బుడమేరు ప్రక్షాళనకు కసరత్తు
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:58 AM
బెజవాడ నగరాన్ని భయాందోళనలోకి నెట్టిన బుడమేరు ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి. వర్షాలు ఎక్కువగా కురిసినా, వరద ప్రవాహం పెరిగినా ఎక్కడా, ఏ అడ్డూ లేకుండా సాఫీగా సాగిపోయేలా చేసేందుకు అన్ని కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయాలపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించిన మంత్రులు నిమ్మల, నారాయణ.. త్వరలో మరో సమావేశం నిర్వహించి ప్రణాళికలను సీఎంకు వివరించనున్నారు.

బెజవాడలోకి వరద ప్రవేశించకుండా ప్రత్యేక ప్రణాళికలు
ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించిన మంత్రులు
తాజా సమీక్షలో కూడా కీలక నిర్ణయాలు
18న తుది సమీక్ష.. అనంతరం సీఎంకు నివేదిక
ఫిబ్రవరి నుంచి అభివృద్ధి పనులు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం ప్రయత్నాలు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : విజయవాడ నగరంలో గత సెప్టెంబరులో విధ్వంసం సృష్టించిన బుడమేరు వరద నియంత్రణపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. బుడమేరు ప్రక్షాళనకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. తాజాగా నగరంలోని ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రులు రామానాయుడు, నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న మరోసారి సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేయనున్నారు. నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో బుడమేరు ప్రక్షాళన చేపట్టనున్నారు. భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులనూ ఇందులో భాగస్వాములను చేయనున్నారు. బుడమేరు వరద నియంత్రణ పనులకు సంబంధించి కేంద్ర నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్రానికి నివేదించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో బుడమేరు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఫిబ్రవరిలో పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏం చేయనున్నారు..?
బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు. ఈ కారణంతో పాటు కట్టలు బలహీనంగా ఉండటం వల్ల సెప్టెంబరు వరదలకు బుడమేరుకు గండ్లు పడి విజయవాడను ముంచేసింది. కాల్వ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా నివేదిక సిద్ధం చేస్తున్నారు. బుడమేరు నుంచి వెళ్లే ప్రవాహ వేగాన్ని పెంచడంతో పాటు 40 వేల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా కట్టలను పటిష్ఠపరచాలని నిర్ణయించారు.
బుడమేరు డైవర్షన్ చానల్ సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేలా 2014-19లో రూ.464 కోట్లతో పనులు ప్రారంభించి 80 శాతం పూర్తిచేశారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ చానల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బుడమేరు చానల్‌కు సమాంతరంగా ఓల్డ్ చానల్‌ను కూడా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నారు.
ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు వెళ్లే చానల్ విస్తరణ పనులను 2014-19 మధ్య కాలంలో చేపట్టగా, ఆ పనులు ప్రారంభమే కాలేదు. ఈ పనులను పూర్తిచేయనున్నారు.
కొల్లేరు నుంచి వరద నీరు సముద్రంలో కలవడానికి పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వరద నీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా సముద్రానికి వెళ్లేలా ఉప్పుటేరును అభివృద్ధి చేయనున్నారు.