ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:55 AM
ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సు నడపడంతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. నిత్యం రద్దీగా ఉండే ఏలూరు వెళ్లే జాతీయ రహదారిలో ప్రసాదంపాడు వద్ద శుక్రవారం విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న మెట్రో ఎక్స్‌ప్రెస్ 252బీ బస్సు అదుపుతప్పింది.

డ్రైవర్ ముందుచూపుతో తప్పిన ప్రమాదం
ఎదురు వాహనాలపైకి దూసుకెళ్తుండగా పక్కకు మళ్లించిన డ్రైవర్
కార్ల షోరూమ్‌లోకి వెళ్లి ఆగిన బస్సు
పలువురికి గాయాలు.. ప్రసాదంపాడు వద్ద ఘటన
ప్రసాదంపాడు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సు నడపడంతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. నిత్యం రద్దీగా ఉండే ఏలూరు వెళ్లే జాతీయ రహదారిలో ప్రసాదంపాడు వద్ద శుక్రవారం విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న మెట్రో ఎక్స్‌ప్రెస్ 252బీ బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో మూడు కార్లు, ఓ ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే..
డ్రైవర్ శ్యామ్‌ప్రసాదరావు కథనం మేరకు.. ‘ప్రసాదంపాడు ఏపీ సీడ్స్ వద్ద ఉన్న బస్టాప్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకున్నాను. నేను నడుపుతున్న బస్సు ఎదురుగా ద్విచక్ర వాహనాలు, కార్లు ఉన్నాయి. అదే సమయంలో స్కోడా షోరూమ్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద మూడు కార్లు వెళ్తున్నాయి. ఎడమ పక్కన మార్జిన్ వద్ద బస్సును నడుపుతున్నాను. యూటర్న్ వద్ద బ్రేక్ వేయాల్సి వచ్చింది. బ్రేక్ వేయడానికి ప్రయత్నించినా అవ్వలేదు. బ్రేక్ ఫెయిల్ అయినట్టు తెలిసింది. దీంతో బస్సు నిలపడం కష్టమని భావించాను. ముందుకెళ్తే చాలామంది చనిపోయే అవకాశముంది. దీంతో బస్సును ఆపడానికి ఫుట్‌పాతవైపు మళ్లించాను. బస్సు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్న స్కోడా షోరూమ్ గ్రిల్‌ను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వెళ్లి విద్యుత స్తంభాన్ని ఢీకొని, షోరూమ్‌లో పార్కింగ్ చేసిన కార్లపైకి వెళ్లి ఆగింది.’ అని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పటమట పోలీసులు కొత్త ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారిపై పది నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పటమట, నాల్గో ట్రాఫిక్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.