బరుల వద్ద కోలాహలం
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:33 AM
సంక్రాంతిని పురస్కరించుకుని మూడురోజుల పాటు కోడి పందేలు, జూదం జోరుగా సాగాయి. పోలీసులు పట్టనట్టు వ్యవహరించడంతో నగదు భారీగా చేతులు మారింది. కోడి పం దేలు తిలకించ డానికి భారీ సంఖ్య లో తరలిరావడంతో బరుల వద్ద కోలాహలం నెలకొంది.

మూడు రోజులు నిరాటంకంగా కొనసాగిన కోడిపందేలు, జూదం
మచిలీపట్నం టౌన్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): బందరు మండలం రుద్రవరం, మేకావారిపాలెం, తపసిపూడి, మంగినపూడి గ్రామాల్లో మూడోరోజు బుధవారం కూడా కోడిపందేలు, పేకాట, జూదం కొనసాగాయి. జూదరులు వాహనాలపై పెద్ద సంఖ్యలో బరుల వద్దకు వచ్చి జూదం ఆడారు. రూ.లక్షలు చేతులు మారాయి. పేకాటలో డబ్బు పోగొట్టుకున్నవారు లబోదిబోమంటూ వెళ్లారు. బరుల వద్ద మ ద్యం ఏరులై పారింది. కొన్నిచోట్ల యువకులు ఘర్షణకు దిగారు.
చేతులు మారిన రూ.లక్షలు
బంటుమిల్లి: మండలంలో కోడిపందేలు, జూదం జోరుగా సాగాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. చిన్న బరికి రూ.లక్ష నుంచి, పెద్ద బరికి రూ.3 లక్షల వరకు నిర్వాహకులు చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. రాత్రింబవళ్లు కోసు, పేకాట విద్యుత్ దీపాల వెలుగులో నిర్వహించారు. మద్యం ఏరులై పారింది. కొన్ని బరుల వద్ద ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు పోయాయని పందేలు చూడడానికి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ వెంచర్‌లో బరి..
మోపిదేవి: మూడురోజులపాటు కోడిపందేలు, జూదక్రీడలు కొనసాగాయి. పెదప్రోలు పంచాయతీ శి వారులోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో భారీగా కోడిపందేలు, గుండాట, చిత్తులాట నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా పందెపురాయుళ్లు తరలివచ్చారు.
వె లివోలులో భారీగా..
చల్లపల్లి: వెలివోలులో కోడిపందేలు, జూదాలు జోరుగా సాగాయి. వెలివోలు వంతెన దాటిన తర్వాత కరకట్ట దిగువన బరుల్లో సోమవారమే పందేలు ప్రా రంభమయ్యాయి. బుధవారం వరకూ కొనసాగాయి. జూదక్రీడలు కూడా నిర్వహించడంతో ఆ ప్రాంతం పం దెంరాయుళ్లు, జూదరులతో సందడిగా మారింది. పేకా ట, చిత్తులాట, లోనాబయటా నిర్వహించారు.
రాత్రీపగలు తేడా లేకుండా..
పెడన: మూడు రోజుల పాటు పట్టణంలో రాత్రీపగలు తేడా లేకుండా కోడి పందేలు, పేకాటలు నిర్వహించారు. పట్టణంలోని పల్లోటి స్కూల్ వెనుక, తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పెద్ద బరులు ఏర్పా టు చేసి కోడి పందేలు, పేకాటలు నిర్వహించారు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. భోగి రోజు ఉదయం ప్రారంభమైన కోడి పందేలు, పేకాటలు కనుమరోజైన బుధవారం సాయంత్రంతో నిలిచిపోయాయి. కనుమ రోజు కావడంతో బుధవారం పట్టణం లో చేపలు, మాంసం దుకాణాలు కిటకిటలాడాయి.
గూడూరు, జక్కంచర్ల, రామన్నపేటలో..
గూడూరు: గూడూరు, జక్కంచర్ల, రామన్నపేటలో కోడిపందేలు భారీగా నిర్వహించారు. మహిళలు సైతం కోడి పందేలు తిలకించేందుకు రావడం విశేషం. పలు చోట్ల పేకాట శిబిరాలు నిర్వహించారు.