేర్చారు. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఈ కేసు టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ తెరపైకి వచ్చింది. నిందితులను గుర్తించటం, ఆధారాలు సేకరించటం వంటి వాటికి చాలా సమయమే పట్టింది. నవంబరులో కేసును సీఐడీకి బదిలీ చేశాక వేగం పుంజుకుంది. ఈ కేసులో ముందస్తుగా వంశీ హైకోర్టు నుంచి ఇంటీరియం ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. మొత్తం 93 మంది నిందితుల్లో 49 మందినే అరెస్టు చేశారు. మరో 31 మంది మాత్రం అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. ఇంకా 13 మంది అజ్ఞాతంలో ఉన్నారు.
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి..
ఈ కేసులో దొరక్కుండా, చిక్కకుండా తెలివిగా వ్యవహరిస్తున్న వంశీ తనంతట తాను ఈ కేసును తిరగతోడుకున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రత్యక్ష సాక్షి, బాధితుడైన కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ పేరుతో కేసు పెట్టించారు. ఈ కేసును అప్పట్లో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు కుమారుడు బోస్ స్వయంగా సత్యవర్థన్ ద్వారా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. సీఐడీకి బదలాయించాక కేసులో పురోగతి నెలకొనటంతో పరిణామాలు వేగంగా మారాయి. దీంతో ఇప్పటి వరకు చిక్కకుండా ఉన్న వంశీ ఒక్కసారిగా తనకు తానే ఇరుక్కున్నారు. ఈ కేసు పెట్టిన సత్యవర్థన్‌ను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. రామవరప్పాడులోని సత్యవర్థన్ కుటుంబాన్ని ముందుగా వైసీపీ రౌడీమూకలు బెదిరించినట్టుగా సమాచారం. ఈ బెదిరింపులతోనే సత్యవర్థన్ తల్లి పలుమార్లు టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్లి భయాందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఏమైనా అవుతుందేమోనని, తమ బిడ్డ పరిస్థితి ఏమిటని ఆమె వాపోయారు. ఓ పథకం ప్రకారం బెదిరింపులు సాగించాక ప్రలోభాలకు తెరతీసినట్టు సమాచారం. రూ.అరకోటి మేర ప్రలోభాల ఎర వేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు తమకు ప్రతికూలంగా వస్తే రూ.2 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రూ.అరకోటి ఎరవేస్తే ఖర్చు తగ్గుతుందన్న కోణంలో సత్యవర్థన్‌ను తెలివిగా ప్రలోభపరిచారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా సత్యవర్థన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంతో ఊహించని ట్విస్ట్ నెలకొంది. దీంతో కేసు నుంచి తప్పించుకున్నామని వంశీ అండ్ గ్యాంగ్ అనుకుంది. కానీ, అనవసరంగా జోక్యం చేసుకుని అదే కేసులో ఇరుక్కుపోయింది. వంశీ పీకల్లోతు కూరుకుపోయారు. సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేశారని, భయపెట్టారన్న ఫిర్యాదులు కుటుంబ సభ్యుల నుంచి కూడా రావటంతో వంశీ పోలీసుల వలలో పడ్డారు. దీంతో కేసును మరింత జఠిలం చేసుకోవటంతో పాటు మరిన్ని నేరాభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వంశీమోహన్‌పై గురిపెట్టిన పోలీసులకు మరింత సులువుగా మారింది.
మరో రెండు కేసులు సిద్ధం
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీమోహన్‌పై మరో రెండు కేసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు ఇదివరకే నమోదైంది. ఆ కేసును రీ ఓపెన్ చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరుతున్నారు. 2019లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో వంశీ నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. స్థలం ఎక్కడో చూపకుండా అప్పట్లో పట్టాలు ఇచ్చారు. ఈ వ్యవహారం ఎన్నికలయ్యాక వెలుగుచూసింది. బాపులపాడు మండలంలో వెలుగుచూసిన నకిలీ ఇళ్ల పట్టాల ఉదంతం గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో కూడా ఉందని తేలింది. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ పట్టాలిచ్చారన్నది అభియోగం. ఈ నేపథ్యంలో అప్పట్లో బాపులపాడు తహసీల్దార్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ కేసు ఉదంతం తర్వాతే వంశీమోహన్ జగన్ దగ్గరకు చేరారు. దీంతో కేసు మరుగున పడిపోయింది. గన్నవరం ఎమ్మెల్యే డిమాండ్‌తో ఈ కేసు రీ ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే, అనుమతులు లేకుండా రూ.210 కోట్ల మేర మట్టిని అక్రమంగా తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా నిర్ధారించినట్టు తెలుస్తోంది. దీనిపై కూడా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వంశీ తప్పించుకోకుండా ఉండేందుకు కేసులన్నీ బనాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అక్రమాలపై నిఘా
ఓపక్క వల్లభనేని వంశీమోహన్‌ను కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన క్రమంలోనే ప్రభుత్వాసుపత్రి సమీపంలో నిఘా వర్గాల అత్యున్నత అధికారులు భేటీ అయ్యారు. రెండు జిల్లాల్లో వంశీ అరాచకాలేంటి? వాటికి సంబంధించి ఫిర్యాదులు వచ్చాయా? వంటి వివరాలను సేకరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వంశీ వ్యాపార కార్యకలాపాలు ఏంటి? వంశీ అనుచరులు, వారిపై ఉన్న వివాదాలు వంటి వాటిపై కూడా ఆరా తీస్తున్నారు.