కొత్త దారిలో..
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:04 AM
ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం విషయంలో కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. విజయవాడ ఈస్ట్ బైపాస్ రద్దయిన నేపథ్యంలో ఈ రింగ్‌రోడ్డును మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత అలైన్‌మెంట్ విషయంలో అనేక సవరింపులు చేయాలన్న వాదనలు వినిపిస్తుండగా, సీఆర్‌డీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సహేతుకమైనవని భావిస్తూ ముందడుగులు వేస్తున్నారు.

ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్చే యోచనలు
ఈస్ట్ బైపాస్ రద్దు కొరత తీర్చడం కోసమే..
కాజ-చోడవరం.. కేసరపల్లి వరకు మొదటి పనులు
కేసరపల్లి నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్‌లోకి..
అమరావతి ప్రధాన రహదారులకూ సమ్మిళితం
ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి కొండపల్లి దిగువన వెస్ట్ బైపాస్‌కు అనుసంధానం
చోడవరం వద్ద డ్యామ్ తరహా బ్రిడ్జి ప్రతిపాదన
తాజా ఆలోచనలతో ఖర్చు తగ్గే అవకాశం
ప్రజల డిమాండ్లతో అధికారుల్లో కొత్త ఆలోచనలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ నగరంలో 14 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. నగరం మూడుదిక్కులా 30 కిలోమీటర్లలోపు శివారు ప్రాంతాలన్నీ విజయవాడతో సమానంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నాయి. మొదట్లో నగరం నుంచి బయటకు వెళ్లాలంటే.. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ మాత్రమే దిక్కువగా ఉండేది. నగర విస్తరణతో కనకదుర్గ వారధి నిర్మించారు. కొద్దికాలం తర్వాత రెండో బ్రిడ్జి నిర్మాణం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి విజయవాడ నగరం.. కానూరు వరకు పెరిగిపోయింది. ఇలాంటి దశలో వీజీటీఎం-ఉడా (సీఆర్‌డీఏకు ముందున్న పట్టణాభివృద్ధి సంస్థ) ప్రస్తుత ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ ప్రకారం అర్ధ వలయాకారపు రింగ్‌ను వేయాలన్న ఆలోచన చేసింది. ప్రస్తుతం ఇన్నర్ అలైన్‌మెంట్ సాగే చోడవరం వద్ద బ్రిడ్జి ఏర్పాటుచేసి అర్ధ వలయాకారపు రోడ్డు వేయాలన్నది అప్పటి ప్రణాళిక. అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా కృష్ణానదిపై మరో బ్రిడ్జి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్ బైపాస్ ఎంతో అవసరంగా మారింది. దీనిద్వారా ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకున్నారు.
తూర్పు బైపాస్ రద్దుతో కొత్త ఆలోచనలు
తూర్పు బైపాస్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రద్దు వల్ల ఏర్పడనున్న ఇబ్బందులను అధిగమించాలంటే మాత్రం తప్పనిసరిగా ఇన్నర్ రింగ్‌రోడ్డులో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ప్రభుత్వం కూడా ఆ దిశగా కొత్త ఆలోచనలు చేస్తోంది.
కొత్త ప్రతిపాదనలు ఇలా..
ఇన్నర్ రింగ్‌రోడ్డును ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా దశలవారీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందు విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ-4 ముగిసే కాజ దగ్గర నుంచి కృష్ణాజిల్లా కేసరపల్లి వరకు మొదటి దశలో అలైన్‌మెంట్ చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. చోడవరం మీదుగా ఉప్పులూరు దిగువ నుంచి కేసరపల్లి వరకు దీని అలైన్‌మెంట్ వస్తుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంగా ఇది ఎన్‌హెచ్-16కు అనుసంధానమవుతుంది.
కేసరపల్లి నుంచి కొండపావులూరు మీదుగా వెళ్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్‌కు ఇన్నర్‌ను అనుసంధానించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాచేస్తే ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తియిపోయినట్టే అవుతుంది.
రాజధాని అమరావతిలోని ప్రధాన రోడ్లన్నింటినీ ఇన్నర్ రింగ్‌రోడ్డుకు అనుసంధానం కావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కాజ దగ్గర నుంచి రాజధాని ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్డుకు కలపాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నర్ ఎన్‌హెచ్-30 మీదుగా ముందుకు సాగుతూ కొండపల్లి దాటాక కుడివైపునకు తిరుగుతుంది. అనువైన చోట విజయవాడ వెస్ట్ బైపాస్‌కు అనుసంధానమవుతుంది.
తక్కువ వ్యయంతో..
ఈ మార్పుల వల్ల ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చాలా తక్కువ వ్యయమవుతుంది. టన్నెల్స్ నిర్మించే పరిస్థితి ఉండదు. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. భూ సేకరణ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. గుంటూరు జిల్లావారికి విజయవాడ ఎయిర్‌పోర్టుకు తేలికైన మార్గం ఏర్పడుతుంది. రింగ్‌రోడ్డును ఈ విధంగా మార్చటం వల్ల అన్ని ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానమవుతాయి. విజయవాడ వెస్ట్ బైపాస్, ఎన్‌హెచ్-16, 65, 30, ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ వంటి అనేక రహదారులు కూడా కలుస్తాయి. ఈ మార్పులపై విస్తృత అధ్యయనం చేస్తున్నారు. ఇలా చేస్తే విజయవాడ ఈస్ట్ బైపాస్ కొరతను తీర్చవచ్చు.