Share News

దారి మారింది..!

ABN , Publish Date - Jan 28 , 2025 | 12:34 AM

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌లో స్వల్పంగా మార్పులు చేశారు. తుది డీపీఆర్‌ సిద్ధం చేసేలోపు ఈ మార్పులు, చేర్పులు జరిగాయి. అటవీ, కొండప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయి. మొత్తం తొమ్మిది లొకేషన్లను మార్చగా, రెండు లొకేషన్లలో మాత్రమే అలైన్‌మెంట్‌ బయటకు వచ్చింది. ఏడుచోట్ల లోపలికి జరిగింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఐదు, కృష్ణాజిల్లాలో రెండు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండుచోట్ల అలైన్‌మెంట్‌ మార్పులు జరిగాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి

దారి మారింది..!

  • ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు

  • ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 చోట్ల

  • ఎన్టీఆర్‌ జిల్లాలో 5, కృష్ణాజిల్లాలో 3 ప్రాంతాల్లో మార్పులు

  • మున్నలూరు, వల్లూరుపాలెం వద్ద కృష్ణానదిపై వంతెనలు

  • పేత్రంపాడు దగ్గర రెండు భారీ టన్నెల్స్‌

  • ఏపీ-తెలంగాణ సరిహద్దులో 8 కి.మీ రోడ్డు మార్గం

ఎక్కడెక్కడ?

  • ఎన్టీఆర్‌ జిల్లాలో.. : అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌లో కంచికచర్ల దగ్గర నాలుగు కిలోమీటర్ల మేర ఎగువకు పెరిగింది. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ప్రాంతం దిగువన చెన్నారావుపాలెం దగ్గర 6 కిలోమీటర్ల దూరం మేరకు బయటకు జరిగింది. మైలవరం దిగువ ప్రాంతం పూరగుట్ట కంటే దిగువన లొకేషన్‌-3లో మరో మూడు కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది. ఆ తర్వాత లొకేషన్‌-4లో భాగంగా గణపవరం గణపతి ఆలయం దిగువన 3 కిలోమీటర్ల మేర తగ్గుతూ లోపలికి జరిగింది. లొకేషన్‌-5లో భాగంగా ఈదర, పోతవరప్పాడు, ఆగిరిపల్లి ప్రాంతాల మధ్య నుంచి వెళ్తున్న అలైన్‌మెంట్‌లో 44వ కిలోమీటర్‌ నుంచి 48వ కిలోమీటర్‌ వరకు నాలుగు కిలోమీటర్ల దూరం లోపలికి జరిగింది.

  • కృష్ణాజిల్లాలో.. : అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌లో లొకేషన్‌-6లో భాగంగా నరసింగపాలెం, సగ్గూరు గ్రామాల్లో 52వ కిలోమీటర్‌ నుంచి 58వ కిలోమీటర్‌ వరకు 6 కిలోమీటర్ల దూరం మేర అలైన్‌మెంట్‌ బయటకు జరిగింది. లొకేషన్‌ నెంబర్‌ 7లో తరిగొప్పల, వేంపాడు, మారేడుమాక, తెన్నేరు మీదుగా వెళ్లే అలైన్‌మెంట్‌ 76వ కిలోమీటర్‌ నుంచి 80వ కిలోమీటర్‌ వరకు నాలుగు కిలోమీటర్ల మేర లోపలికి జరిగింది.

  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. : లొకేషన్‌ నెంబర్‌ 8లో భాగంగా సేలపాడు, వేజెండ్ల ప్రాంతాల్లో 116వ కిలోమీటర్‌ నుంచి 123వ కిలోమీటర్‌ వరకు 7 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్‌ లోపలికి జరిగింది. లొకేషన్‌-9లో భాగంగా మున్నలూరు, మోగులూరు ఎగువ ప్రాంతాల్లోనూ అలైన్‌మెంట్‌ లోపలికి, బయటకు మారింది.

తెలంగాణ సరిహద్దుగా..

ఓఆర్‌ఆర్‌.. ఎన్టీఆర్‌ జిల్లాలో దుగ్గిరాలపాడు దాటాక తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం వెంబడి 16వ కిలోమీటర్‌ నుంచి 24వ కిలోమీటర్‌ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర సాగుతుంది. రెండు రాష్ర్టాల మధ్య అవుటర్‌ రింగ్‌రోడ్డు ద్వారా చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. సరిహద్దు వెంట ఓఆర్‌ఆర్‌ ప్రారంభమైన చోట నుంచి కిలోమీటర్‌ దాటాక విజయవాడ-నాగపూర్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా ఖమ్మం-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డు అనుసంధానమవుతుంది.

ఇన్నర్‌ రింగ్‌-అవుటర్‌ రింగ్‌రోడ్డు ఎంత దూరం?

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నుంచి అవుటర్‌ రింగ్‌రోడ్డు మధ్య దూరం చూస్తే.. ఎన్టీఆర్‌ జిల్లాలో కట్టుబడిపాలెం నుంచి కుంటముక్కల వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణాజిల్లాలో దోనె ఆత్కూరు నుంచి పొట్టిపాడు వరకు 14 కిలోమీటర్ల దూరం ఉంది. నూతకి ్క నుంచి మున్నంగి వరకు 11 కిలోమీటర్ల దూరం ఉంది. కాజా నుంచి వెంకటాయపాలెం వరకు 23.14 కిలోమీటర్ల దూరం ఉంది.

తెలంగాణ సరిహద్దులో రెండు భారీ టన్నెల్స్‌

ఓఆర్‌ఆర్‌లో భాగంగా తెలంగాణ-ఏపీ సరిహద్దు దిగువన పేత్రంపాడు సమీపంలోని కొండప్రాంతం మీదుగా రెండు టన్నెల్స్‌కు జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రతిపాదించారు. దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన కొండప్రాంతం కావటంతో ఇక్కడ టన్నెల్స్‌ను ప్రతిపాదించారు. మొదటి టన్నెల్‌ 20వ కిలోమీటర్‌ నుంచి 23వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ వరకు వస్తుంది. రెండో టన్నెల్‌ 24వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ నుంచి 26వ కిలోమీటర్‌కు కాస్త ఎగువ వరకు ప్రతిపాదించారు.

కృష్ణానదిపై రెండు వంతెనలు

ఓఆర్‌ఆర్‌లో అంతర్భాగంగా.. కృష్ణానదిపై రెండుచోట్ల వంతెనలు రాబోతున్నాయి. కృష్ణాజిల్లాలో వల్లూరుపాలెం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వల్లభాపురం వరకు 4.8 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జికి ప్రతిపాదించారు. అలాగే, రెండో బ్రిడ్జి ఎన్టీఆర్‌ జిల్లాలోని మున్నలూరు నుంచి గుంటూరు జిల్లాలో ముత్తాయిపాలెం వరకు 3.15 కిలోమీటర్ల మేర ఉంటుంది.

Updated Date - Jan 28 , 2025 | 12:34 AM