Share News

అదృశ్యం వెనుక.. సాంకేతికథలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:06 AM

ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో చిన్నారులు ఎక్కువుగా మిస్సింగ్ అవుతున్నారు. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తిరిగిరావడం లేదు. ఈ మిస్సింగ్‌ల వెనుక అసలు స్టోరీ తెలియాలంటే ఈ కథనం చదవండి..

అదృశ్యం వెనుక.. సాంకేతికథలు

  • నగరంలో మైనర్ల మిస్సింగ్‌ కేసులు

  • సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా చాటింగ్‌లు

  • రీల్స్‌ పిచ్చిలో అమ్మాయిల వింత పోకడలు

  • వల వేసి లాగుతున్న పరాయి యువకులు

  • ఇంట్లో వారికి తెలియకుండా బయటి ప్రాంతాలకు..

  • అజితసింగ్‌నగర్‌, నున్న పీఎస్‌ల్లోనే ఎక్కువ

  • నెలకు 50కి పైగా ఈ తరహా మిస్సింగ్‌ కేసులే..

  • తాజాగా ముగ్గురు మైనర్లు అదృశ్యం

  • బెంగళూరు వెళ్తుండగా తెనాలిలో పట్టుకున్న పోలీసులు


విజయవాడ, ఆంధ్రజ్యోతి/అజితసింగ్‌నగర్‌ : ‘పాఠశాలకు వెళ్లిన మా అమ్మాయి ఇంకా ఇంటికి తిరిగిరాలేదు.’, ‘స్నేహితురాళ్లతో బయటకు వెళ్లిన అమ్మాయి కనిపించడం లేదు.’ అజితసింగ్‌నగర్‌, నున్న పోలీస్‌స్టేషన్లకు ఎక్కువగా అందుతున్న ఫిర్యాదులివి. ఈ తరహా ఘటనలకు సంబంధించి ఈ రెండు పోలీస్‌స్టేషన్లకు నెలకు 50కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అజితసింగ్‌నగర్‌, నున్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రజల జీవన స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఈ రెండు పీఎస్‌ల పరిధిలో విలాసవంతమైన కాలనీలు పెద్దగా ఉండవు. మిగిలిన కాలనీలన్నీ కూలీలు, మధ్యతరగతి వర్గాలకు చెందినవే. ప్రతి కుటుంబం నుంచి తల్లిదండ్రులు నిత్యం ఉదయం ఇంటి నుంచి ఏదో ఒక పనికి బయల్దేరి వెళ్తారు. కొంతమంది పిల్లలను ఇళ్ల వద్దే వదులుతారు. ఇంకొంతమంది పిల్లలను పాఠశాలలకు పంపుతుంటారు. ఈ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లను ఇచ్చి తల్లిదండ్రులు ఉపాధికి వెళ్తుంటారు. ఆండ్రాయిడ్‌ ఫోన్లు అరచేతిలో ఉండటంతో వారు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు.


ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌, షేర్‌చాట్‌ వంటి యాప్‌ల్లో వీడియోలను పోస్టు చేస్తున్నారు. ప్రతి పనినీ రీల్స్‌ చేసి ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌ల్లో పోస్టు చేస్తున్నారు. అందులో ఉన్న లైక్‌లను చూసి మురిసిపోతున్నారు. నెటిజన్లు చేసిన కామెంట్లతో మరిన్ని రీల్స్‌ చేస్తున్నారు. రీల్స్‌ మాయలో అవతలి వ్యక్తులు పంపిన రిక్వెస్టులను అంగీకరిస్తున్నారు. వారిని ఫాలో అవుతున్నారు. రిక్వెస్టులు పంపిన వ్యక్తులు ఎవరో తెలియకపోయినా ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత చాటింగ్‌లు చేసుకుంటున్నారు.


ఎక్కడి నుంచో నియంత్రణ

న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన బాలికలు అజితసింగ్‌నగర్‌లోని మదర్సాలో చదివి ఇంటి వద్దే ఉంటున్నారు. మూడు నెలల క్రితం బెంగళూరుకు చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. గురువారం యువకుడిని కలిసేందుకు బెంగళూరు వెళ్తున్నానని తన ఇద్దరు స్నేహితురాళ్లకు చెప్పగా, వారు కూడా వస్తామని బయల్దేరారు. బెంగళూరులోని యువకుడిని ముగ్గురు బాలికలు సంప్రదించగా, తెనాలిలో తనకు ఇద్దరు స్నేహితులు ఉన్నారని వారిని కలిసి అందరూ రావాలని సూచించాడు. దీంతో ముగ్గురు బాలికలు తెనాలిలోని ఇద్దరు యువకులను కలిశారు. వారు.. ఆ ముగ్గురిని ఓ ఇంట్లో ఉంచి మరుసటి రోజు బెంగళూరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అజితసింగ్‌నగర్‌ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో ముగ్గురు యువకుల బండి నెంబర్ల ఆధారంగా తెనాలి వెళ్లి ముగ్గురు బాలికలతో పాటు అలకుంట వేణు, కేతవత యువరాజ్‌నాయక్‌, పెద్ద వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర మండలంలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది ఉపాధి, సంపాదనలో తలమునకలై ఉంటారు. పిల్లలపై పర్యవేక్షణ చాలావరకు తక్కువగా ఉంటుంది. దీన్ని అమ్మాయిలు, అబ్బాయిలు అవకాశంగా మార్చుకుంటున్నారు. అబ్బాయిలు చెడు వ్యసనాలవైపు అడుగులు వేస్తున్నారు. అమ్మాయిలు మాయదారి పరిచయాలతో పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.


పిల్లలకు ఫోన్లను తగ్గించాలి

పిల్లలకు ఫోన్లు ఇచ్చి వదిలేయడం సరికాదు. అమ్మాయిలు ఫోన్లు ఉపయోగిస్తుంటే వారి ఫోన్లను తల్లిదండ్రులు తరచూ పరిశీలిస్తుండాలి. నిరంతరం ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌ వంటి యాప్‌లతో కాలక్షేపం చేస్తున్నప్పుడు కచ్చితంగా పరిశీలించాలి.

- గుణరాం, సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌

Updated Date - Jan 25 , 2025 | 10:33 AM