Share News

పేరుకే..ప్రధాన జంక్షన్‌

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:55 AM

నగరంలోని ప్రధాన జంక్షన్‌లో రామవరప్పాడు రింగ్‌ సెంటర్‌ ఒకటి.

పేరుకే..ప్రధాన జంక్షన్‌
చెట్టు కింద నిలబడిన ఏలూరు, విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులు

రామవరప్పాడు రింగ్‌లో అన్నీ సమస్యలే

ప్రయాణికులు నిలబడడానికీ షెల్టర్లు లేని వైనం

చెట్ల కిందే బస్సుల కోసం పడిగాపులు

తాగడానికి మంచినీరు, కూర్చోవడానికి బల్లలు లేవు

(ఆంధ్రజ్యోతి-భారతీనగర్‌): నగరంలోని ప్రధాన జంక్షన్‌లో రామవరప్పాడు రింగ్‌ సెంటర్‌ ఒకటి. ఈ సెంటర్‌ ఏలూరు జాతీయ రహదారి వెంబడి ఉంటుంది. విజయవాడ నుంచి ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, అమలాపురం ప్రాంతాలకు వెళ్లే నాన్‌స్టాప్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులు, పలు ఆర్టీసీ బస్సులు ఈ సెంటర్‌ వద్ద ఆగుతాయి. ఈ జంక్షన్‌ నాలుగు రోడ్లకూడలి కావడంతో నిత్యం వాహనాలతో రద్ధీగా ఉంటుంది. అంత ప్రాధాన్యం ఉన్న కూడలిలో కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఎండలో పడిగాపులు

ఏలూరు, విశాఖపట్నం వెళ్లేందుకు నిత్యం వందలాది మంది ఈ సెంటర్‌కు వస్తుంటా రు. వారు వేచి ఉండడానికి బస్‌ షెల్డర్‌ లేకపోవడంతో రింగ్‌ సెంటర్‌లో ఫుట్‌పాత్‌ మీద చెట్టు కింద నిలబడుతున్నారు. మన లవ్‌ విజయవాడ సర్కిల్‌ వద్ద పాయకాపురం, కండ్రిక, పైపుల రోడ్డు, ముస్తాబాద, నున్న తదితర ప్రాంతాలకు వెళ్లే వారు, ముస్తాబాద రోడ్డులోని పలు ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగాలు చేసే వారు ఆటోల కోసం, కంపెనీల బస్సుల కోసం వేచి ఉంటారు. అక్కడ కూడా నిలబడడానికి షెల్టర్‌ లేదు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆటోల కోసం అవస్థలు పడుతున్నారు. అక్కడ ఒక చిన్న బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అనధికారంగా షెడ్డు

ఈ జాతీయ రహదారి గ్రీనరీలో ప్రయాణికులు సౌకర్యార్థం షెల్డర్‌ ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రైవేట్‌ వాహనాలు, ఆటో డ్రైవర్లు వారి కోసం అనధికారికంగా షెడ్డును ఏర్పాటు చేసుకుని, వాహనాలను రోడ్డుపైన నిలిపివేస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పురుషులు సమీపంలో ఉన్న కాలువ వైపుకు వెళుతున్నారు. వేసవికాలంలోనైనా అధికారులు బస్‌ షెల్డర్‌ నిర్మించాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:55 AM