వేట మొదలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:20 AM
అధికారంలో ఉండగా చెలరేగిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరిగా ఉచ్చు బిగుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు, ఎమ్మెల్యేల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సభ్యసమాజం తలదించుకునేలా బూతులతో పేట్రేగిపోయారు. అరాచకాలు, అక్రమాలకు ఊతమిస్తూ తమ అనుయాయులతో ప్రజలను జలగల్లా పీడించారు. ప్రజలకు అండగా నిలుస్తున్నారన్న ఉద్దేశంతో టీడీపీ నాయకులు, ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అధికారం ఉంది కదా.. అని కన్నూమిన్ను కానకుండా అరాచకాలకు పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ఫలితంగా ఒక్కొక్కరి పాపాలు పండుతున్నాయి.
వైసీపీ మాజీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
తర్వాత లిస్టులో జోగి, కొడాలి, పేర్ని
బియ్యం దొంగతనం కేసులో పేర్ని నాని
‘అగ్రిగోల్డ్’ కేసులో ఇరుక్కున్న జోగి కుటుంబం
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా..
గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడిలో
కొడాలి నానిపై త్వరలో కేసు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆఫీసులపైనా, చంద్రబాబు ఇంటిపైనా దాడులకు పాల్పడిన వారంతా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నేతలే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తో పాటు మాజీ మంత్రులైన జోగి రమేశ్, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావుతో పాటు దేవినేని అవినాశ్ సాగించిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. నాడు అధికారగర్వంతో విర్రవీగిన వారి భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అసలైన చేప గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తాజాగా వలకు చిక్కారు. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి కీలక సూత్రధారి, పథక రచనకు శ్రీకారంచుట్టిన వంశీమోహన్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఫిర్యాదుదారుడినే ప్రలోభపెట్టాడన్న ఫిర్యాదులపై అరెస్టయ్యారు. గతంలో చంద్రబాబు కుటుంబంపై వంశీ ఎన్నో వ్యక్తిగత దూషణలు చేశారు. సభ్యసమాజం వినలేని మాటలతో పాటు కుటుంబాన్ని కి ంచపరిచే వ్యాఖ్యలు చేశారు.
జోగి రమేశ్ చుట్టూ ఉచ్చు
చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన మాజీమంత్రి జోగి రమేశ్ ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. నేడో రేపో ఆయన అరెస్టు కాక తప్పదు. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ భూములను బలవంతంగా కొనుగోలు చేశారని కూడా ఈయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో జోగి రమేశ్ తనయుడు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. జోగి రమేశ్ తెలివిగా తప్పించుకున్నా.. అధికారాన్ని మాత్రం అడ్డగోలుగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన తరుణంలోనే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేయటానికి జోగి రమేశ్ సారథ్యం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కూడా జోగి తప్పించుకునే పరిస్థితి లేదు. విచారణ పూర్తయితే ఆయన్ను అరెస్టు చేసే అవకాశముంది.
నేడోరేపో కొడాలి నాని కూడా..
గుడివాడకు చెందిన మరో మాజీమంత్రి కొడాలి నాని అధికారం మత్తులో చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని తిట్టని తిట్టులేదు. ఆయన బూతులకు సభ్యసమాజం తలవంచుకోవాల్సి వచ్చింది. అధికార బలంతో, బూతులతో పేట్రేగిపోయిన కొడాలి నాని గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో సూత్రధారుడిగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై తన అనుయాయులను ఉసిగొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపైనా కూటమి ప్రభుత్వం విచారణ కు ఆదేశించనుంది. ఇదే జరిగితే కొడాలి నాని అరెస్టు కాక తప్పదు. అలాగే, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో దేవినేని అవినాశ్‌కు, టీడీపీ నేతలను ఇష్టానుసారంగా బూతులు తిట్టిన వెలంపల్లి శ్రీనివాసరావు కూడా తర్వాత లిస్టులో ఉన్నారు.