ఏ‘మార్చారు..!’
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:15 AM
నున్న-గుడివాడ 220 కేవీ ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ విద్యుత లైన్ల మార్పిడి విషయంలో రైతులకు ట్రాన్స్‌కో అధికారులు అన్యాయం చేశారు. రిపేర్లు చేస్తామని ప్రకటన ఇచ్చి.. ఏకంగా విద్యుత లైన్లనే మార్చేశారు. నిబంధనల ప్రకారం.. పాత లైన్ల స్థానే కొత్తవి మారిస్తే సదరు భూ యజమానులకు పరిహారం చెల్లించాలి. అయితే, ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతులు చేస్తున్నామని నమ్మబలికి, పరిహారాన్ని ఎగ్గొట్టి, ఆ సొమ్మును స్వాహా చేయడం వివాదాస్పదంగా మారింది.

రైతులను మోసం చేసిన ట్రాన్స్‌కో
పేరుకు హైటెన్షన్ విద్యుత లైన్లకు మరమ్మతులు
గుట్టుచప్పుడు కాకుండా కొత్త లైన్ల మార్పిడి
నున్న-గుడివాడ 220 కేవీ పవర్ లైన్స్‌లో ట్రాన్స్‌కో నిర్వాకం
భూ యజమానులకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే..
ఎకరాకు రూ.9 లక్షల మేర నష్టపోయిన రైతులు
రూ.31.68 కోట్ల మేర రైతులకు నష్టం
విజయవాడ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : నున్న-గుడివాడ 220 కేవీ సెక్షన్‌లో ట్రాన్స్‌మిషన్ విద్యుత హైటెన్షన్ లైన్లపై తీవ్ర ఒత్తిడి పడుతుందన్న ఉద్దేశంతో ఆ లైన్లను అప్‌గ్రేడ్ చేయాలని ట్రాన్స్‌కో అధికారులు భావించారు. లైన్లను మార్చే విషయంలో ట్రాన్స్‌కో అధికారులు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. కేవలం మరమ్మతులు చేస్తున్నట్టుగా చూపించి, విద్యుత లైన్లను మార్చేశారు. కేవలం మరమ్మతులేనంటూ ఓ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన వేసిన విషయం కూడా చాలామందికి తెలియదు. లైన్ల మరమ్మతులు జరుగుతున్నాయని ప్రచారం చేశారు. రైతులు కూడా మరమ్మతులే కదా.. అనుకున్నారు. కానీ, ట్రాన్స్‌కో అధికారులు తెలివిగా కొత్త విద్యుత లైన్లను మార్చారు. నున్న-గుడివాడ 220 కేవీ సెక్షన్ మొత్తం 44.5 కిలోమీటర్లు. 2007-08లో ఈ ట్రాన్స్‌మిషన్ లైన్లను వేశారు. అప్పట్లో ఏసీఎస్‌ఆర్ మూస్ కండక్టర్ డబుల్ సర్క్యూట్ లైన్లను వేశారు. 2020 నుంచి ఈ సెక్షన్‌లో లోడ్ పెరిగిపోవటంతో లైన్లను దానికి అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఏసీఎస్‌ఎస్ మూస్ డబుల్ సర్క్యూట్ లైన్లను వేసే పని ప్రారంభించారు. ఈ మార్గంలో ఆరు వైర్లను మార్చారు. పూర్తిగా కొత్త లైన్లను మార్చుతుండగా, కేవలం మరమ్మతులంటూ ట్రాన్స్‌కో ప్రకటన చేయడం గమనార్హం. డబుల్ కెపాసిటీ కలిగిన విద్యుత లైన్లను పూర్తిగా మార్చే క్రమంలో ట్రాన్స్‌కోనే భారీగా లబ్ధి పొందుతోంది.
రైతులను మోసం చేసిన ట్రాన్స్‌కో
నున్న-గుడివాడ 220 కేవీ సెక్షన్‌లో కొత్త విద్యుత లైన్లను మార్చే క్రమంలో ట్రాన్స్‌కో అధికారులు కారిడార్ కాంపన్సేషన్ ఎగవేతకు పాల్పడ్డారు. 2024, జూన్‌లో కేంద్ర ప్రభుత్వం విద్యుత లైన్ల మార్పిడికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. ప్రస్తుత ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ విద్యుత లైన్లను మార్చి కొత్తవి వేస్తే రైతుకు చెందిన భూమి ఎకరం మార్కెట్ విలువకు 30 శాతం మేర పరిహారం చెల్లించాలి. ఈ విషయంపై రైతులకు అవగాహన లేకపోవటంతో మరమ్మతుల పేరు చెప్పి లైన్లను మార్చేశారు.
దొంగచాటు పనులెందుకు..?
నున్న నుంచి గుడివాడ వరకు విద్యుత లైన్లను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరమే లేదు. 2017లో గుడివాడలో 400 కేవీ విద్యుత లైన్లను వేయటానికి చర్యలు చేపట్టగా, రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసులు తేలలేదు. ట్రాన్స్‌కో అధికారులు ఈ కేసులను పరిష్కరించుకుంటే నున్న-గుడివాడ లైన్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు.
రైతులు ఎంత నష్టపోయారు?
నున్న-గుడివాడ 220 కేవీ సెక్షన్‌లో 44.5 కిలోమీటర్లు ఉండగా, కిలోమీటర్‌కు 1,000 మీటర్లు కాగా, 32.1 మీటర్ల మేర వెడల్పును కూడా కలిపి లెక్కిస్తే 14,24,000 మీటర్లు అవుతుంది. ఎకరాకు 4,040 చదరపు మీటర్లు కాబట్టి.. పై విలువతో భాగిస్తే 352 ఎకరాలు అవుతుంది. అంటే.. మొత్తం 350 ఎకరాలకు సంబంధించి ట్రాన్స్‌కో అధికారులు రైతులకు పరిహారం ఎగ్గొట్టారు. నున్న నుంచి గుడివాడ వరకు చూస్తే ఎకరం ధర బుక్ వాల్యూ ప్రకారం.. రూ.25 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఉంటుంది. ఎకరం రూ.30 లక్షలే అనుకున్నా.. అందులో 30 శాతం.. అంటే ఎకరాకు ఒక్కో రైతుకు రూ.9 లక్షల మేర నష్టపరిహారం చెల్లించాలి. ఈ లెక్కన 352 ఎకరాలకు రూ.31.68 కోట్ల మేర నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా, నయాపైసా చెల్లించలేదు.