ఫీజు.. ప్లీజ్
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:13 AM
వాహన కాలుష్య తనిఖీ ఫీజులపై నియంత్రణ కొరవడింది. కొన్ని అధీకృత ఏజెన్సీలు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. తప్పులను కప్పి పుచ్చుకోవటానికి కాలుష్య తనిఖీ పత్రాలను వాహన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకపోవడంతో ఫిట్‌నెస్‌కు దరఖాస్తు చేసుకున్న వాహనాలకు సామర్థ్య పరీక్ష చేయటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వాహన కాలుష్య తనిఖీ ఫీజుల్లో కొరవడిన నియంత్రణ
ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఏజెన్సీలు
ప్రశ్నిస్తున్నారని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ నిలుపుదల
మాన్యువల్ సర్టిఫికెట్లతో సరిపెడుతున్న ఏజెన్సీలు
వాహనాల ఫిట్‌నెస్ విషయంలో తీవ్ర ఇబ్బందులు
మూడు దశాబ్దాల కిందటి చార్జీల వల్లే అనధికారిక వసూళ్లు
ఫీజులను సవరించాలని ఏజెన్సీల విజ్ఞప్తి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన మోటారు వాహనాల చట్టం మేరకే ఇప్పటికీ వాహన కాలుష్య తనిఖీ ఫీజులు ఉన్నాయి. అప్పట్లో ద్విచక్ర వాహనానికి రూ.15, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.25, అన్ని రకాల డీజిల్ వాహనాలకు రూ.30 చొప్పున కాలుష్య తనిఖీ ఫీజుగా నిర్ణయించారు. కానీ, ఈ ఫీజులను ఏజెన్సీలు వసూలు చేయట్లేదు. అర్ధసంవత్సరానికి రూ.150-రూ.200 వరకు, సంవత్సరానికి రూ.300-రూ.400 వరకు అనఽధికారికంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై రవాణా కేటగిరీకి చెందిన వాహనదారుల నుంచి ఆర్టీఏకు ఎప్పుడూ ఫిర్యాదులు వచ్చేవి కావు. కానీ, రవాణాయేతర కేటగిరీకి సంబంధించి మాత్రం ఫిర్యాదులొస్తున్నాయి. కార్లు వినియోగించే వారు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు.
వాహన్ సైట్‌లో అప్‌లోడ్ చేయరు
వాహన కాలుష్యాన్ని తనిఖీ చేశాక ధ్రువీకరించే సర్టిఫికెట్‌ను వాహన్ సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తే వాస్తవంగా ఎంత ఫీజు ఉంటుందో వాహనదారుడికి తెలుస్తుంది. ఉదాహరణకు రూ.100 చెల్లించి వాహనానికి కాలుష్య తనిఖీ నిర్వహించాక ఏజెన్సీలు సదరు వాహనదారుడికి సర్టిఫికెట్‌ను ఇస్తారు. కానీ, వాస్తవ ఫీజు రూ.25లే. ఈ విషయం ఆ సర్టిఫికెట్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవరకు వాహనదారుడికి తెలియదు. రూ.25కు రూ.100 చెల్లించామని తెలుసుకుంటున్న వారు ఆర్టీఏకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ తర్వాత అధికారులు సదరు ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెడుతున్నారు. ఈ కారణంగా ఏజెన్సీలు వాహన్ సైట్‌లోకి అప్‌లోడ్ చేయకుండా కేవలం మాన్యువల్‌గా సర్టిఫికెట్లను ఇస్తున్నాయి. మాన్యువల్‌గా చేతికి ఇవ్వడం వల్ల వాహన్ సైట్‌లో అప్‌లోడ్ కావట్లేదు. ఫలితంగా కాలుష్య తనిఖీ ధ్రువీకరణ లేని వాహనాలుగానే కనిపిస్తున్నాయి. చాలాకాలంగా రవాణా శాఖ అధికారులు వాహన కాలుష్యంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించట్లేదు. ఏదైనా సందర్భంలో కాలుష్య తనిఖీ ధ్రువీకరణ పత్రం అడగడంతో వాహనదారులు మాన్యువల్ సర్టిఫికెట్‌ను చూపిస్తున్నారు.
ఫిట్‌నెస్ తంటాలు
వాహనాల ఫిట్‌నెస్ విషయంలోనే ఇబ్బంది తలెత్తుతోంది. వాహనాలకు ఫిట్‌నెస్ చేయించాలంటే కచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండి తీరాలి. అది కూడా మిగతా 2లో.. ‘వాహన్’లో అప్‌లోడై ఉండాలి. ఏజెన్సీలు మాన్యువల్‌గా సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాహన్ సైట్‌లో అప్‌లోడ్ కావట్లేదు. దీంతో ఆ వాహనం ఫిట్‌నెస్ లేనిదిగానే చూపిస్తుంది. కాగా, దాదాపు 36 ఏళ్ల కిందట నిర్దేశించిన వాహన కాలుష్య తనిఖీ చార్జీల వల్ల ఏజెన్సీలకు నిర్వహణ ఖర్చు కూడా రావట్లేదు. దీంతో నిర్దేశించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధీకృత వాహన తనిఖీ కేంద్రాల సంఘం నుంచి రేట్లను సవరించాల్సిందిగా డిమాండ్ వస్తోంది. కొన్ని ఏజెన్సీలు చేస్తున్న తప్పుల వల్ల అందరిపై మచ్చపడుతోందని, గిట్టుబాటయ్యే విధంగా రేట్లను సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో ఏజెన్సీలకు గిట్టుబాటు రేట్లను నిర్ధారించారని, ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తోంది.