Share News

డీఆర్‌డీఏ పీడీ ఎవరు..?

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:39 AM

v

డీఆర్‌డీఏ పీడీ ఎవరు..?

పదినెలలుగా ఇన్‌చార్జి అధికారుల పాలనలోనే..

ముఖ్యమైన లావాదేవీలు చూసేవారు కరువు

పర్యవేక్షించే అధికారి లేక ఏపీఎంల ఇష్ట్టారాజ్యం

నెలవారీ సమీక్షలకు కూడా గుండుసున్నా

డ్వాక్రా సమస్యలు, నెలవారీ సమీక్షలు లేనేలేవు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో 29,500 డాక్రా సంఘాలుండగా, వాటిలో 3.10 లక్షల మంది సభ్యులున్నారు. తాడంకి పురపాలక సంఘంలో ఇటీవలే 500కుపైగా డ్వాక్రా సంఘాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) నుంచి మినహాయించి మెప్మాలో విలీనం చేశారు. పదినెలల క్రితం వరకు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ (పీడీ)గా పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ పనిచేశారు. ఆయన పదవీ విరమణ నుంచి ఇన్‌చార్జి పీడీల పాలన సాగుతోంది. ఎన్నికల సమయంలో అప్పటి డీపీవో నాగేశ్వరనాయక్‌ ఇన్‌చార్జి పీడీగా పనిచేశారు. ఆ తరువాత ఆయన బదిలీ అయ్యారు. డీపీవోగా వచ్చిన జె.అరుణకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఆమె సెలవు పెట్టడంతో జెడ్పీ సీఈవోకు ఆ బాధ్యతలు ఇచ్చారు. డీపీవో అరుణ మళ్లీ విధుల్లోకి రావడంతో ఆమెను తిరిగి డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీగా కలెక్టర్‌ నియమించారు. దీంతో ఈ పోస్టులో ఎవరు, ఎంతకాలం పాటు పనిచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

కొరవడిన పర్యవేక్షణ

డీఆర్‌డీఏ ద్వారా జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు ఏడాదికి కనీసం రూ.వెయ్యి కోట్ల రుణాలివ్వాలి. డ్వాక్రా రుణాలకు సున్నావడ్డీ వర్తింపజేయడం, జిల్లా, మండల సమాఖ్యల పనితీరుపై నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహించడం, సీ్త్రనిధి రుణాలు అందజేయడం, డ్వాక్రా సంఘాల రికార్డుల నిర్వహణ, బీమా, పనితీరు బాగోని ఆయా డ్వాక్రా సంఘాలను గాడిలో పెట్టేందుకు నెలవారీ సమీక్షలు నిర్వహించడం వంటి పనులను డీఆర్‌డీఏ పీడీ నిత్యం చేస్తూ ఉండాలి. డ్వాక్రా రుణాలు మంజూరు చేయడంలో ఏమైనా బ్యాంకులు జాప్యం చేస్తే డీఆర్‌డీఏ పీడీ సదరు బ్యాంకు అధికారులతో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దాలి. పదినెలలుగా రెగ్యులర్‌ పీడీ లేకపోవడంతో ఈ సమీక్షలు జరగడం లేదు.

ఏపీఎంల అక్రమాలు

మండలస్థాయిలో పనిచేసే ఏపీఎంలు అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారు. పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం కంకిపాడు, గుడివాడ, పెడన, చల్లపల్లి, అవనిగడ్డ క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో పనిచేసే డీపీఎంలు, ఏపీఎంలు ఎవరు ఏం చేస్తున్నారనే అంశంపై పర్యవేక్షణ కొరవడింది. చల్లపల్లి క్లస్టర్‌ పరిధిలోని మండలాల్లో ఉన్న డ్వాక్రా సంఘాలకు సంబంధించి అనేక అవినీతి ఆరోపణలున్నాయి. పోలాటితిప్ప, కానూరు, నాగాయలంక తదితర మండలాల్లో మండల సమాఖ్యలు లేదా కొన్ని డ్వాక్రా సంఘాల్లో రూ.40 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు నగదు మాయమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై విచారణ చేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో హెచ్‌ఆర్‌ విభాగం మేనేజర్‌, చల్లపల్లి క్లస్టర్‌ డీపీఎంగా ఒకరే పనిచేస్తున్నారు. చల్లపల్లి క్లస్టర్‌ పరిధిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నా విచారణ చేయకుండానే కాలం వెళ్లదీస్తున్నారు.

డీపీఎం, ఏపీఎంలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా..

గత ఏడాది అక్ట్టోబరులో డీఆర్‌డీఏలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. అప్పట్లో బదిలీపై జిల్లాకు వచ్చిన డీపీఎంలు, ఏపీఎంలలో కొందరికి ఇంకా క్లస్టర్లు, మండలాలు కేటాయించకుండా ఖాళీగా ఉంచేశారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో వీరు ఎలాంటి పనిలేకుండా కాలక్షేపం చేస్తున్నారు. మూడు నెలలుగా వీరికి జీతాలు చెల్లిస్తున్నా, ఎలాంటి విధులను అప్పగించకపోవడం గమనార్హం. ఇన్‌చార్జి పీడీలుగా ఎవరు పనిచేసినా ఈ ఉద్యోగులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు.

డీఆర్‌డీఏ పీడీ కారు తెలంగాణాలో..

డీఆర్‌డీఏ పీడీకి ప్రభుత్వం స్కార్పియో కారును కేటాయించింది. ఇటీవల ఈ కారు జిల్లాలో కంటే తెలంగాణాలోనే అధికంగా ఉంటోంది. కారు.. జిల్లా సరిహద్దులు దాటి వెళ్లకూడదు. అయినా తెలంగాణాలోనే ఉంటోందని ఉద్యోగులే చెబుతున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:39 AM