Share News

పరిహారం.. ఫలహారం

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:51 AM

తోట్లవల్లూరులో శివ కాంతమ్మ ఆగ్రో ఏజెన్సీస్‌ యజమాని దండ భాస్కరరావు, ఆయన భార్య, కోడలుకు వరద నష్టపరిహారం అందింది. కానీ, వారు ఏ పంట పండించలేదు. వరద వల్ల నష్టపోయిందీ లేదు. అయినా వారికి పరిహారం అందింది. ఇదేంటని భాస్కరరావును ప్రశ్నించగా, వ్యవసాయాధికారి జి.నాగేశ్వరరావును అడగాలంటూ సమాధానమిచ్చారు. నందిని ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని దొండపాటి శివరామకృష్ణకు పసుపు సాగు చేసినట్టుగా రూ.27,615, అరటి సాగు చేసినట్టుగా రూ.20,545, ఆయన భార్య అనూష అరటి సాగు చేసినట్టుగా రూ.20,825, వీరి దుకాణంలో పనిచేసే వర్కర్‌ శ్రీకాకుళం కుసుమకుమారి అరటి సాగు చేసినట్టుగా రూ.20,545, ఈమె తల్లి కొల్లిపర శివసామ్రాజ్యం అరటి సాగు చేసినట్టుగా రూ.20,885 చొప్పున నష్టపరిహారం అందింది. దీనిపై శివరామకృష్ణను వివరణ కోరగా, తమ దుకాణంలో పురుగు మందులను రైతులు అప్పుగా తీసుకెళ్లి చెల్లించట్లేదని, నష్టపరిహారం వస్తుందని తెలిసి రైతులను అడగ్గా, ఆధార్‌ కార్డులు ఇవ్వమన్నారని, అలా తమకు డబ్బులొచ్చాయని చెప్పారు. ఆర్‌ఎస్‌కేలోని వీఏఏ (విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌) తన తమ్ముడికి, కుటుంబ సభ్యులకు భారీగా పరిహారం ఇప్పించినట్టు వరద బాధిత రైతుల జాబితా చూస్తేనే తెలుస్తోంది. .. ఇలా కృష్ణానది వరద నష్టపరిహారాన్ని పప్పు బెల్లాల్లా పంచుకున్నారు. పంట నష్టపోయిన రైతులను పక్కనపెట్టి, తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఖాతాలకు పరిహారాన్ని జమ చేయించారు. తమకు పరిహారం అందలేదని 40 మంది బాధిత రైతులు రోజుల తరబడి గొల్లుమంటుంటే, వారి సమస్యను పరిష్కరించకపోగా, పరిహారం కింద అక్రమంగా అందిన సొమ్మును దర్జాగా అనుభవిస్తున్నారు. తోట్లవల్లూరు మండలంలో రైతుల పంట నష్టపరిహారం జాబితాను తప్పులతడకగా రూపొందించిన స్థానిక వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది.. ఆ తర్వాత పాల్పడిన చీకటి వ్యవహారాలకు పై ఘటనలే నిదర్శనాలు.

పరిహారం.. ఫలహారం

తోట్లవల్లూరు రైతుల వరద పరిహారం మాయంలో ఎన్నో కథలు

ఆధార్‌ ఇచ్చి పరిహారాన్ని వ్యాపారుల ఖాతాలకు మళ్లించారట..!

వింతగా ఉన్న వ్యాపారుల సమాధానాలు

సహకరించిన వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది

తప్పులతడకగా వరద బాధిత జాబితా రూపకల్పన

అసలు రైతులు కాకుండా బంధువుల పేర్లతో..

గౌడ సొసైటీ భూములపై రూ.25 లక్షలు స్వాహా

లబోదిబోమంటున్న అసలు రైతులు

అవినీతి వ్యవహారంపై గొంతెత్తని రాజకీయ నేతలు

అధికారులను రక్షించే ప్రయత్నాలు

తోట్లవల్లూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : గత ఏడాది సెప్టెంబరులో కృష్ణానది వరద కారణంగా తోట్లవల్లూరు నార్తు, సౌత్‌ లంకలు, రొయ్యూరు, తోడేళ్లదిబ్బలంక, వల్లూరుపాలెం, కాళింగదిబ్బలంక, పాములలంక, తుమ్మలపచ్చికలంక, పిల్లివానిలంక, భద్రిరాజుపాలెం, చాగంటిపాడు లంకలు, పొట్టిదిబ్బలంక, దేవరపల్లి, గుర్విందపల్లి, ఐలూరు, కనిగిరిలంక, ములకలపల్లిలంక పరిధిలో 5,237 మంది రైతులకు చెందిన 2,033.50 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకునేందుకు వరద వచ్చిన 15 రోజుల్లోనే ప్రభుత్వం రూ.7.16 కోట్లు పరిహారంగా అధికారులు రూపొందించిన బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది.

