Share News

యూపీ నుంచి ఏపీ

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:20 AM

ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చారు.. కోస్తాతీరాన్ని జల్లెడ పట్టారు.. దొంగతనానికి ఏ ఊరు అనువుగా ఉంటుందో చూసుకున్నారు... టార్గెట్‌ ప్రకారం స్కెచ్‌ను అమలు చేశారు... చివరకు పొరుగు రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు దొరికిపోయారు. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో ఇన్‌గ్రాం మైక్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ గోడౌన్‌లో జరిగిన చోరీ కేసును విజయవాడ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి, గోడౌన్‌లో చోరీ చేసి బిహార్‌కు పారిపోతున్న గ్యాంగ్‌కు అంతర్రాష్ట్ర పోలీసుల సహకారంతో సంకెళ్లు వేశారు. చైన్‌ లింక్‌ మాదిరిగా 100కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి రాత్రికిరాత్రి గ్యాంగ్‌ ఆచూకీ కొనుగొన్నారు. ఈ వివరాలను త్వరలో పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.

యూపీ నుంచి ఏపీ

ఎనికేపాడు గోడౌన్‌లో చోరీ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

సీసీ కెమెరాల ద్వారా ఆరుగురు నిందితుల గుర్తింపు

వారం కిందట రాష్ట్రంలో అడుగుపెట్టిన గ్యాంగ్‌

పలాస నుంచి బెజవాడ వరకు పక్కా రెక్కీ

ఎనికేపాడులో రూ.2.51 కోట్ల విలువైన ఫోన్ల చోరీ

బిహార్‌ పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు

అంతర్రాష్ట్ర పోలీసుల సహకారంతో పట్టివేత..!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చారు.. కోస్తాతీరాన్ని జల్లెడ పట్టారు.. దొంగతనానికి ఏ ఊరు అనువుగా ఉంటుందో చూసుకున్నారు... టార్గెట్‌ ప్రకారం స్కెచ్‌ను అమలు చేశారు... చివరకు పొరుగు రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు దొరికిపోయారు. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో ఇన్‌గ్రాం మైక్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ గోడౌన్‌లో జరిగిన చోరీ కేసును విజయవాడ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి, గోడౌన్‌లో చోరీ చేసి బిహార్‌కు పారిపోతున్న గ్యాంగ్‌కు అంతర్రాష్ట్ర పోలీసుల సహకారంతో సంకెళ్లు వేశారు. చైన్‌ లింక్‌ మాదిరిగా 100కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి రాత్రికిరాత్రి గ్యాంగ్‌ ఆచూకీ కొనుగొన్నారు. ఈ వివరాలను త్వరలో పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.

అలా వచ్చారు.. : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ గ్యాంగ్‌ ఈనెల ఒకటో తేదీన రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్‌ రిజిసే్ట్రషన్‌ నెంబరుతో ఉన్న కారులో ఆరుగురు యువకులు ఇక్కడికి వచ్చారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వరకు పలు ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించారు. విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస వరకు పలుమార్లు తిరిగారు. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని ఇన్‌గ్రాం మైక్రో ఇండియా గోడౌన్‌ వద్ద మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఇక్కడ చోరీకి స్కెచ్‌ వేసుకుని తిరిగి విజయవాడ నుంచి ఏలూరు వైపునకు వెళ్లిపోయారు.

ఇలా దొంగతనం చేశారు.. : ఈనెల ఐదో తేదీన ఏలూరు వైపు నుంచి నగరంలోకి ప్రవేశించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య గోడౌన్‌లో ఐఫోన్లు, ట్యాబ్‌లు, యూఎస్‌బీ కేబుల్‌, యాక్సరీస్‌, ఐప్యాడ్‌లు, లెనోవో ట్యాబ్‌లు కాజేశారు. ఆ తర్వాత వచ్చిన మార్గంలోనే వెళ్లిపోయారు.

పోలీసులు దొరికిపోయారు..: గోడౌన్‌ ఇన్‌చార్జి ఫరూక్‌ అహ్మద్‌ ఫిర్యాదును తీసుకున్న తర్వాత క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. క్రైమ్స్‌ డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, డీసీపీ గౌతమీషాలి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఇన్‌స్పెక్టర్లు వి.పవన్‌కిషోర్‌, రామ్‌కుమార్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గోడౌన్‌ నుంచి జాతీయ రహదారి వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను గురువారం తెల్లవారుజాము వరకు పరిశీలించారు. ఒక బృందం ప్రైవేట్‌ సీసీ కెమెరాల ఫుటేజీలను, ఒక బృందం ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌లో నుంచి ఫుటేజీలను పరిశీలించింది. టోల్‌ప్లాజాల వద్ద మరో బృందం సీసీ కెమెరాలను పరిశీలించింది. సుమారు 100కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులు నిందితులను గుర్తించారు. రాష్ట్రంలోకి ఏ మార్గంలో ప్రవేశించారో అదే మార్గంలో దాటేస్తున్నట్టు పోలీసులు భావించారు. పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు ఈ సమాచారాన్ని డీజీపీకి చేరవేశారు. నిందితులు బిహార్‌ వైపునకు పారిపోతున్నట్టుగా గుర్తించి సీపీ ఆ రాష్ట్ర పోలీసులతో సంప్రదించారు. నిందితులు ఉపయోగించిన కారు, వారి ఫొటోలను అక్కడి పోలీసులకు పంపారు. బిహార్‌ రాష్ట్రంలోకి ప్రవేశించే మార్గంలో ఉన్న జాతీయ రహదారిపై అక్కడి పోలీసులు యూపీ గ్యాంగ్‌ను పట్టుకున్నట్టు తెలిసింది.

Updated Date - Feb 08 , 2025 | 01:20 AM