పైసలిస్తేనే పాస్‌పోర్టు వెరిఫికేషన్
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:25 AM
అష్టకష్టాలు పడి పాస్‌పోర్టు కార్యాలయంలో ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వస్తున్న అభ్యర్ధుల జేబులకు చిల్లులు పడుతున్నాయని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో ఓ పోలీసు అధికారి వేలకువేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓ పోలీసు అధికారి అక్రమార్జన
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో చుక్కలు
అన్నీ సక్రమంగా ఉన్నా ఏదో ఒక కొర్రీ పెట్టి వసూళ్లు
(ఆంధ్రజ్యోతి-గన్నవరం):
అష్టకష్టాలు పడి పాస్‌పోర్టు కార్యాలయంలో ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వస్తున్న అభ్యర్ధుల జేబులకు చిల్లులు పడుతున్నాయని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో ఓ పోలీసు అధికారి వేలకువేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేమని ప్రశ్నిస్తే ఫైల్ అప్రూవల్ చేయించాలా.. వద్దా? అంటూ భయపెడుతున్నారని, దిక్కుతోచక అడిగిన సొమ్ము చెల్లించి వెరిఫికేషన్ పూర్తి చేయించుకుంటున్నారని తెలుస్తోంది. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మూడు మండలాల్లో ఎవరు పాస్‌పోర్టు కు దరఖాస్తు చేసుకున్నా ఎస్‌బీ అధికారులు వెరిఫికేషన్ చేయాలి. అయితే ఈ వెరిఫికేషన్ కిందిస్థాయి అధికారులు కూడా చేయొచ్చు. కానీ, గన్నవరంలో మాత్రం ఓ అధికారి రంగంలో దిగి పాస్‌పోర్టు వెరిఫికేషన్లు చేస్తున్నారు. వెరిఫికేషన్‌కు వచ్చిన అభ్యర్థులు పైసలు చెల్లిస్తేనే ఫైల్ పైకి వెళుతుంది. లేకుంటే వారికి చుక్కలే. ఫార్మాలిటీస్ పేరుతో యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫైల్ పంపాలంటే బోలెడంత ఖర్చు అవుతోంది..మీకేం తెలుసు అంటూ గట్టి స్వరంతో మాట్లాడడంతో భయపడి నగదు చెల్లిస్తున్నారు. నెలకు సుమారుగా వంద వెరిఫికేషన్ల వరకూ వస్తాయని సమాచారం. దీనిబట్టి చూస్తే ఆ అధికారి వసూళ్ల పర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీ సం రూ.500 నుంచి ఆ పైన అభ్యర్థి ఇచ్చుకునేంత వరకూ డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వలేమని చెప్పినా ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ ఇళ్ల వద్దకు వెళ్లి చేయాలి. కానీ ఈ అధికారి మాత్రం తాను ఎంచుకున్న ప్రాంతానికి పిలిపించి చేస్తున్నారు. పోలీసులు అధికారి అక్రమ వసూళ్లను నివారించాలని అభ్యర్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పోలీసు అధికారి నిర్వాకాలు
ఆయనొక ఉపాధ్యాయుడు. కుమార్తె పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అది గన్నవరంలోని పోలీసు అధికారి దగ్గరకు చేరింది. వెంటనే ఆ అధికారి దరఖాస్తులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేశారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వచ్చిందని ఒరిజనల్ చూపించి సంతకాలు చేసి వెళ్లాలని సూచించారు. ఉపాధ్యాయుడు కుమార్తెతో కలిసి వచ్చి ఒరిజనల్స్ చూపించి సంతకాలు చేశారు. వెనుదిరిగి వెళుతుండగా ఫార్మాలిటీస్ రూ.వెయ్యి ఇవ్వాలని పోలీసు అధికారి అడిగారు. అదేంటి సార్ మీ పని మీరు చేశారు. దానికి ఫార్మాలిటీ ఏమిటని ఉపాధ్యాయుడు ప్రశ్నించారు. కుదరదు ఇవ్వాల్సిందే ఈ ఫైల్ మొత్తం పం పించాలంటే ఖర్చవుతుంది అనడంతో తప్పక రూ.వెయ్యి ఇవ్వాల్సి వచ్చింది.
ఆ విద్యార్థినిది మారుమూల గ్రామం. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తు పోలీసు అధికారి దగ్గరకు రాగానే ఫోన్ చేశారు. వచ్చి సర్టిఫికెట్లు చూపించి సంతకాలు చేసింది. ఆ అధికారి రూ.1500 అడిగారు. దీంతో వాళ్లు అవాక్కయ్యారు. వెరిఫి కేషన్ ఉచితంగా ఉంటుంది అనుకుని వస్తే ఇదేంటని నోరెళ్లబెట్టారు. అడిగిన నగదు ఇస్తేనే ఫైల్ పైకి పంపిస్తా లేకుంటే మీ ఇష్టం అని అధికారి చెప్పారు. దీంతో తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఆ అధికారి చేతిలో నగదు పెట్టి వెళ్లిపోయారు.