మధుర మామిడికి.. మంచు దెబ్బ!
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:47 AM
మామిడిరైతును మంచు వణికిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో పూతతో కళకళలాడుతూ మామిడి తోటలు రైతుల్లో ఆశలు నింపాయి. అంతలోనే వారి ఆశలు మంచు రూపంలో అవిరయ్యాయి. మంచు దెబ్బకు పూత మాడి.. పిందెలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మంచు ఇలాగే కొనసాగితే మామిడిపై ఆశలు వదులు కోవల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, హనుమాన్‌జంక్షన్‌రూరల్)
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది.. రైల్వేకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చిపెట్టే నూజివీడు, బాపులపాడు మండలాల్లోని మామిడిరైతు ఈ ఏడాది వాతావరణ మార్పులతో తల్లడిల్లుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ సహాయ నిరాకరణ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మామిడి రైతును పొగమంచు తీవ్రంగా దెబ్బతీస్తోంది. అయిల్‌పామ్ వలే ప్రభుత్వం ప్రోత్సహిస్తే తప్ప మామిడితోటలు వేసేందుకు రైతులు అసక్తి చూపడంలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతంలో 20వేల హెక్టార్లకు పైగా ఉండే మామిడితోటలు 8వేల హెక్టార్లకు పడిపోయాయి. వాతావరణ పరిస్థితులు, ప్రోత్సాహం కరువవడంతో ఉన్న తోటలను తీసివేసి ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పలువురు రైతులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మామిడి కాయ లభ్యమవడమే కష్టమన్నారు.
ఫ కాపు నిలబడితే చాలు..
ఈ సంవత్సరం పూత ఆలస్యమైనా బాగా వచ్చిందని, కానీ మంచు దెబ్బకు మాడి, పిందె దశలో ఉన్న కాయలు రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కాపు నిలబడితే అదే పదివేలన్నారు. కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి ఎంతవరకూ వస్తుందనేది అంచనా వేయలేకపోతున్నామని, మంచు దెబ్బకు కాయ సైజు తగ్గడంతో మార్కెట్‌లో రేటు పలకదని, ముందస్తు కొనుగోలు చేసే వ్యాపారులు కూడా వెనకడుగువేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సహకారం అవసరం : అచ్చి రమేష్
ఎకరానికి రూ.60వేల వరకు పెట్టుబడి అవుతుందని, గతంలో ముందస్తుగా కొనుగోలు దారులే పెట్టుబడి పెట్టి ఆదుకునేవారని తెలిపారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దిగుబడి అంచనా వేయలేక వారు కూడా కాపు వచ్చిన తరువాతే అంటున్నారని తెలిపారు. ఎకరానికి 4టన్నుల దిగుబడి వచ్చి టన్ను రూ.20వేలకు పైగా ధర పలికితే పెట్టుబడి బ్యాంకు వడ్డీలకే సరిపోతుందన్నారు. మంచు కారణంగా దిగుబడి తగ్గిపోవడంతో పాటు, కాయ చిన్నగా వస్తుందని ధర పలకదని తెలిపారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తప్ప వచ్చే సంవత్సరం మామిడితోట తీసివేయక తప్పదని చెబుతున్నారు.
రైపెనింగ్ చాంబర్ అందుబాటులోకి రావాలి
- కట్టుబోయిన శ్రీనివాసరావు
మల్లవల్లి పారిశ్రామికవాడలోని రైపెనింగ్ చాంబర్ అందుబాటులోకి వస్తే మామిడి రైతును ఆదుకున్నట్టవుతుంది. నూజివీడు మామిడికి మళ్లీ కళ రావాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. గతంలో బాపులపాడు మండలంలోని మల్లవల్లి, రేమల్లె, కొత్తపల్లి, మడిచర్ల తదితర ప్రాంతాల్లో 10వేల ఎకరాలకు పైగా మామిడి సాగు చేసే వారు.. గత వైసీపీ ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యం, సబ్సిడీలు అందించకపోవడంతో సగానికి పైగా తోటలు తీసివేసారు. మామిడి రైతును ప్రోత్సహించేందుకు నాణ్యతతో కూడిన దిగుబడికి సాంకేతికతతో కూడిన సబ్సిడీ పరికరాలు అవసరం. ప్రభుత్వం ఈదిశగా ఆలోచించి సహకరించాలి.
యాజమాన్య పద్ధతులతో
నాణ్యమైన దిగుబడులు
- జె.జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
ఆరుతడి నీటి యాజమాన్య పద్ధతులతో.. తక్కువ మోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల నాణ్యమైన దిగుబడితో లాభాలు అర్జించవచ్చు. నీటి యాజమాన్యం, పిందె రాలకుండా చర్యలు చేపట్టాలి. తడిపెట్టినపుడు కేజీ యూరియా, పొటా్‌షల మిశ్రమాన్ని పాదులో వేయడం వల్ల చెట్టుకు బలం అంది కాపు రాలదు. పిందె రాలకుండా ఉండేందుకు ప్లానోఫిక్స్ హార్మోన్ ద్రావణాన్ని 1మిలీ 4.5మిలీ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఈ సమయంలోనే సూక్ష్మపోషకాలు అందేలా చర్యలు చేపట్టాలి. లేదా ఎన్.పీ.కే ద్రావణాన్ని 5మి.లీను 1లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పురుగుమందులు తక్కువ వాడటం ద్వారా ఫలదీకరణకు ఉపయోగపడే తేనెటీగలకు సహకరించాలి. దీనివల్ల పిందెకట్టు అధికంగా వచ్చి దిగుబడి పెరగుతుంది. సబ్సిడీపై ఫ్రూట్ కవర్లు, వేపనూనె స్థానిక ఆర్సీకే(రైతు సేవా కేంద్రాలు) అందుబాటులో ఉన్నాయి.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మామిడి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలురకాల సబ్సిడీలపై వివిధ పరికరాలను కూడా అందజేస్తున్నదని, మండల ఉద్యానశాఖ అధికారిని సంప్రదించి అవసరమైనవాటిని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన అధిక దిగుబడులతో మామిడి రైతులు లాభాలు ఆర్జించాలి.