ఎంజేపీ అంటే ఓ బ్రాండ్
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:13 AM
విద్యావ్యవస్థలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలు అంటేనే ఓ బ్రాండ్‌గా గుర్తింపు సాధించాయని బీసీ సంక్షేమ, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. సోమవారం మోపిదేవిలోని బీసీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోన్-2 గురుకుల పాఠశాలల ఆటల పోటీలను ఆమె సందర్శించారు.

మోపిదేవి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : విద్యావ్యవస్థలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలు అంటేనే ఓ బ్రాండ్‌గా గుర్తింపు సాధించాయని బీసీ సంక్షేమ, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. సోమవారం మోపిదేవిలోని బీసీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోన్-2 గురుకుల పాఠశాలల ఆటల పోటీలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల సొసైటీ బీసీ సంక్షేమశాఖ నిధులతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన 19 జట్ల క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్ పోటీలలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఎ్‌సఎల్‌వీ చంద్రయాన్-2 రాకెట్ నమూనాను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో విద్యావ్యవస్థను, రాషా్ట్రన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ భ్రష్టు పట్టించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరునెలల కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతిగృహాలు, గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తొలివిడతగా రూ.13వేల కోట్లను మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు కేటాయించారని తెలిపారు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనివ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన జట్లకు మంత్రి, ఎమ్మెల్యేలు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి కృష్ణమోహన్, సర్పంచ్ నందిగం మేరీ రాణి, ఎంపిపి రావి దుర్గావాణి, జడ్పీటీసీ మెడబలిమి మల్లిఖార్జునరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి, తహసీల్దార్ ఎం.శ్రీవిద్య, ప్రిన్సిపాల్ కె.వీరరవి తదితరులు పాల్గొన్నారు.
భావితరాల భవిష్యత కోసమే శంకరన్ రీసోర్స్ సెంటర్లు
మోపిదేవి : భావితరాల విద్యార్థుల భవిష్యత బాగుండాలనే ఉద్దేశ్యంతోనే అన్ని రంగాల్లోనూ విద్యార్థులు ప్రావీణ్యం సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎస్‌ఆర్.శంకరన్ రీసోర్స్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ మత్స్యకారుల ఆశ్రమ హాస్టల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎస్.ఆర్.శంకరన్ రీసోర్స్ సెంటర్‌ను ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్టల్, పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. భవిష్యతలో విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వం పాఠశాల స్థాయి నుండే అన్ని రంగాల్లోనూ నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారని బుద్దప్రసాద్ తెలిపారు. అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు.