Share News

కూచిపూడి, అమరావతిల వైభవం ఉట్టి పడేలా.. విమానాశ్రయం నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:26 AM

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను అమరావతి, కూచిపూడిల వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దేలా రూపొందించిన సరికొత్త డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

కూచిపూడి, అమరావతిల వైభవం ఉట్టి పడేలా..  విమానాశ్రయం నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌
అధికారులతో మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు

నూతన డిజైన్లకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /గన్నవరం): నవ్యాంధ్రకు తలమానికంగా ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను అమరావతి, కూచిపూడిల వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దేలా రూపొందించిన సరికొత్త డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు 50 శాతం పూర్తి కావడంతో ఆర్కిటెక్చరల్‌ డిజైన్లను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైనల్‌ చేశారు. టెర్మినల్‌ బిల్డింగ్‌ ఎలివేషన్‌ ఒకే మాదిరిగానే ఉన్నా థీమ్‌ మారుతుంది. టెర్మినల్‌ ముందు, వెనుక, లోపల, బయట పూర్తిగా కూచిపూడి వైభవం కనిపించేలా ఉంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చే వారికి కూచిపూడి గొప్పతనాన్ని వివరించేలా ఎయిర్‌పోర్టులో కూచిపూడి భంగిమలు ఉంటాయి. అమరావతి రాజఽధాని స్థూపాలు, ఽధర్మచక్రాలు టెర్మినల్‌ బిల్డింగ్‌లో కనిపిస్తాయి. ఓవైపు కూచిపూడి, మరోవైపు అమరావతిల విశిష్టతల కలబోతతో ఉట్టిపడే సరికొత్త డిజైన్లు ఆకర్షిస్తున్నాయి. టెర్మినల్‌ బిల్దింగ్‌ పనులు 50 శాతం పూర్తి కావటంతో జూన్‌ నెలాఖరుకల్లా నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

జూన్‌లోపు పనులు పూర్తిచేయాలి: రామ్మోహన్‌నాయుడు

నూతన టెర్మినల్‌ భవనం నిర్మాణ పనులు జూన్‌లోపు పూర్తి చేయాలని అధికారులను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు ఆదేశించారు. శుక్రవారం టెర్మినల్‌ నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్‌, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:26 AM