Share News

నా‘నో’ యూరియా!

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:51 AM

బెజవాడ కేంద్రంగా బడా వ్యాపారుల కనుసన్నల్లో ఎరువుల అక్రమ వ్యాపారం జరుగుతోంది. వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును అధిక ధరలకు రైతులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రబీ సీజన్‌ ప్రారంభమైనా అధికారుల నిర్లక్ష్యం వల్ల మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార సంఘాలకు, ఆర్‌బీకేలకు ఇంతవరకూ యూరియా అందలేదు. యూరియా వ్యాపారుల సిండికేట్‌ను ప్రశ్నించేందుకు అధికారులూ సాహసించలేని పరిస్థితి.

నా‘నో’ యూరియా!

  • మార్క్‌ఫెడ్‌ నుంచి సకాలంలో అందని యూరియా

  • అదే అదనుగా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

(ఆంధ్రజ్యోతి, నందిగామ)

బహిరంగ మార్కెట్‌లో ఎరువుల ధరలను స్థిరీకరించటానికి మార్క్‌ఫెడ్‌ ద్వారా యూరియాను ప్రభుత్వం అందిస్తోంది. మార్క్‌ఫెడ్‌కు సకాలంలో యూరియా రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. దాళ్వా సాగుతో పాటు మిర్చి, మొక్కజొన్న పంటలకు ప్రస్తుతం యూరియా అవసరం ఎంతో ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతుల అవసరాలే ఆసరాగా.. ప్రైవేటు వ్యాపారులు రూ. 266లకు విక్రయుంచాల్సిన 45 కేజీల యూరియా బస్తా రూ.380 నుంచి రూ.450వరకు విక్రయిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులకు స్టాక్‌ లేదని సమాధానం చెబుతున్నారు. అదును పోతే పంట చేతికి రాదన్న బాధతో అడిగినంత చెల్లించి యూరియా కొనుగోలు చేస్తున్నారు.

నానో యూరియా ప్రమోషన్‌ వల్లే బ్లాక్‌ మార్కెట్‌ : వ్యాపారులు

యూరియా 45 కేజీల బస్తాకు కేంద్ర ప్రభుత్వం రూ.1170.79ల సబ్సిడీ ఇస్తోంది. పంటల వారీగా సరాసరి ప్రతి రైతు ఎకరాకు కనీసం మూడు బస్తాల యూరియా వినియోగిస్తారు. ప్రభుత్వంపై భారం పడుతున్న కారణంగా కేంద్రం నానో యూరియా, నానో డీఏపీలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. లీటరు రూ. 220లకే లభించే నానో యూరియాపై కేంద్రం ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇచ్చే అవసరం లేదు. యూరియా స్థానంలో నానో యూరియా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తున్నది. అయితే నానో యూరియాలో కేవలం 21శాతం మాత్రమే నత్రజని ఉండడంతో రైతులు 45శాతం నత్రజని ఉన్న సాంప్రదాయ యూరియా వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా యూరియాను భూమిలో వేయడం వల్ల నత్రజని గాలికి ఆవిరి కాకుండా మొక్కలకు అందుతుంది. నానో యూరియా స్ర్పే చేయడం వల్ల చాలా వరకు గాలిలో కలిసి పోతుందని రైతులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక భారం తగ్గించుకొనేందుకు నానో యూరియాను బలవంతంగానైనా వాడించాలని సంకల్పించింది. ఏళ్ల తరబడి యూరియా వినియోగం బల్ల భూములు సారం కోల్పోతాయని, నానో యూరియాతో మొక్కకు శక్తి రావడంతో పాటు భూసారానికి వచ్చే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నదాతలు మాత్రం నానో యూరియా వినియోగానికి మొగ్గు చూపడం లేదు. భారమైనా బ్లాక్‌లో కొనుగోలు చేసి మరీ సాంప్రదాయ యూరియానే వినియోగిస్తున్నారు.

వ్యాపారులకు సహకరించేలా మార్క్‌ఫెడ్‌ అధికారుల చర్యలు

రబీ ప్రారంభమైనా మార్కెఫెడ్‌ ద్వారా పంపిణీ జరగాల్సిన యూరియాను అధికారులు సిద్ధం చేయలేదు. మార్కెఫెడ్‌కు యూరియా వచ్చినా వ్యాపారుల లబ్ధికోసం పంపిణీలో జాప్యం చేశారని అధికారులపై అన్నదాతలు మండిపడుతున్నారు. సకాలంలో యూరియా అందజేస్తే తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు మార్కెఫెడ్‌ ఏర్పడిందని, అటువంటి మార్కెఫెడ్‌ను సైతం వ్యాపారులు బ్లాక్‌ చేసి తమ వద్ద ఉన్న సరుకు అమ్ముకొనే వరకూ పంపిణీ చేయకుండా నిలువరించారని ఆరోపిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారుల అవినీతికి తాము బలయ్యామని, నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

యూరియా బ్లాక్‌లో కొనవద్దు..

రబీకిసరిపడా యూరియా సిద్ధంగా ఉన్నట్టు జిల్లా అఽధికారిణి విజయకుమారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లాలోని మొత్తం 30 సహకార సంఘాలకు 25 టన్నుల చొప్పున 16,650 బస్తాల యూరియాను మార్క్‌ఫెడ్‌ నుంచి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వ్యాపారుల బ్లాక్‌ మార్కెట్‌ పైనా, మార్కెఫెడ్‌ నుంచియూరియా పంపిణీలో జాప్యంపైనా ఆమె సమాధానం దాటవేశారు. మార్కెఫెడ్‌కు కొంత ఆలస్యంగా సరుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. మార్కెఫెడ్‌ కంటే వ్యాపారులకు ముందుగా సరుకు ఎలా వచ్చిందన్న దానిపై వ్యవసాయ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. నానో యూరియాను అడ్డుపెట్టుకొని వ్యాపారులు దోపిడీ చేస్తుండగా, సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు రైతులను నానో యూరియా వైపు నడిపించాలని అధికారులు చూస్తున్నారు.

నానో యూరియా కొంటేనే సాధారణ యూరియా

నానో యూరియా ప్రమోట్‌ చేయడానికి అధికారులు డీలర్లకు నిబంధనలు పెడుతూ వస్తోంది. ఒక లారీ(20)టన్నుల యూరియా కొనుగోలు చేసిన వ్యాపారులు ఎనిమిది కేసుల నానో యూరియా కొనుగోలు చేయాలన్న నిబంధనను విధించారు. ఈ కారణాన్ని చూపుతూ వ్యాపారులు ఆ ధరను కూడా యూరియా బస్తాలపై వేసి రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:51 AM