పాకిస్థాన్ కాలనీ పేరు మార్పు
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:11 AM
మన దాయాది పాకిస్థాన్ పేరుతో నగరంలో ఉన్న కాలనీ పేరును ఎట్టకేలకు మార్చారు. పాకిస్థాన్ కాలనీ పేరు మార్చాలంటూ కాలనీవాసులు కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం కూడా ప్రచురితమైంది. ఇటీవల జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్ లక్ష్మీశకు కాలనీవాసులు మొరపెట్టుకున్నారు.
ఇక భగీరథ కాలనీగా అందుబాటులోకి..
స్థానికుల పోరాటానికి కలెక్టర్ లక్ష్మీశ చొరవ
పేరు మార్పునకు వీఎంసీ కౌన్సిల్‌కు ప్రతిపాదన
వెనువెంటనే పేరు మార్పు
అడ్రస్ మార్పునకు ఆధార్ కేంద్రం ఏర్పాటు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ ) : మన దాయాది పాకిస్థాన్ పేరుతో నగరంలో ఉన్న కాలనీ పేరును ఎట్టకేలకు మార్చారు. పాకిస్థాన్ కాలనీ పేరు మార్చాలంటూ కాలనీవాసులు కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం కూడా ప్రచురితమైంది. ఇటీవల జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్ లక్ష్మీశకు కాలనీవాసులు మొరపెట్టుకున్నారు. దీనిపై ఆయన చొరవ చూపించారు. ఈ కాలనీ కార్పొరేషన్ 62వ డివిజన్‌లో ఉంది. కాబట్టి కాలనీ పేరు మార్చాలంటే కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోవాలి. కానీ, జిల్లా యంత్రాంగం తరఫున మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 418 ప్రకారం పాకిస్థాన్ కాలనీ పేరు మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కమిషనర్ ధ్యానచంద్ర ప్రత్యేకంగా తీసుకుని కాలనీ పేరు మార్పునకు కౌన్సిల్ అనుమతి తీసుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశ సూచన మేరకు భగీరథ కాలనీగా నామకరణం కూడా చేశారు.
ఆ పేరెలా వచ్చింది..?
భారత, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది అక్కడి నుంచి ఇక్కడకు శరణార్థులుగా వచ్చారు. వారిలో కొందరికి నగరంలో ఆశ్రయం కల్పించారు. అప్పట్లో 40 కుటుంబాలకు ఇక్కడ తాత్కాలిక ఇళ్లు కూడా నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో ఈ ప్రాంతానికి పాకిస్థాన్ కాలనీగా పేరొచ్చింది. యుద్ధం ముగిశాక శరణార్థులంతా పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఇది జరిగిన కొద్దిరోజులకే బుడమేరుకు వరదలొచ్చాయి. నిరాశ్రయులైన వారికి ఎత్తయిన ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ కాలనీలో ఆశ్రయం కల్పించారు. కాలక్రమంలో ఆ కుటుంబాలు అక్కడే స్థిరపడిపోయాయి. ప్రస్తుతం ఈ కాలనీలో 60లోపు కుటుంబాలు ఉంటున్నాయి. వీరంతా సగర సామాజికవర్గం కావటంతో రాష్ట్ర క్షత్రియవర్ణ సగర సేవాసమితి నేతృత్వంలో కాలనీ పేరు మార్పునకు ప్రతిపాదన వచ్చింది. పేరు కారణంగా తమను దేశద్రోహులుగా చూసే పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన చెందారు. కలెక్టర్ చొరవతో పేరు మార్చడంతో ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారి ఆధార్ కార్డుల్లోనూ పాకిస్థాన్ కాలనీ మార్చేసి, భగీరథ కాలనీగా పేర్కొంటున్నారు. మునిసిపల్, రెవెన్యూ, సచివాలయ సిబ్బందిని నియమించి చిరునామాల మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.