Share News

టెర్రర్‌ ట్రావెల్స్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:14 AM

ఙుఽ ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు పార్శిల్‌ ఇవ్వడానికి బుధవారం ఒక వ్యక్తి బెంజిసర్కిల్‌ వద్దకు వచ్చాడు. అనారోగ్యం కారణంగా అతనికి వాంతులు కావడంతో ఐదో నెంబరు పిల్లర్‌ వద్ద ఉన్న ఇనుప బారికేడ్‌ వద్ద ఆగాడు. అతడు వాంతు చేసుకుంటుండగా, అక్కడే నిలిపి ఉంచిన ట్రావెల్స్‌ బస్సును డ్రైవర్‌ ఒక్కసారిగా వెనక్కి తీసుకొచ్చాడు. దీంతో బారికేడ్‌కు, బస్సుకు మధ్య ఆ వ్యక్తి నలిగిపోయాడు. కడుపు లోపలి భాగాలు దెబ్బతినడంతో అంతర్గతంగా రక్తస్రావం జరిగి ఆసుపత్రిపాలయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే బెంజిసర్కిల్‌ ప్రాంతంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ పెత్తనం పెచ్చుమీరుతోంది. ఓవైపు జాతీయ రహదారి.. మరోవైపు సర్వీసు రోడ్డును ఆక్రమించేసి, ట్రాఫిక్‌కు అడ్డు బస్సులను నిలపడంతో పాటు మిగతా వాహనదారులకు దారి కూడా ఇవ్వకపోగా, పాదచారులకు ప్రాణసంకటంగా మారుతున్నారు.

టెర్రర్‌ ట్రావెల్స్‌
బెంజిసర్కిల్‌ మొదటి ఫ్లైఓవర్‌ నాల్గో నెంబర్‌ పిల్లర్‌ వద్ద అడ్డదిడ్డంగా నిలిపిన ట్రావెల్స్‌ బస్సులు

  • బెంజిసర్కిల్‌ వద్ద ప్రాణసంకటంగా ప్రైవేట్‌ బస్సులు

  • ఇష్టానుసారంగా రోడ్డుపైనే నిలిపివేత

  • ఎన్‌హెచ్‌, సర్వీసు రోడ్డును ఆక్రమించేసి పెత్తనం

  • ట్రాఫిక్‌కు అడ్డుగా, ప్రయాణికులకు ప్రాణసంకటంగా..

  • సర్వీసు రోడ్డును పార్కింగ్‌గా మార్చుకున్న సంస్థలు

  • నియంత్రణ లేకపోవడంతో బరితెగింపు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెంజిసర్కిల్‌ మొదటి ఫ్లైఓవర్‌ నాల్గో నెంబర్‌ పిల్లర్‌ వద్ద ట్రావెల్స్‌ బస్సులు ప్రాణసంకటంగా మారాయి. వ్యాపారం, ఆదాయంపైనే దృష్టిపెట్టిన ట్రావెల్స్‌ కంపెనీలు ఇక్కడ ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటు నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిని, ఇటు సర్వీసు రోడ్డును సొంత జాగీరులా మార్చుకుని బస్సులను నిలుపుతున్నాయి. రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బెంజిసర్కిల్‌ సర్వీసు రోడ్డులో ఇదో ప్రత్యక్ష నరకమని వాహనదారులు చెబుతున్నారు.

బస్సెనక బస్సు పెట్టి..

అసలే బెంజిసర్కిల్‌ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో బస్సెనక బస్సులు నిలుపుతున్నారు. తమ పని పూర్తయ్యాకే మిగిలిన వాహనాలకు దారి ఇస్తామన్నట్టు డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు. ట్రావెల్స్‌ కంపెనీ యజమానులు వారికి వంత పాడుతున్నారు. నారా చంద్రబాబునాయుడు కాలనీ నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లడానికి నాలుగు, ఐదు పిల్లర్లకు మధ్యన కటింగ్‌ ఉంది. ఇదే కటింగ్‌ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉంది. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బందరు రోడ్డుపై నుంచి వచ్చి జాతీయ రహదారి ఎక్కుతాయి. నారా చంద్రబాబునాయుడు కాలనీ నుంచి వచ్చే వాహనాలు నాల్గో నెంబరు పిల్లర్‌ వద్ద నుంచి జాతీయ రహదారిపైకి ఎక్కుతాయి. నిత్యం సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గాన్ని ట్రావెల్స్‌ బస్సులు మూసేస్తున్నాయి. ఒక బస్సు వెనుక మరో బస్సును ఆపేసి కటింగ్‌ను మూసేస్తున్నారు. దీంతోపాటు కటింగ్‌కు రెండు వైపులా బస్సులను నిలుపుతున్నారు. దీనివల్ల జాతీయ రహదారి నుంచి చంద్రబాబునాయుడు కాలనీలోకి వచ్చే వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. హారన్లు ఎంతసేపు మోగించినా బస్సు డ్రైవర్లలో చలనం ఉండట్లేదు. ప్రయాణికులను ఎక్కించుకుని, లగేజీని సర్దిన తర్వాతే ఇతర వాహనాలకు దారి ఇస్తున్నారు.

ప్రాణసంకటంగా..

ప్రయాణికులను ఎక్కించుకోవడంపై దృష్టి పెడుతున్న ట్రావెల్స్‌ డ్రైవర్లు ఇతరుల భద్రతను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని పార్కింగ్‌ ప్రదేశంగా మార్చేస్తున్నారు. ఎస్వీఎస్‌ కల్యాణ మండపం వద్ద రహదారికి ఇరువైపులా ట్రావెల్స్‌ బస్సులను నిలుపుతున్నారు. అక్కడే మరమ్మతులు చేస్తున్నారు. దీంతో రహదారిపై డీజిల్‌, ఇంజన్‌ ఆయిల్‌ పోస్తున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:14 AM