పుస్తక పఠనాన్ని మించిన సాధనం లేదు
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:09 AM
సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనాన్ని మించిన మార్గం లేదని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చారిత్రాత్మక గ్రంథాలయాల ఆధారంగా సాహితీ పర్యాటకానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.

అన్ని జిల్లాల్లో పుస్తక మహోత్సవాలు
పుస్తక ప్రియుల పాదయాత్రలో మంత్రి కందుల దుర్గేష్
పుస్తకం సజీవం : సీపీఐ రామకృష్ణ
మంచి ఆలోచనలకు పునాది : కె.శ్రీనివాస్
కల్చరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనాన్ని మించిన మార్గం లేదని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చారిత్రాత్మక గ్రంథాలయాల ఆధారంగా సాహితీ పర్యాటకానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా నిర్వహించే పుస్తక ప్రియుల పాదయాత్రను ఆయన సోమవారం ప్రారంభించారు. విజయవాడలో ప్రతీ ఏడాది ఆరంభంలో నిర్వహించే పుస్తక మహోత్సవంలో భాగంగా మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆకాడమీ వద్ద పాదయాత్రను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. పుస్తకప్రియులు, విద్యార్థులు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ మాజీ సంపాదకుడు కె.శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సాహితీవేత్త రాచపాలెం చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామోజీరావు సాహిత్య వేదికపై నిర్వహించిన ముగింపు సభలో మంత్రి మాట్లాడారు. ఏదైనా విషయంపై సమగ్ర అవగాహన ఏర్పరుచుకోవడానికి పుస్తకాన్ని మించిన సాధనం లేదన్నారు. డిజిటల్ యుగంలో పుస్తకాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విజ్ఞానాన్ని సమకూర్చుకోవడం అవసరమేనని అభిప్రాయపడ్డారు. దాని కారణంగా పుస్తక పఠనకు దూరం కాకూడదని విద్యార్థులకు సూచించారు. పుస్తక మహోత్సవం పుస్తక పఠనను పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు. భాషాసాహిత్య వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం రెండూ కొనసాగిస్తామని తెలిపారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు పెనుగొండ లక్ష్మీనారాయణ, రమేష్ కార్తీక్ నాయక్‌కు అభినందనలు తెలియజేశారు. సభలో వారిని వక్తలు సత్కరించారు.
పుస్తకం సజీవం
- కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
డిజిటల్ యుగంలో ముద్రించిన పుస్తకానికి కాలం చెల్లిందనేది అవాస్తవం. రోజూ చదువుతూ ఉంటేనే చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకుని తగిన విధంగా మనల్ని మనం అభివృద్ధి చెందడం సాధ్యపడుతుంది. పుస్తక మహోత్సవానికి స్టేడియాన్నిచ్చినందుకు పవన కళ్యాణ్‌కు అభినందనలు. ఇటువంటి పుస్తక మహోత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి.
మంచి ఆలోచనలకు పుస్తకం పునాది
- కె.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు
పుస్తక పఠనం మంచి ఆలోచనలు ఇస్తుంది. మంచివైపు మొగ్గేలా చేస్తుంది. నేర్చుకునే శక్తిని ఇస్తుంది. బాలలంతా మంచి పుస్తకాలను, సాహిత్యాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. సినిమా, టీవీల కన్నా పుస్తకం గొప్పది. పుస్తకపఠనం ఆనందం కలిగిస్తుంది. మనిషికి తప్పొప్పులు తెలుస్తాయి. పుస్తకం ప్రతిపాదించే విలువలతోనే మంచి సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది.
సంస్కారాన్ని నేర్పుతుంది
- సాహితీ వేత్త రాచపాలెం చంద్రశేఖరరెడ్డి
పుస్తకాలు చదివి ఎంతోమంది అభివృద్ధి చెందారు. సాటి మనుషుల పట్ల ఎలా మెలగాలి? సమాజంలో సంస్కారవంతంగా, ప్రయోజనకరంగా ఎలా బతకాలి అనే విషయాన్ని సాహిత్యం అలవరుస్తుంది. సాహిత్యం చదవడం విద్యార్థి జీవితంలో భాగం కావాలి. నేను పుస్తకాలు చదివి బాగుపడ్డాను. యువతరం సైన్సుతో పాటు సాహిత్యం చదవాలి. మానవ ప్రవర్తనకు మెరుగులు దిద్ధేది సాహిత్యమే. నాగరిక, సంస్కార జీవన వేదికలు పుస్తకాలే. మంచి పౌరులుగా ఎదగాలంటే పుస్తకాలు చదవడం అనివార్యం.
మంచి పుస్తకాలను ప్రోత్సహించాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
పిల్లలు మంచి పుస్తకాలను ఎంపిక చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే వారు రాబోయే కాలానికి దూతలుగా మారతారు. మంచి పుస్తకాలను సమాజంలోని వారంతా ప్రోత్సహించాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత పెనుగొండ లక్ష్మీనారాయణ, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తీక్ నాయక్, పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు కె. లక్ష్మయ్య, కార్యదర్శి టి.మనోహర్ నాయుడు, గోళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.