Share News

మండలాలకు పొంచి ఉన్న నీటి ఎద్దడి ముప్పు

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:52 AM

మండేకాలం వచ్చేసింది. ప్రారంభంలోనే భానుడు భగ భగలాడుతున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ప్రజల గొంతెండిపోతోంది! అక్కడక్కడ నీటి ఎద్దడి ఉత్పన్నం కానుంది. గ్రామీణ నీటిసరఫరా (ఆర్‌డబ్ల్యూఎ్‌స)లో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా ఆర్‌డబ్ల్యూఎ్‌సలో ఏ పని ముందుకు కదలని పరిస్థితి. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పలుమార్లు ఖాళీలను భర్తీ చేయాలని చెప్పినా ఉన్నతాధికారులకు పట్టడం లేదు. దీంతో ఈ వేసవిలో నీటి ఎద్దడి పరిస్థితులను ఎలా చక్కదిద్దుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మండలాలకు పొంచి ఉన్న నీటి ఎద్దడి ముప్పు

ఇప్పటికే గొంతెండుతోన్న గ్రామాలు

ఆర్‌డబ్ల్యూఎ్‌సలో అధికారుల కొరత!

ఎస్‌ఈ లేకుండానే ఎన్టీఆర్‌ జిల్లాలో పాలన

కృష్ణాజిల్లాలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి పోస్టు ఖాళీ

ఉమ్మడి జిల్లాలో సగం మండలాలకు ఏఈఈలు లేరు

క్షేత్రస్థాయిలో పనులు సాగక ఇన్‌చార్జిల ఇబ్బందులు

ఈఎన్‌సీ కార్యాలయంలో మూడు సీఈ పోస్టులు ఖాళీ

డిప్యూటీ సీఎం చెప్పినా ఖాళీలు భర్తీ చేయని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలకు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)స్థాయి అధికారులు లేరు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఈఈకి ఎఫ్‌ఏసీగా ఎస్‌ఈ బాధ్యతలు అప్పగించగా.. కృష్ణాజిల్లాలో డీఈఈకి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ), జిల్లా అర్‌డబ్ల్యూఎస్‌ అఽధికారి (డీఆర్‌ఈ)గా అదనపు బాధ్యతలను అప్పగించారు. క్షేత్రస్థాయిలో ఏఈఈలు లేక విధులను నిర్వహించటమే కష్టమైపోతుంటే.. అదనపు బాధ్యతలను అప్పగించటం వల్ల పర్యవేక్షణ కరువైంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంతో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయం ఉంది. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ సబ్‌ డివిజన్ల పరిధిలో డీఈఈలు ఉన్నా సగం మండలాల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. కృష్ణాజిల్లాలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ (డీఆర్‌ఈ) కార్యాలయంతో పాటు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయంతో పాటు బందరు, అవనిగడ్డ, గుడివాడ, పామర్రు, పెనమలూరు, గన్నవరం సబ్‌డివిజన్‌ కార్యాలయాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో సగం మండలాలలో ఏఈలు లేరు. ఈ ప్రభావం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఎస్‌ఈ కార్యాలయాలపైన పడుతోంది. ప్రస్తుతం ఓఅండ్‌ఎం స్కీమ్‌లను పర్యవేక్షించటం కూడా కష్టమవుతోంది. పనులను పర్యవేక్షించటం, జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేపడుతున్న ఆన్‌గోయింగ్‌, టెండరింగ్‌, డీపీఆర్‌ స్టేజీలో ఉన్న పనులు, ప్రతిపాదనలను పర్యవేక్షించటం, పరిశీలించటం చేయాల్సి ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇన్‌చార్జిలుగా ఉన్నవారు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎస్‌ఈ పోస్టులు ఉండగా కేవలం ముగ్గురే పనిచేస్తున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పనులు నూరు శాతం పూర్తయి ఉంటే ఉమ్మడి జిల్లాలో నీటి ఎద్దడి ఉండేది కాదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జేజేఎం పనులను అపహాస్యం చేశారు. కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌తోనే పనులు చేసి సగంలో వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవటంతో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అప్పట్లో కాంట్రాక్లర్లకు బిల్లులు చెల్లించకపోవటంతో వదిలేసిన పనులు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఈ వేసవిలో కూడా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలు ఉమ్మడి జిల్లాలో అనేకం ఉన్నాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నీటి ఎద్దడి మండలాలు ఇవే..

ఎన్టీఆర్‌ జిల్లాలో పశ్చిమ ఎన్టీఆర్‌ ప్రాంతంలో వీరులపాడు, వత్సవాయి మండలాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనే జాబితాలో ఉన్నాయి. అలాగే ఉత్తర ఎన్టీఆర్‌ఆర్‌ జిల్లాలో ఏ కొండూరు మండలం, తిరువూరు పట్టణం, గంపలగూడెం ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అలాగే కృష్ణాజిల్లాలో కృత్తివెన్ను, మచిలీపట్నం రూరల్‌, బంటుమిల్లి, నందివాడ, గుడివాడ రూరల్‌ మండలాల ప్రాంతాలలో తీవ్ర నీటి ఎద్దడి కొరత ఉంది. ఇన్‌చార్జిలు జిల్లా స్థాయి పరిపాలనా వ్యవహారాల మీద దృష్టి సారించలేకపోతున్నారు.

గొల్లపూడిలోని ఈఎన్‌సీ కార్యాలయంలో సీఈల కొరత

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కార్యాలయం పరిస్థితి ఇలాగే ఉంది. ఈఎన్‌సీ కార్యాలయంలో మూడు చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) పోస్టు ఖాళీగా ఉంది. ఒక సీఈకి ఈఎన్‌సీ ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. సీఈలుగా సీనియారిటీ ప్రకారం నియమించుకునే అవకాశం ఉన్నా ఉన్నతాధికారులు ఆ పనిచేయటం లేదు. ఖాళీ సీఈ పోస్టులకు సీనియారిటీ లేకుండా వేరొకరి పేరును ఉన్నతాధికారులు తెర మీదకు తెచ్చారు. గతంలోనూ సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా కొందరు అనధికారికంగా పదోన్నతులు పొందారు. దీనిపై కోర్టు విచారణ నడుస్తోంది. ఈఎన్‌సీ కార్యాలయంలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇక జిల్లా స్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవాల్సిందే.

Updated Date - Mar 06 , 2025 | 12:52 AM