గుండెల్లో పేలుళ్లు
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:22 AM
అక్రమార్కుల ధనార్జనలో రైతుల గుండెలు బద్దలవుతున్నాయి. రాతి క్వారీల్లో రిగ్ బ్లాస్టింగ్‌ల కారణంగా బండరాళ్లు ఎగసి వందల మీటర్ల దూరంలో ఉన్న పచ్చటి పంటపొలాల్లో పడుతున్నాయి. కిలోమీటర్లకొద్దీ దుమ్మూధూళి వ్యాపిస్తోంది. ఫలితంగా ఆరుగాలం రైతన్నలు శ్రమించిన పంటలు బూడిదవుతున్నాయి. ఏమిటీ అన్యాయమంటూ ప్రశ్నించిన వారిపై క్వారీ యజమానులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. కేసులు పెడుతూ రైతులను వేధిస్తున్నారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న జి.కొండూరు మండలం గడ్డమణుగులోయ, గంగరాయిగుట్టలోని రాతి క్వారీల సమీపంలోని రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

గడ్డమణుగులోయ గంగరాయి గుట్టలో అక్రమ క్వారియింగ్‌తో అన్నదాతల అవస్థలు
ఎగిసిపడుతున్న బండరాళ్లు.. పాడైపోతున్న పంటపొలాలు
2 కిలోమీటర్ల మేర నాశనమవుతున్న వ్యవసాయ భూములు
రైతన్నల ఆందోళన.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన
చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు వేడుకోలు
కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి
జి.కొండూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : అక్రమ క్వారియింగ్‌లో పేలుళ్లు, దుమ్మూధూళి నుంచి తమ పంటలను కాపాడాలంటూ జి.కొండూరు మండలం గడ్డమణుగు లోయ గ్రామ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. లోయ ప్రాంతంలో పొలాలు సాగుచేసే అన్నదాతలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపల్లి రిజర్వు ఫారెస్టు సమీపంలో లోయలోని గంగరాయిగుట్ట ప్రాంతంలో 25 రాతి, గ్రావెల్ క్వారీలు ఉన్నాయని, ఇక్కడ రిగ్ బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఒక్కో రిగ్ బ్లాస్టింగ్‌కు 7 వేల అడుగుల లోతు తీస్తున్నారని చెబుతున్నారు. దీంతో 2 కిలోమీటర్ల మేర దుమ్మూధూళి గాల్లో లేస్తూ పరిసర ప్రాంతాలను కమ్మేస్తోందని చెప్పారు.
100 కిలోల రాళ్లు కూడా..
పేలుళ్ల ధాటికి 50 కిలోల నుంచి 100 కిలోల వరకు బండలు పొలాల్లో పడి పంటలు ధ్వంసమవుతున్నాయి. దుమ్మూధూళితో పాటు బండలు పడుతున్నందున.. చుట్టూ ఉన్న పొలాల్లోని పంట ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. కష్టపడి పండించినా నాణ్యత లేక ఎవరూ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పొలాల్లో పనిచేసేందుకు సైతం కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. పైగా బ్లాస్టింగ్ ధాటికి సాగునీటి బోర్లు సైతం కదిలిపోయి పూడిపోతున్నాయని, డ్రిప్ పరికరాలు పాడవ్వడంతో వాటిని పక్కన పెట్టేశామని, విద్యుత లైన్లపై పడి అవి తెగిపడిపోతున్నాయని, విద్యుత స్తంభాలు విరిగిపోతున్నాయని ఆవేదనతో చెప్పారు. సోలార్ పలకలు కూడా నాశనం అవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణం అక్రమ క్వారియింగ్ జరగకుండా చూడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇళ్లకు బీటలు
క్వారియింగ్, బ్లాస్టింగ్ వల్ల గడ్డమణుగు, చెర్వుమాధవరం, కట్టుబడిపాలెం, విద్యానగరం, మునగపాడు, జి.కొండూరు గ్రామాల్లో చాలామంది ఇళ్లు బీటలు వారాయి. బ్లాస్టింగ్ సమయంలో వచ్చే శబ్దంతో కిటికీలు, తలుపులు అదురుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే తాము ఇక ఇళ్లల్లో ఉండే పరిస్థితి ఉండదని, రిగ్ బ్లాస్టింగ్ కంట్రోల్ చేయాలని వారంతా వేడుకుంటున్నారు.
బూతులు తిడుతున్నారు.. : నూతక్కి అపర్ణ, గడ్డమణుగు ఎంపీటీసీ
రైతుల పంటలకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే క్వారీ యజమాని కోటేశ్వరరావు నోటి కొచ్చినట్టు బూతులు తిట్డాడని గడ్డమణుగు ఎంపీటీసీ నూతక్కి అపర్ణ పేర్కొన్నారు. ‘నా భర్తను ఇష్టానుసారంగా తిట్టాడు. అతనిపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాం. ఇప్పటికే అతనిపై చాలా కేసులున్నాయి. రైతుల్ని కానీ, స్థానిక ప్రజాప్రతినిధుల్ని కానీ లెక్కచేసే పరిస్థితి లేదు.’ అని ఆమె తెలిపారు.