Share News

సరికొత్తగా..

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:54 AM

ఆశల ఉషోదయం వైపు అడుగులు పడుతున్నాయి. ఎన్నేళ్ల నుంచి కన్న కలలో ఒక్కొక్కటిగా వాస్తవంలోకి వస్తున్నాయి. కొండపావులూరులో ఏర్పాటుచేసిన కేంద్ర సంస్థలు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం భవనాలు ఈనెల 19న ప్రారంభంకానున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షల మేరకు, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో మంజూరైన ఈ భవనాలు వైసీపీ హయాంలో చతికిలపడ్డాయి. తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో పనులు పూర్తిచేసుకుని 19న కేంద్ర హోంమంత్రి అమితషా చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

సరికొత్తగా..
కొండపావులూరులో అందంగా సిద్ధమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ బ్లాక్‌

  • కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం భవనాలు

  • 19న అమితషా చేతులమీదుగా ప్రారంభం

  • ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఎంతో కీలకం

  • గతంలో టీడీపీ హయాంలోనే శంకుస్థాపన

  • వైసీపీ హయాంలో అడ్డుకునేందుకు కుట్ర

  • రోడ్డు బాగు చేయకుండా ఐదేళ్లపాటు ఇబ్బందులు

  • కూటమి ప్రభుత్వం రాకతో పూర్తయిన పనులు

  • సీఎం చంద్రబాబు ఆకాంక్ష.. వెంకయ్యనాయుడి సహకారంతో పూర్తి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కొండపావులూరు సమీపంలోని సూరంపల్లిలో ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను అందించే ‘సీపెట్‌’ సంస్థ ఇప్పటికే కొలువుతీరింది. కాగా, రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే నేషనల్‌ డిజాస్టర్స్‌ రెస్క్యూ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే ఫోర్స్‌ను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అందిస్తుండగా, వాటిని అధ్యయనం చేయటంతో పాటు ధీటుగా ఎదుర్కొనే విధానాలపై శిక్షణ కల్పించటం వంటివి ఎన్‌ఐడీఎం చేస్తుంది. ఈ రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు కొండపావులూరులో ఏర్పాటయ్యాయి.

గతంలో టీడీపీ హయాంలో..

దాదాపు 1,000 కిలోమీటర్ల సువిశాల సముద్రతీరం కలిగిన మన రాష్ర్టానికి విపత్తులను ఎదుర్కొనే సంస్థల అవసరం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ రెండు సంస్థలకు బీజం పడింది. వాస్తవానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ పదో బెటాలియన్‌ను 2012లోనే కేంద్రం మంజూరు చేసింది. అప్పట్లో తగిన స్థలం చూపించకపోవటం వల్ల క్యాంపస్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో నాగార్జున యూనివర్శిటీలో తాత్కాలికంగా దీనిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలో భూములు ఇవ్వటానికి ముందుకొచ్చారు. కొండపావులూరును ఎంపిక చేసి 50 ఎకరాలు కేటాయించారు. 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా ఎన్టీఆర్‌ఎఫ్‌ భవన సముదాయానికి శంకుస్థాపన జరిగింది. అలాగే, ఎన్‌ఐడీఎంకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 10 ఎకరాలను కేటాయించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌కు శంకుస్థాపన చేసిన సరిగ్గా ఏడాదికి అంటే.. 2018లో ఎన్‌ఐడీఎం భవనానికి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విపత్తు నిర్వహణలకు సంబంధించిన శిక్షణే ఇక్కడ ప్రధానమైనప్పటికీ పరిశోధనలు కూడా జరుగుతుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత రెండోస్థానంలో కొండపావులూరులోని ఎన్‌ఐడీఎం కావడం విశేషం. ఈ భవన సముదాయాలు పూర్తయ్యాక ఎన్డీఆర్‌ఎఫ్‌ పదో బెటాలియన్‌ చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. కొండపావులూరులో 11 బృందాలు పనిచేస్తున్నాయి. కర్ణాటకలో మరో 4 బృందాలు పనిచేస్తున్నాయి. పొరుగున ఉన్న హైదరాబాద్‌లో 1 బె టాలియన్‌, విశాఖలో మరో 2 బెటాలియన్లు పనిచేస్తున్నాయి.

వైసీపీ హయాంలో..

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎంలు ఏర్పాటవుతున్న ప్రాంతంలో సరైన రహదారులు కూడా లేకపోవటంతో భూములు సేకరించారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణానికి ఎలాంటి సహకారం అందించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎంలు పదేపదే వైసీపీ ప్రభుత్వానికి లే ఖలు రాసినా పట్టించుకోలేదు. సరైన దారి లేకపోతే పనులు జరగవని వైసీపీ భావించింది. అయితే, దారులు బాగోకపోయినా ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం భవనాల పనులు జరిగాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రహదారులను అభివృద్ధి చేసింది. దీంతో ప్రతిష్టాత్మక సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు కేంద్ర సంస్థలను ప్రారంభించడానికి కేంద్ర హోంమంత్రి అమితషా ఈనెల 18న నగరానికి చేరుకుంటారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సీఎం చంద్రబాబు నివాసంలో విందుకు హాజరవుతారు. ఆ తర్వాత నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో బస చేస్తారు. 19వ తేదీ ఉదయాన్నే కొండపావులూరు బయల్దేరతారు. హోంమంత్రి అమితషాతో పాటు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో అమితషా ప్రసంగిస్తారు.

Updated Date - Jan 17 , 2025 | 12:54 AM