టార్గెట్ ధాన్యం
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:10 AM
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా మారాయి. డ్రయ్యర్ సౌకర్యం ఉన్న మిల్లు యజమానులు తమకు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తయ్యాయని, ఇక ధాన్యం కొనలేమని చెబుతున్నారు. డ్రయ్యర్ సౌకర్యం లేని మిల్లు యజమానులేమో తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తయ్యేదశలో ఉందని, ప్రస్తుతం ధాన్యం కొనలేమంటున్నారు. ప్రైవేటుగా తక్కువ ధరకు విక్రయిస్తే కొంటామని చెబుతున్నారు. మిల్లర్లు పెడుతున్న ఈ ఇబ్బందుల కారణంగా బస్తాకు రూ.150 తక్కువగా రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

జిల్లాలో గందరగోళంగా మారిన కొనుగోళ్లు
టార్గెట్లు పూర్తయ్యాయంటున్న మిల్లర్లు
ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ 5.50 లక్షల టన్నులు
ఇప్పటివరకు కొన్నది 4.40 లక్షల టన్నులు
కొనాల్సిన ధాన్యం 1.10 లక్షల టన్నులు
ఇంకా రైతుల వద్ద ఉన్నది 5.10 లక్షల టన్నులు
బహిరంగ మార్కెట్‌లో దక్కని మద్దతు ధర
తక్కువ ధరకు కొని కాకినాడకు తరలింపు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 1.65 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. 13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఆగస్టులో కురిసిన భారీవర్షాలు, బుడమేరు వరదల కారణంగా వరిపైరు దెబ్బతినడంతో 9.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలను సవరించారు. ప్రభుత్వం ద్వారా జిల్లాలో కేవలం 5.50 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం తక్కువగా నిర్ణయించడంతో మిల్లర్లు అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే, మలివిడతలో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచుతామని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచనప్రాయంగా హామీ ఇచ్చారు. 5.50 లక్షల టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 147 మిల్లులకు, వాటి సామర్థ్యానికి అనుగుణంగా సర్దుబాటు చేశారు. ఈ ఏడాది వరికోతల సమయంలో సంభవించిన రెండు తుఫాన్ల ప్రభావంతో వర్షాలు కురవడంతో రైతులు యంత్రాల ద్వారా వరికోతలను పూర్తిచేశారు. డ్రయ్యర్ సౌకర్యం ఉన్న మిల్లులకు ఆన్‌లైన్‌లో ధాన్యాన్ని విక్రయించారు. ఇప్పటివరకు జిల్లాలో 4.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కలననుసరించి, ముందస్తుగా నిర్ణయించిన లక్ష్యం ప్రకారం జిల్లాలో ఇంకా 1.10 లక్షల టన్నులకు మించి ధాన్యం కొనడానికి అవకాశం లేదనేది అధికారుల మాట. అయితే, 5.10 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనాల్సి ఉంది. ఈ ఏడాది బీపీటీ ధాన్యాన్ని కొనేందుకు హైదరాబాద్ వ్యాపారులు మన జిల్లాకు రాలేదు. దీంతో ఈరకం ధాన్యానికి మద్దతు ధర ప్రైవేట్‌గా పెరగలేదు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే బీపీటీ రకం ధాన్యాన్ని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీపీటీ రకంతో పాటు 1061, 1074, 1262, 1318 తదితర ముతక రకాల ధాన్యం ఇంకా జిల్లాలో 5 లక్షల టన్నులకు పైగా కుప్పలరూపంలో ఉంది. వీటిని కొనేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కాకినాడకు బియ్యం ఎగుమతులు
జిల్లాలోని మిల్లులకు నిర్దేశించిన ధాన్యం టార్గెట్లు దాదాపు పూర్తికావడంతో మిల్లర్లు ఇదే అదనుగా ధరను తగ్గించి రైతుల వద్ద కొంటున్నారు. బస్తా ధాన్యానికి రూ.1,725ను మద్దతు ధరగా చెల్లించాల్సి ఉండగా, రూ.1,600 ఇస్తున్నారు. అదేమని రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. ‘మీ వద్ద కొన్న ధాన్యాన్ని మరపట్టాక కాకినాడకు తరలిస్తే కిలో బియ్యానికి రూ.32 మేర ధర వస్తుంది. రవాణా, ధాన్యం మరపట్టడం, ఇతరత్రా ఖర్చులన్నీ లెక్కగడి తే బస్తా ధాన్యాన్ని రూ.1,600కు మించి కొనుగోలు చేయలేం’ అని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో రైతులు విధిలేని స్థితిలో మిల్లర్లు నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు. ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తే ధర రూపంలో రూ.4,500ను కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.