ఏం జరిగింది..?

ఆగస్టులో పంటల ఈ-క్రాప్‌ నమోదు ప్రారంభం కాగా, మాగాణి పొలాల్లో నెలపాటు వరి, చెరుకు, మెట్టకంద, పసుపు పంటల నమోదు జరిగింది. ఆ తరువాత సెప్టెంబరులో సంభవించిన వరదల కారణంగా ఈ-క్రాప్‌ నమోదు చేయలేకపోయారు. అలా చేయని వారికి కూడా పది రోజుల్లోనే ఎన్యుమరేషన్‌ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాంతో అధికారులు.. ఈ-క్రాప్‌ నమోదును కార్యాలయాల్లో కూర్చుని, రైతులు ఏ పంట చెబితే అదే నమోదు చేసేశారు. ఈ వివరాలనే ఎన్యుమరేషన్‌గా ప్రభుత్వానికి పంపటంతో తక్షణమే నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ అయ్యింది. ఈకేవైసీ వేలిముద్రలు లేకున్నా, బ్యాంకు ఖాతా నెంబర్‌కు లింకైన ఆధార్‌కార్డు అందిస్తే చాలనే ప్రభుత్వ వెసులుబాటును అధికారులు, సిబ్బంది తెలివిగా ఉపయోగించుకున్నారు. అవినీతి, అక్రమాలకు తెరలేపారు. లంకల్లో ఒక్కో సర్వే నెంబరు కింద వందల ఎకరాలు ఉండటం కూడా వీరికి కలిసొచ్చింది. తమ బంధువులు, సన్నిహితులు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల యజమానుల ఆధార్‌కార్డులు సేకరించేసి పంటల నష్టపరిహారాన్ని పక్కదారి పట్టించారు. అయితే, కొందరు నిజమైన వరద బాధిత రైతులకు నష్టపరిహారం అందలేదు. రైతులు ఆర్‌ఎస్‌కేలకు వెళ్లగా, సమయం దాటిపోయిందని సమాధానమిచ్చారు. అయితే, తోట్లవల్లూరుకు చెందిన బాధిత రైతులు.. వరద బాధిత జాబితా కావాలని అధికారులను నిలదీశారు. వ్యవసాయ, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాల్సి ఉండగా, అధికారులు గుట్టుగా ఉంచారు. దాంతో బాధిత రైతులు సమాచార హక్కు చట్టం ద్వారా జాబితా సేకరించారు. వారంతా జాబితాలోని పేర్లు పరిశీలించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

అధికారులదే ప్రధాన పాత్ర

ఈ అవినీతి బాగోతంలో వ్యవసాయ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఫీల్డుకు వెళ్లినప్పుడు పొలం ఏ రైతుదో వీఆర్వో నిర్ధారిస్తాడు. ఏ పంట ఉందో నమోదు చేసే బాధ్యత అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లది. వీరు జాబితా రూపొందించాక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, తహసీల్దార్‌ సంతకం చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. కానీ, ఎలాంటి పరిశీలన చేయకుండానే అధికారులు జాబితాలను ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. వ్యవసాయాధికారి జి.నాగేశ్వరరావు మాత్రం సైట్‌ లాగిన్‌ వీఏఏల చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు. తప్పులు జరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరిస్తున్నారు. కాగా, ఆ నిర్వాకంలో పాత్రధారులైన అధికారులు, సిబ్బంది సస్పెన్షన్లే కాకుండా, గుర్తించిన అవినీతి సొమ్ముని రికవరీ చేయాలని రైతులు కోరుతున్నారు.

గౌడ సొసైటీపైనే కన్ను

ఈ అక్రమాలు అధికంగా గౌడ ఫీల్డు సొసైటీ సర్వే నెంబరు 331/1 భూముల్లో జరగటం గమనార్హం. గౌడ కులస్తులకు కాకుండా, ఇతర కులస్తులకు ఇక్కడ పరిహారం రావటం అధికారుల అవినీతికి పరాకాష్టగా మారింది. ఇక్కడ రూ.25 లక్షల వరకు పరిహారం పక్కదారి పట్టిందని రైతులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రమైన తోట్లవల్లూరులోనే ఇంత భారీ అక్రమాలకు పాల్పడ్డారంటే మారుమూల లంకల్లో పరిస్థితి ఏమిటోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తోట్లవల్లూరులో 40 మంది రైతులకు నష్టపరిహారం రాలేదని తిరుగుతున్నా.. న్యాయం చేసేందుకు ఏ ఒక్క నేత ముందుకు రాలేదని, పైగా అవినీతి అధికారుల రక్షణకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:51 AM