Share News

చినగొల్లపాలెంలో ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:38 AM

చినగొల్లపాలెం దీవిలో కౌలు రైతులు పెంచుకున్న సరుగుడు తోటలను కొందరు దౌర్జన్యంగా నరికివేయడంతో దీవిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చినగొల్లపాలెంలో ఉద్రిక్తత
మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలు

మంత్రి అనుచరులమంటూ వివాదాస్పద భూమిలోకి మచిలీపట్నానికి చెందిన వ్యక్తుల చొరబాటు

వందల సంఖ్యలో కూలీలతో సరుగుడు తోటలు నరకడానికి యత్నం

చెట్లను నరకడంపై మూడు రోజులుగా వివాదం

గ్రామస్థుల ఆందోళన..మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు

భారీగా మోహరించిన పోలీసులు

కృత్తివెన్ను, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చినగొల్లపాలెం దీవిలో కౌలు రైతులు పెంచుకున్న సరుగుడు తోటలను కొందరు దౌర్జన్యంగా నరికివేయడంతో దీవిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీవిలో సర్వే నెంబరు 213, 217, 572-1లో 53.76 ఎకరాల భూమిని ఎండూరి రవీంద్రమూర్తి అనే రైతు 2011లో చినగొల్లపాలేనికి చెందిన పెద్ది సత్యనారాయణ, చందు సత్యనారాయణ అనే ఇద్దరు రైతులకు లీజుకు ఇచ్చాడు. వారు ఆ భూమిలో సరుగుడు తోటను వేసి, పెంచారు. అవి ఎదిగి కోతకు వచ్చాయి. అయితే ఆ భూమి నాదంటే నాదంటూ కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై ఇరు పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో ఆ భూమిలోని చెట్లను నరికేందుకు కౌలు రైతులకు అవకాశం లేకపోయింది. దీంతో ఆ చెట్లను అలానే ఉంచారు. ఈ పంట, భూమిపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒక పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని గత ప్రభుత్వంలో భూమిని అక్రమించి, చెట్లను తొలగించేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు అడ్డుకోవటంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. తాజాగా మూడు రోజులుగా మచిలీపట్నానికి చెందిన కొందరు వ్యక్తులు ఓ మంత్రి గారి అనుచరులమంటూ వివాదస్పద భూమిలోకి చొరబడ్డారు. వందల సంఖ్యలో ప్రైవేటు బలగాలతో వచ్చిన కూలీలు భూమిలోని లక్షల రూపాయల విలువైన సరుగుడు తోటలను నరకటం ప్రారంభించారు. దీనిపై స్థానికులకు, ప్రైవేటు వ్యక్తులకు మధ్య మూడు రోజులపాటు చిన్నచిన్న వివాదాలు తలెత్తాయి. సరుగుడు తోట అక్రమ నరికివేతపై ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రత్యేక కథనంతో విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిపై పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి విషయంపై ఆరా తీశారు. అయితే అప్పటికే వివాదాలు తారస్థాయికి చేరాయి.

రూ.60 లక్షల విలువైన కలప నరికేశారని ఫిర్యాదు

ఇరు వర్గాలు ఆదివారం ఉదయం వందల సంఖ్యలో భూమి వద్దకు చేరడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. పక్కా సమాచారంతో బందరు డీఎస్పీ రాజా, సీఐ నాగేంద్రబాబు, ఆర్డీవో స్వాతిలు వందల సంఖ్యలో ప్రత్యేక బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సరుగుడు తోటను నరికే కూలీలను గ్రామస్థులు అడ్డుకున్నారు. తరలించే లారీలను ఆపేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికారులకు, పోలీసులకు ముడుపులు అందబట్టే వివాదాస్పద, కోర్టు వ్యవహారాల్లో ఉన్న భూమిలో దొంగచాటుగా లక్షల రూపాయల విలువైన చెట్లను నరకటం వారికి సాధ్యమైదంటూ గ్రామస్థులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి, అక్కడ నుంచి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. కౌలు రైతులు పెద్ది సత్యనారాయణ, చందు సత్యనారాయణలు తమ 53.75 ఎకరాల కౌలు భూమిలోకి దౌర్జన్యంగా వచ్చి ఇప్పటికే రూ.60 లక్షల విలువైన 4 ఎకరాల కౌలు భూమిలోని సరుగుడు తోటను నరికిన మచిలీపట్నానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతున్నట్లు స్థానిక ఎస్సై పైడిబాబు తెలిపారు.

Updated Date - Feb 03 , 2025 | 01:38 AM