ఆదాయం కోసం ఆరాటం..!
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:17 AM
ఏడాది కిందట భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్‌లో ఓ ఎగ్జిబిషన్ జరిగింది. కృష్ణలంకకు చెందిన యువకుడు ఆ ఎగ్జిబిషన్‌కు వెళ్లి జైంట్‌వీల్ ఎక్కాడు. దానికి సమీపంలో ఎలాంటి రక్షణ లేకుండా విద్యుత తీగను వదిలేశారు. దీన్ని ఆ యువకుడు తాకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం విద్యాధరపురంలోని గ్రౌండ్‌లో కశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ జరుగుతోంది. దీనికి అనుమతి గడువు ముగిసింది. ఆ తర్వాత పొడిగించలేదు కూడా. అయినా ఎగ్జిబిషన్ మాత్రం నడుపుతున్నారు. ఓ షాపులో రేగిన మంటలు ఎగ్జిబిషన్‌లో సగభాగాన్ని చుట్టేశాయి. స్టాళ్లు, ఆటపరికరాలు సహా సర్వం అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే ఎగ్జిబిషన్‌లో కొద్దిరోజుల కిందట మరో ఘటన జరిగిందని తెలుస్తోంది. జైంట్‌వీల్ నుంచి పడి ఓ యువకుడు మరణించినట్టు ప్రచారం జరుగుతుండగా, పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. ..ఎగ్జిబిషన్లపై లక్షలాది రూపాయల ఆదాయాన్ని రుచిమరిగిన నిర్వాహకులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేసి షాపులను అద్దెలకిస్తున్నారు. ఇరుకిరుకు ప్రదేశాల్లో షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిప్రమాద ముందుస్తు ఏర్పాట్లను పైపైనే చేసుకుంటున్నారు. అనుమతులు ఇవ్వాల్సిన శాఖల మధ్య సమన్వయలోపంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. విద్యాధరపురంలోని కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.

అనుమతులు లేకపోయినా ఇష్టానుసారంగా..
బెజవాడ జలకన్య ఎగ్జిబిషన్ పరిస్థితి ఇదే..
జనవరి నెలాఖరుకే ముగిసిన గడువు
తర్వాత అనుమతి ఇవ్వలేదన్న వీఎంసీ అధికారులు
పోలీసుల నుంచి మాత్రం అనుమతి ఓకే..
గ్యాస్ సిలిండర్లు పేలి 20 షాపులు దహనం
రూ.10 లక్షల వరకూ ఆస్తినష్టం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సాధారణంగా వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల సమయంలో నగరంలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తుంటారు. కొంతమంది నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఖాళీ స్థలాలను అద్దెకు తీసుకుని వీటిని ఏర్పాటు చేస్తారు. మరికొంతమంది ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల్లో నిర్వహిస్తారు. నగరంలో ఎక్కువగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటిలో ఎగ్జిబిషన్లను నిర్వహించడానికి నగరపాలక సంస్థకు దరఖాస్తులు చేసుకుంటారు. ఖజానాకు ఆదాయం చేకూరుతుందన్న ఆలోచనలో వీఎంసీ ఈ స్థలాలను అద్దెకిస్తుంది. ఈ స్థలాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే ముందుగా అందులోని ఎస్టేట్ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి. దీంతో పాటు వీఎంసీకి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ రెండు అనుమతులు తీసుకున్నాక పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రైవేట్ స్థలంలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినా, ప్రభుత్వ శాఖలకు సంబంఽధించిన స్థలాల్లో నిర్వహించినా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. విద్యాధరపురంలోని కార్మికశాఖకు చెందిన స్థలంలో ప్రభాకర్ అనే వ్యక్తి కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌ను జనవరిలో ఏర్పాటు చేశాడు. మూడు నెలల పాటు అద్దెకు తీసుకున్నాడు. కానీ, జనవరి 2 నుంచి నెలాఖరు వరకు మాత్రమే అనుమతి లభించింది. ఈ ఎగ్జిబిషన్‌లో జైంట్‌వీల్‌తో పాటు వివిధ రకాల వినోద యంత్రాలను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా, మిగిలిన స్థలంలో రేకుల షెడ్లను ఏర్పాటుచేసి దుకాణాలుగా విభజించాడు. మొత్తం 38 దుకాణాలను ఏర్పాటుచేసి వివిధ వ్యాపారులకు అద్దెకిచ్చాడు. ఎగ్జిబిషన్ ముగిసే సమయానికి కనీసం రూ.50 వేలను అద్దెగా వసూలు చేస్తారు. ఇలా ఇక్కడ షాపులు నిర్వహిస్తున్న వారిలో ఉత్తరాదికి చెందినవారున్నారు. ప్రభాకర్ తీసుకున్న అనుమతులు జనవరి నెలాఖరుతోనే ముగిశాయి. అనుమతి పొడిగించాలని దరఖాస్తు చేసుకున్నానని, కార్పొరేషన్‌కు రూ.3.96 లక్షలు చెల్లించానని సదరు నిర్వాహకుడు చెబుతున్నాడు. జనవరి నెలాఖరు తర్వాత తాము అనుమతి ఇవ్వలేదని వీఎంసీ అధికారులు చెబుతున్నారు. తాము ఎన్‌వోసీ మాత్రమే ఇచ్చామని, ప్రైమరీ అనుమతి ఇవ్వలేదని వీఎంసీ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ను నిర్వహించడానికి వీఎంసీ ఎస్టేట్ విభాగం అనుమతి పొడిగించలేదని చెబుతోంది.
పోలీసులు ఎలా ఇచ్చారు?
వీఎంసీ ఇచ్చిన అనుమతి గడువు ముగిసింది. పొడిగింపునకు నిర్వాహకుడు ప్రభాకర్ డబ్బులు చెల్లించినా.. అధికారికంగా ఎలాంటి కాగితాలు ఇవ్వలేదు. ఇది లేకుండానే పోలీసు శాఖ ప్రభాకర్‌కు అనుమతినిచ్చింది. వీఎంసీకి డబ్బు చెల్లించిన రశీదులను చూపించి పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి నెలాఖరుకే గడువు ముగిసినా పోలీసులు ఈనెల 1 నుంచి 28వ తేదీ వరకు అనుమతి ఇవ్వడం గమనార్హం. డబ్బు చెల్లించుకున్న వీఎంసీ అధికారులు.. ఇప్పటి వరకు నిర్వాహకుడికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అనుమతిని పొడిగిస్తారా లేదా అనే విషయం కూడా చెప్పలేదు. పొడిగింపు దరఖాస్తులు ఎలాగూ అధికారుల వద్ద ఉండటం, పోలీసులు ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో ఎగ్జిబిషన్‌ను నడుపుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవని భావించాడు. అలాగే, ఎగ్జిబిషన్‌ను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించాలి. కానీ, రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
హోంమంత్రి ఆరా
అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. పశ్చిమ ఏసీపీ దుర్గారావుతో ఫోన్‌లో మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ పేలుడుతో మంటలు వ్యాపించాయని మంత్రికి ఏసీపీ వివరించారు. వేసవికాలం మొదలవుతున్నందున ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు, అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రాణనష్టం జరగలేదు : మున్సిపల్ కమిషనర్
ముగ్గురు అధికారులకు షోకాజ్
విద్యాధరపురం : అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రమాద స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో త్వరగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారన్నారు. కాగా వీఎంసీ ఎస్టేట్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, జోనల్ కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.