శిథిల వంతెనలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:14 AM
తిరువూరు నియోజకవర్గంలో బ్రిడ్జిలు, పలు రహదారులు మరమ్మతులు, నిర్మాణాలకు నోచుకోకపోవడంతో రాకపోకలకు ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. 2018లో కట్టలేరుపై వినగడప వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఇప్పటి వరకు దాని నిర్మాణం జరగలేదు. ఇటీవల వరదలకు ఎంఎన్‌కే రోడ్డులో కుమ్మరికుంట్ల వద్ద ఏడు ఖానాల బ్రిడ్జి కుంగిపోయింది. ఈ రెండు బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లపై ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బ్రిడ్జిలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

2018లో కట్టలేరుపై వినగడప వద్ద కూలిన బ్రిడ్జి
ఇటీవల వరదలకు ఎంఎన్‌కే రోడ్డులో కుమ్మరికుంట్ల వద్ద కుంగిన ఏడు ఖానాల బ్రిడ్జి
రాకపోకలకు ఇబ్బందులు..కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి-తిరువూరు):
నియోజకవర్గంలో పలు రహదారులు, బ్రిడ్జిలు మరమ్మతులు, నిర్మా ణాలకు నోచుకోకపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంఎన్‌కే(మచిలీపట్నం, నూజివీడు, కల్లూరు) రోడ్డులో విస్సన్నపేట నుంచి ఎ.కొండూరు అడ్డరోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో కుమ్మరికుంట్ల వద్ద వరదనీరు, ఎ.కొండూరు చెరువు అలుగునీరు ప్రవహించే కాల్వపై చాన్నాళ్ల క్రితం తూములతో నిర్మించిన ఏడుఖానాల చిన్నబ్రిడ్జి ఇటీవల వచ్చిన వరదలకు దెబ్బతింది. ఈ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా ఉంది. దీంతో ఈ బ్రిడ్జి వద్ద తా త్కాలికంగా అప్రోచ్‌రోడ్డు నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. అప్రోచ్‌రోడ్డు కూడా సరిగా లేదు. దీంతో ఏ ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తిరువూరు నుంచి మధిర ప్రధాన రహదారి, ఎ.కొండూరు అడ్డరోడ్డు నుంచి విస్సన్నపేట రహదారి, అక్కపాలెం, కోకిలంపాడు, వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ధ్వంసమైన బ్రిడ్జిల స్థానంలో నూతన బ్రిడ్జిలు నిర్మించాలని, రహదారులు అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కట్టలేరు..ఆ కథ వేరు!
తిరువూరు ప్రాంతం నుంచి ప్రవహించే కట్టలేరు, విప్లవవా గు, వెదుళ్లవాగు, పడమటివాగు, గుర్రపువాగులు గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరులో కలుస్తాయి. 2018 ఆగస్టు 28న తుఫానుకు వినగడపవద్ద కట్టలేరుపై గతంలో నిర్మించిన బ్రిడ్జి ధ్వంసమయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో రూ.13 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. టెండర్ల దశలో 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. గత ఏడాది మార్చి 19న తిరువూరు వచ్చిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వినగడప వద్ద కట్టలేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25 కోట్లు ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు అప్పటి ఎంపీ కేశినేని నాని, నలగట్ల స్వామిదాసుతో కలిసి వినగడప వద్ద కట్టలేరు వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలవకుండా స్టేట్ ప్లాన్‌గ్రాంటు రూ.25.60 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అప్పటి ఎమ్మెల్యే కె.రక్షణనిధి కార్యక్రమానికి హాజరుకాలేదు.
తాత్కాలిక రోడ్డుపై తిప్పలు
వినగడప వద్ద కట్టలేరుపై బ్రిడ్జి కూలడంతో గంపలగూడెం మండలం తోటమూల నుంచి విజయవాడ, నూజివీడు, కనుమూరు, అనుముల్లంక, కొత్తపల్లి, తెలంగాణ ప్రాంతంలోని పుణ్యక్షేత్రమైన జమలాపురంతోపాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కూలిన బ్రిడ్జి ప్రాంతంలో తాత్కాలిక రోడ్డు ఏర్పాటుచేశారు. అది కొద్దిపాటి వరదలకే కొట్టుకుపోతోంది. తిరిగి రోడ్డు నిర్మించడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డుపై వివిధ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.