శవ పంచాయితీ
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:18 AM
సాధారణంగా ఎవరైనా ప్రమాదంలో చనిపోయినా, అనుమానాస్పదంగా మరణించినా శవపంచనామా జరుగుతుంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మాత్రం శవ పంచాయితీ జరిగింది. అనాథ శవంగా నిర్ధారించుకుని దాన్ని పొరుగు రాష్ట్రంలోని వైద్య కళాశాలకు ఇచ్చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆసుపత్రికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆసుపత్రి అధికారులు తలలు పట్టుకున్నారు.

అక్టోబరులో ప్రభుత్వాసుపత్రికి అనాథ శవం
వైద్య కళాశాలకు ఇచ్చిన అధికారులు
మేమున్నామంటూ ఆలస్యంగా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు
నష్టపరిహారం చెల్లించాలంటూ శుక్రవారం హడావిడి
విజయవాడ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని దేవీనగర్‌కు చెందిన గోన శ్యాంసన్ (45) పెయింటర్‌గా పనిచేసేవాడు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. గత అక్టోబరు 27వ తేదీన మద్యం తాగి పటమటలోని స్టెల్లా కళాశాల ముందున్న సర్వీసు రోడ్డుపై పడిపోయాడు. అతడితో పాటు పనిచేసే కార్మికుడు శ్యాంసన్‌ను ప్రభుత్వాసుపత్రి క్యాజువాలిటీలో చేర్పించాడు. తర్వాత అక్కడి నుంచి ఆ కార్మికుడు వెళ్లిపోయాడు. ఆసుపత్రిలో చేరిన 40 నిమిషాలకు శ్యాంసన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు సంబంధించి బంధువులు ఎవరూ లేకపోవడంతో శ్యాంసన్‌ను అనాథశవంగా గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
నిబంధనల ప్రకారం..
మార్చురీలో ఉన్న అనాథ శవాల గురించి ఆసుపత్రి అధికారులు అవుట్‌పోస్టులో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తారు. వారం రోజుల వరకు వాటిని భద్రపరిచాక ఎవరూ రాకపోతే పోలీసులు వాటిని మున్సిపాలిటీకి సిబ్బందికి అప్పగించి, దహన సంస్కారాలు చేయించుకోవచ్చని నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం ఇస్తారు. శ్యాంసన్ 27వ తేదీన బయటకు వచ్చిన తర్వాత ఇంటి ముఖం చూడలేదు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాళ్లెవరూ శ్యాంసన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆయన మృతదేహాన్ని మార్చురీలో నవంబరు ఏడో తేదీ వరకు భద్రపరిచారు. శ్యాంసన్‌కు సంబంధించిన వారెవరూ రాకపోవడంతో మృతదేహాన్ని మున్సిపాలిటీకి అప్పగించవచ్చని మాచవరం పోలీసులు నిరభ్యంతర ధ్రువీకరణపత్రం ఇచ్చారు. ఆసుపత్రి అధికారులు అనాథ శవాల్లో కొన్నింటిని మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగిస్తారు. దేశంలోని వివిధ రాషా్ట్రల్లో ఉన్న వైద్య కళాశాలలు వైద్య విద్యార్థులకు శరీరంలో భాగాలను చూపించి బోధన చేయడానికి ఇవ్వాలని ప్రభుత్వాసుపత్రులకు లేఖలు రాస్తాయి. వాటిని ఆసుపత్రి అధికారులు ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తుంటారు. ఈవిధంగా శ్యామ్‌సన్ మృతదేహాన్ని తమిళనాడులోని ధనలక్ష్మి వైద్య కళాశాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి అధికారులు నవంబరు 10వ తేదీన అప్పగించారు.
జనవరిలో డెత సర్టిఫికెట్
శ్యామ్‌సన్‌ను ఆసుపత్రిలో చేర్పించిన కార్మికుడు జనవరిలో ఆయన కుటుంబ సభ్యులకు కనిపించాడు. ఆ సమయంలో ఆయన ఆచూకీ గురించి అడిగారు. రోడ్డుపై పడిపోయి ఉంటే ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. దీంతో వారు జనవరి 18వ తేదీన ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి సిబ్బంది ఫొటో చూపించి విచారించారు. దాన్ని చూపిన సిబ్బంది శ్యామ్‌సన్ చనిపోయాడని చెప్పారు. తర్వాత వారు ఆసుపత్రి అధికారులను ఆయన మరణ ధ్రువీకరణపత్రం ఇవ్వాలని అడిగారు. అధికారులు రికార్డులను పరిశీలించి శ్యామ్‌సన్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చారు. దాన్ని తీసుకుని వెళ్లిపోయిన కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. శ్యామ్‌సన్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. తాము నిబంధనల ప్రకారమే మృతదేహాన్ని వైద్య కళాశాలకు ఇచ్చామని ఆసుపత్రి అధికారులు వారికి వివరించారు. కాసేపు ఆసుపత్రిలో నానా హడావిడి చేశారు. పోలీసులు, ఆసుపత్రి అధికారులు పరిస్థితిని వివరించడంతో శాంతించి ఇంటికి వెళ్లిపోయారు. కాగా, శ్యామ్‌సన్ డెడ్‌బాడీని అప్పగించినప్పుడు సదరు వైద్య కళాశాల వారు రూ.లక్ష చెక్కు ఇవ్వగా, దానిని సిబ్బంది ఆసుపత్రి డెవలప్‌మెంట్ ఫండ్‌లో జమ చేశారు.